Pulusu Pulihora: శనగలు వేసి పులుసు పులిహోర ఇలా చేశారంటే రుచికి తిరుగుండదు
Pulusu Pulihora: శనగలు పులుసులో ఉడికించి చేసే పులుసు పులిహోర ఒకసారి ప్రయత్నించండి. చాలా టేస్టీగా ఉండే ఈ సింపుల్ రెసిపీ తయారీ ఎలాగో చూసేయండి.
శనగలతో పులుసు పులిహోర
శనగలతో చేసే పులుసు పులిహోర ఒక్కసారి తింటే మీకింక నిజంగానే ఏ పులిహోర నచ్చదు. అంత బాగుంటుంది దీని రుచి. మామూలు పులిహోరకు దీనికి చాలానే తేడా ఉంటుంది. పులిహోర తింటున్నప్పుడు పల్లీలు, పప్పులతో పాటూ పులుసులో ఉడికిన పుల్లటి శనగలు పంటికింద వస్తుంటాయి. తింటే కానీ దీని రుచి అర్థం కాదు. దీని తయారీ ఎలాగో చూసేయండి.
శనగల పులుసు పులిహోర తయారీకి కావాల్సినవి:
1 కప్పు కాబూలీ శనగలు లేదా నల్ల శనగలు
100 గ్రాముల చింతపండు
చిన్న బెల్లం ముక్క
5 కప్పుల అన్నం
అర టీస్పూన్ మినప్పప్పు
అర టీస్పూన్ ఆవాలు
అర టీస్పూన్ శనగపప్పు
పావు కప్పు పల్లీలు
అర టీస్పూన్ మిరియాలు
4 పచ్చిమిర్చి, చీలికలు
అర చెంచా పసుపు
2 చెంచాల నూనె
2 ఎండుమిర్చి
1 కరివేపాకు రెమ్మ
5 వెల్లుల్లి రెబ్బలు
శనగల పులుసు పులిహోర తయారీ విధానం:
- ముందుగా శనగలను రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ నీళ్లు వంపేసి వేరే నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చేదాకా శనగల్ని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు కొద్దిగా వేడి నీళ్లు పోసుకుని చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకోవాలి.
- ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో చింతపండు గుజ్జు, ఉప్పు, బెల్లం ముక్క వేసుకోవాలి. ఒక అయిదు నిమిషాలు వేడి చేస్తే గుజ్జు దగ్గరికి పడుతుంది. ఇప్పుడందులో ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి.
- సన్నం మంట మీద శనగల్ని గుజ్జులో బాగా ఉడకనివ్వాలి. చింతపండు పులుపు రుచి శనగల్లో ఇంకుతుంది. కనీసం పది నిమిషాలు ఉడికించుకుంటే చాలు. స్టవ్ కట్టేయొచ్చు.
- ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో నూనె వేసుకుని వేడి చేయాలి. ఆవాలు వేసి చిటపటమన్నాక మినప్ప్పప్పు, శనగపప్పు, పల్లీలు వేసుకొని వేయించాలి.
- తర్వాత పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి ముక్కలు వేసుకుని వేగనివ్వాలి. కరివేపాకు, వెల్లుల్లి ముద్ద కూడా వేసి కలుపుకోవాలి. పసుపు కూడా వేసి స్టవ్ కట్టేయాలి.
- ఈ తాలింపును ఉడికించుకున్న చింతపండు శనగల మిశ్రమంలో కలిపేసుకోవాలి. పులిహోర గుజ్జు రెడీ అయినట్లే.
- ఈ గుజ్జును అన్నాన్ని పొడిగా చేసి అందులో కలుపుకోవాలి. అంతే టేస్టీ శనగల పులుసు పులిహోర రెడీ అయినట్లే.
టాపిక్