Different Trend: ఈ నగలను డ్రెస్సు నుంచి విడదీయలేరు.. కొత్త ఫ్యాషన్ బాగుంది కదూ!
Jewellery embroidery: డ్రెస్సుల మీదికి నగలు వేసుకుంటాం కానీ డ్రెస్సులకే నగలు వచ్చే ఫ్యాషన్ మాత్రం కొత్తదే. ఇక ఇవి వేసుకుంటే ఏ నగల అవసరం ఉండదు. ఈ కొత్త ఫ్యాషన్ ట్రెండ్ గురించి తెల్సుకోండి.
బంగారాన్ని మర్చిపోయేలా రకరకాల డిజైన్లలో ఆర్టిఫిషియల్ ఇమిటేషన్ జ్యువెలరీ మార్కెట్లోకి వచ్చేశాయి. ప్రతి వేడుకకు తగ్గట్లు అద్దిరిపోయే డిజైన్లలో వాటిని తయారు చేస్తున్నారు. కానీ ఈ ఆభరణాలు సాంప్రదాయ వేడుకలకు మాత్రమే నప్పుతాయి. మోడర్న్ డ్రెస్‌లు వేసుకున్నప్పుడు ఆభరణాలు అంతగా పెట్టుకోలేం. అందుకేనేమో డిజైనర్లు కొత్త రకం డ్రెస్సులు కనిపెట్టేశారు.
డ్రెస్సులకే నగలు:
ట్రెండీ డ్రెస్సులు వేసుకున్నప్పుడు మెడలో చిన్న పెండెంట్ చెయిన్, చెవి దిద్దులు పెట్టుకోగలం అంతే. అలాకాకుండా వాటిలోనూ భిన్నమైన లుక్ వచ్చేలాగా, చూడ్డానికి హెవీ లుక్ వచ్చేలా డ్రెస్సుల మీదే ఆభరణాల డిజైన్లు అల్లేస్తున్నారు. అంటే డ్రెస్ మెడ భాగం చెప్పాలంటే యోక్ దగ్గర అసలైన ఆభరణాలే పెట్టుకున్నారేమో అనేంతగా డిజైనింగ్ చేస్తున్నారు.
భిన్న రకాలు, బోలెడు వెరైటీలు:
విక్టోరియన్ జ్యువెలరీ, స్టెప్ లైన్స్ జ్యువెలరీ, స్టోన్స్ జ్యువెలరీ.. ఇలా రకరకాల ఫినిషింగ్, డిజైనింగ్‌తో వీటిని తయారు చేస్తున్నారు. ఉదాహరణకు విక్టోరియన్ జ్యువెలరీ లాగా డిజైనింగ్ చేయాలనుకుంటే కాస్త డల్ ఫినిషింగ్ జరీతో వర్క్ లేదా ఎంబ్రాయిడరీ అచ్చం ఆ నగను తలపించేలా చేస్తారు. మీద అలాంటి ఫినిషింగ్ ఉన్న స్టోన్లు, సీక్వెన్లు జత చేస్తారు. హ్యాంగింగ్ బీడ్స్ లాంటివీ అచ్చం నగలాగే కనిపించేలా చేరుస్తారు.
రాధిక మర్చంట్ లుక్ వైరల్:
రాధిక మర్చంట్ బ్రైడల్ లుక్ గుర్తుండే ఉంటుంది కదా. దానికోసం ఆమె వంశపార్యంగా వస్తున్న యాంటిక్ చోకర్ వేసుకున్నారు. జతగా 5 వరసల వజ్రాభరణాన్ని వేసుకున్నారు. అయితే మనం ఆ నగలు వేసుకోవడం సాధ్యం కాని పని అనుకున్నారేమో.. అందుకే అచ్చం అలాంటి నగలు పోలిన ఎంబ్రాయిడరీని డ్రెస్సుల మీద వేసేస్తున్నారు.
మోడర్న్‌గా ఉంటాయి:
సాధారణంగా ఈ జ్యువెలరీ డ్రెస్సులో పొడవాటి మ్యాగ్జీ కుర్తాల మీదే డిజైనింగ్ చేస్తున్నారు. డ్రెస్ అంతా ప్లెయిన్‌గా ఏ డిజైన్ లేకుండా ఉంటుంది. కేవలం నెక్ దగ్గర మాత్రం ఏదైనా నగ డిజైనింగ్ ఉంటుంది. డ్రెస్ కోసం ట్రెండీ లుక్ వచ్చేలా వెల్వెట్, జార్జెట్ లాంటి వస్త్ర రకాల్ని ఎంచుకుంటున్నారు. అలాగే హై నెక్ డ్రెస్సుల మీద చోకర్ వేసుకున్నామా అనిపించేలా.. కేవలం మెడ దగ్గర ఆభరణం డిజైనింగ్ ఉన్న డ్రెస్సులు కూడా ప్రత్యేకమే.
విడదీయగలిగేలా నగలు:
మోడర్న్ డ్రెస్ మీద నగ వర్క్ ఐడియా బాగుంటుంది. కానీ, ప్రతిసారీ అలా హెవీగా వేసుకోలేం అనిపించొచ్చు. అలాంటివాళ్ల కోసమే రిమూవబుల్ రకాలూ ఉన్నాయి. అంటే డ్రెస్‌కు జతగా ఒక నగ డిజైనింగ్ ఇస్తారు. దానికి రెండు వైపులా క్లిప్పింగ్ ఉంటుంది. దాని సాయంతో డ్రెస్ ముందు వైపు, నడుము దగ్గర, వెనక కూడా అవసరం ఉన్నప్పుడు ఆ ఆభరణాన్ని జతచేసుకోవచ్చు. ఈ ఐడియా కూడా భలేగుంది కదూ.
టాపిక్