రాధికా మర్చంట్ అంబానీ తన రిసెప్షన్ కోసం సాంప్రదాయ , వెస్టర్న్ శైలులను అందంగా మిళితం చేశారు. నూతన వధువు కస్టమ్ మేడ్ అనామిక ఖన్నా , ఇటాలియన్ డిజైనర్ డోల్స్ & గబ్బానా కలిసి చేసిన అద్భుతమైన దుస్తులను ధరించింది. బిలియనీర్ ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, ఎన్‌కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ వివాహం శనివారం ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో జరిగింది.
'శుభ్ ఆశీర్వాద్' వేడుకతో పాటు, ఈ రిసెప్షన్ కు కూడా భారతదేశంతో పాటు విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ప్రముఖులు అతిథుల జాబితాలో ఉన్నప్పటికీ కొత్త పెళ్లి కూతురు రాధిక అంబానీ తనదైన ఫ్యాషన్ ఎంపికతో అందరినీ ఆకట్టుకుంది. సంప్రదాయ ఎథ్నిక్ దుస్తులకు దూరంగా, క్లాసిక్ డిజైన్లో సమకాలీన ట్విస్ట్ ఉన్న అనామిక ఖన్నా నుండి విలక్షణమైన చీర-సిల్హౌట్ దుస్తులను ఎంచుకుంది. డాల్స్ అండ్ గబ్బానా యొక్క 2024 ఆల్టా మోడా సర్డెగ్నా నుండి రాధిక లగ్జరీ బంగారు కార్సెట్ ధరించింది. ఈ బోల్డ్ ఫ్యాషన్ చాయిస్ ఆమె శైలిని హైలైట్ చేసి గ్లామరస్ ఈవెంట్ లో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆమె తన జుట్టును లూజ్ గా వదిలేశారు. అలాగే స్మోకీ కళ్లతో, న్యూడ్ మేకప్ తో లుక్ పూర్తి చేశారు. ప్రీ వెడ్డింగ్ నుంచి రిసెప్షన్ దాకా ప్రతి లుక్ లో రాధిక అందరి దృష్టిని ఆకర్షించారు.
అంబానీ ఫ్యామిలీలోకి రాధికా మర్చంట్ గృహ ప్రవేశానికి ధరించిన లెహెంగా చూడ్డానికి కళ్లు సరిపోవు. ఆర్టిస్ట్ జయశ్రీ బర్మన్, ప్రముఖ డిజైనర్లు అబూ జానీ సందీప్ ఖోస్లా సహకారంతో రూపొందించిన చేతితో పెయింట్ చేసిన పింక్ లెహంగాలో వధువు మెరిసింది. సెలబ్రిటీ స్టైలిస్ట్ రియా కపూర్ రాధిక దుస్తులకు సంబంధించిన వివరాలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఈ లెహంగాలో 12 ప్యానెల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఇటాలియన్ కాన్వాస్ పై చేతితో పెయింట్ చేశారు.