Ragi bellam cake: రాగి బెల్లం కెేక్, చాకోలేట్ ఫ్లేవర్‌తో కుక్కర్లోనే చేసేయండి-see healthy and tasty ragi chocolate bellam cake recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ragi Bellam Cake: రాగి బెల్లం కెేక్, చాకోలేట్ ఫ్లేవర్‌తో కుక్కర్లోనే చేసేయండి

Ragi bellam cake: రాగి బెల్లం కెేక్, చాకోలేట్ ఫ్లేవర్‌తో కుక్కర్లోనే చేసేయండి

Koutik Pranaya Sree HT Telugu
Oct 10, 2024 03:30 PM IST

Ragi bellam cake: రాగిపిండి, బెల్లం, చాకోలేట్ కలిపి చేసే కేక్ ఇది. ఆరోగ్యానికి ఎంతో మంచి కేక్ రెసిపీ చాలా సులభంగా ప్రయత్నించవచ్చు. అదెలాగో చూడండి.

రాగి బెల్లం కేక్
రాగి బెల్లం కేక్

కేకులు తయారు చేయడానికి మైదా ఇంకా పంచదార లాంటివన్నీ ఉండాలి. అందుకనే ఇటీవల కాలంలో ఆరోగ్యం పై శ్రద్ధ ఉండే చాలా మంది కేకుల్ని తినడానికి వెనకాడుతున్నారు. అయితే అలాంటి వారు కూడా చక్కగా తినగలిగే ఆరోగ్యకరమైన కేక్‌ రెసిపీ ఇక్కడుంది. చక్కగా రాగి పిండి, బెల్లంతో ఈ హెల్తీ కేక్‌ని చేసేసుకోవచ్చు. ఒవెన్‌ లేని వారు గ్యాస్‌ స్టౌ మీదే కుక్కర్లో దీన్ని బేక్‌ చేసేసుకోవచ్చు.

చాక్లెట్‌ రాగి కేక్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు :

రాగి పిండి - రెండు కప్పులు,

బెల్లం పొడి - ఒక కప్పు,

పెరుగు - అరకప్పు పాలు - అరకప్పు,

నూనె లేదా నెయ్యి - పావు కప్పు,

వెనీలా ఎసెన్స్‌ - నాలుగు చుక్కలు ,

కొకోవా పౌడర్‌ - రెండు టీ స్పూన్లు,

బేకింగ్‌ సోడా - చిటికెడు,

బేకింగ్‌ పౌడర్‌ - ఒక టీ స్పూను

చాక్లెట్‌ రాగి కేక్‌ తయారీ విధానం :

  1. కేక్‌ పిండి తయారీ ఓవెన్, కుక్కర్లో ఎలా చేసుకోవచ్చో చూద్దాం.
  2. ముందుగా ఒవెన్‌ని 180 డిగ్రీల దగ్గర పది నిమిషాల సేపు ప్రీ హీట్‌ చేసుకోవాలి.
  3. కుక్కర్‌లో చేసుకోవాలని అనుకునే వారైతే ఇలా చేయండి. ముందు కుక్కర్‌ మూతకున్న గ్యాస్‌కెట్‌ తీసేయండి. స్టౌ వెలిగించి కుక్కర్‌ పెట్టి అందులో అడుగున అంతా ఉప్పు పోయండి. మూత పెట్టేసి పది నిమిషాల పాటు సిమ్‌లో ప్రీ హీట్‌ కోసం పెట్టుకోండి. ఆ తర్వాత పిండి కలుపుకోవడం మొదలు పెట్టండి.
  4. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో బెల్లం పొడి వేయండి. దానిలోనే పైన చెప్పిన కొలతల్లో పాలు, పెరుగు, వెనీలా ఎసెన్స్‌, నూనె వేయండి.
  5. బెల్లం పొడి మొత్తం కరిగిపోయి క్రీంలా అయ్యే వరకు కలపండి. ఇలా తయారు చేసుకున్న పల్చటి మిశ్రమంలో ఇప్పుడు పొడులు అన్నీ వేసి కట్ అండ్‌ ఫోల్డ్‌ మెథడ్‌లో బాగా కలపండి. అంటే రాగి పిండి, కొకొవా పౌడర్‌, బేకింగ్‌ సోడా, బేకింగ్‌ పౌడర్‌లు అన్నీ వేసి బాగా కలపండి.
  6. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఎక్కువ సేపు నిల్వ ఉంచకూడదు. బటర్‌ పేపర్‌, నూనె వేసి గ్రీజ్‌ చేసిన కేక్‌ టిన్‌లోకి పిండిని వేసుకుని ఒకసారి నేలకు తట్టండి. అప్పుడు ఎయిర్‌ గ్యాప్స్‌ ఏమైనా ఉంటే పోతాయి.
  7. దాన్ని ప్రీహీట్‌ చేసిన ఒవెన్‌లోగాని, కుక్కర్‌లో గాని పెట్టి దాదాపుగా 30 నుంచి 40 నిమిషాల పాటు బేక్‌ చేసుకోవాలి.
  8. గ్యాస్‌ మీద చేసుకునే వారు స్టౌని సిమ్‌లో పెట్టుకోవాలని గుర్తుంచుకోండి. కేక్‌ పూర్తిగా ఉడికింది అనుకున్న తర్వాత ఆ గిన్నెను బయటకు తీయండి. పూర్తిగా చల్లారిన తర్వాత డీ మౌల్డ్‌ చేయండి. కావాలనుకుంటే పైన కాస్త చాక్లెట్‌ సిరప్‌ని గాని, కరిగించిన చాక్లెట్‌ని గాని వేసి చక్కగా ఆనందించండి.

Whats_app_banner