Priyanka chopra: అందం, ఆరోగ్యం కోసం ప్రియాంక పాటించే సీక్రెట్ చిట్కాలివే, మీరూ పాటించేంత సులువు
Priyanka chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన రోగనిరోధక శక్తిని పెంచే మార్నింగ్ డ్రింక్ రహస్యాన్ని బయటపెట్టింది. దీంతో పాటే జుట్టు, చర్మం ఆరోగ్యం కోసం పలు సందర్భాల్లో ఆమె చెప్పిన చిట్కాలు కూడా ఒకసారి చూద్దాం.
ప్రియాంక చోప్రా తన అందం, ఆరోగ్యం కోసం ఖరీదైన మందులు క్రీములు వాడుతుంది అనుకుంటారు. కానీ వాటి కోసం ఆమె ఇంట్లోనే కొన్ని సహజ చిట్కాలు పాటిస్తుంది. చర్మం, రోగనిరోధక శక్తి, ఆరోగ్యానికి సంబంధించిన ఈ రహస్యాలను ప్రియాంక చోప్రా అనేక సందర్భాల్లో బయటపెట్టింది. అవేంటో తెల్సుకుని పాటించేయండి.
మార్నింగ్ డ్రింక్:
వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోగనిరోధక శక్తి కోసం ప్రతిరోజూ ఉదయాన్నే తాను తాగే ఇంట్లో తయారుచేసిన డ్రింక్ గురించి చెప్పుకొచ్చింది. “నా రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉదయాన్నే అల్లం, పసుపు, నిమ్మ రసం, తేనె కలిపిన గోరువెచ్చని నీరు తాగుతాను. ఎందుకంటే నేను ప్రతిరోజూ షూటింగ్‌లో పాల్గొనాల్సిందే. అనారోగ్యానికి గురై రోజులను వృథా చేయలేను” అని ప్రియాంక అన్నారు.
పాదాలకు వెల్లుల్లి:
వెల్లుల్లిని పాదాలపై రుద్దడం వల్ల దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ పురాతన చిట్కా వాపు, నొప్పిని తగ్గిస్తుంది. తన రాబోయే సినిమా ది బ్లఫ్ సెట్ లో గాయాల పాలైన తర్వాత, కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలను తన మడమలపై రుద్దిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది ప్రియాంక. వెల్లుల్లిలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని ప్రోత్సహిస్తుంది. పాదాలకు మర్దనా చేసినప్పుడు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
లిప్ స్క్రబ్
ఒక బౌల్ లో, సీ సాల్ట్, స్వచ్ఛమైన వెజిటబుల్ గ్లిజరిన్, రోజ్ వాటర్ కలపాలి. బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేయాలి. సున్నితంగా స్క్రబ్ చేయాలి. పెదాలను కడుక్కుంటే మృతకణాలు తొలిగిపోయి మృదువుగా మారతాయి.
బాడీ స్క్రబ్
ఈ బాడీ స్క్రబ్ డీ ట్యానింగ్ కోసం, అలాగే మృతకణాలు తొలగించడానికి సాయపడుతుంది. దీనికోసం ఒక కప్పు శెనగపిండి, పెరుగు, తాజా నిమ్మరసం, పాలు తీసుకోవాలి. మీకు జిడ్డు తత్వం ఉన్న చర్మం ఉంటే, స్కిమ్ మిల్క్ వాడాలి. అలాగే తక్కువ కొవ్వు పెరుగును ప్రత్యామ్నాయంగా ఉపయోగించమని ప్రియాంక సూచించారు. చివరగా గంధం పొడి, పసుపు వేసి కలపాలి.దీన్ని చర్మానికి అప్లై చేసి, ఆరనివ్వాలి. తర్వత మర్దనా చేస్తూ కడిగేసుకుంటే చాలు. బాడీ స్క్రబ్ పూర్తయినట్లే.
జుట్టు కోసం
పొడిబారిన మాడుతో పాటే చుండ్రు సమస్యతోనూ బాధపడుతుంటే, ప్రియాంక చెప్పిన ఇంట్లో తయారుచేసిన స్కాల్ప్ ట్రీట్‌మెంట్ సహాయపడుతుంది. ఒక గిన్నెలో కాస్త పెరుగు తీసుకోండి. దీనికి చల్లబరిచే లక్షణాలుంటాయి. పొడిబారిన మాడును హైడ్రేట్ చేస్తుందిది. తరువాత ఒక గుడ్డును పగలగొట్టి వేయండి. ఇది మొత్తం జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే మంచి లక్షణాలను కలిగి ఉంటుంది. తర్వాత విస్కర్ సాయంతో బాగా గిలక్కొట్టాలి. క్రీం లాగా తయారవుతుంది. దీన్ని తలకు అప్లై చేసి, ఆరిన తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.