Seasonal illness: సీజన్ మారగానే అనారోగ్యానికి గురవుతున్నారా? ఈ చిట్కాలు మీకు తప్పకుండా ఉపయోగపడతాయి!
Seasonal illness: సీజన్ మారిన ప్రతిసారి మీరు అనారోగ్యానికి గురవుతున్నారా? ఇంట్లో ఒకరి నుంచి మరొకరి పాకుతూ ఈ సమస్య మొత్తం కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుందా? అయితే మీ ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందే. మీ ఆహారంలో ఇలా 5 విధాలుగా తేనెను చేర్చుకున్నారంటే సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.
మారుతున్న వాతావరణం వ్యక్తుల ఆరోగ్యంపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. సీజన్ మారిన వెంటనే కొందరిలో జలుబు, జ్వరం, చర్మ సమస్యలు తలెత్తుతాయి. ఇందుకు కారణం అన్ని రకాల వాతావారణాన్ని తట్టుకునే శక్తి లేకపోవడమే. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వ్యక్తులనే ఈ సీజనల్ వ్యాధులు ఇబ్బంది పెడతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవడానికి ఏకైక మార్గం ఇమ్యూనిటీ పెంచుకోవడం.
తేనెనే ఎందుకు?
రోగనిరోధక శక్తిని పెంచడంలో తేనె చాలా బాగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు. తేనెలో ఉండే ఔషధ గుణాల కారణంగా దీనిని ఆయుర్వేదంలో వరంలా భావిస్తారు. తేనె రుచికరమైనది మాత్రమే కాదు, పోషకాల నిధి కూడా. ఇందులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, డైటరీ ఫైబర్, పొటాషియంతో పాటు యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు అనేక సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. సీజన్ మారిన ప్రతిసారి మీరు త్వరగా అనారోగ్యానికి గురవకుండా కాపాడుతుంది. ఇందుకు మీరు తేనెను ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకోండి.
తేనె నీరు
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి. ఈ తేనె నీటిని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో త్రాగండి. ఇలా చేయడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. మలబద్దకం వంటి సమస్యలు కూడా రాకుండా కాపాడుతుంది.
తేనె నిమ్మకాయ టీ
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె వేసి బాగా కలపండి. ఈ టీని వేడిగా త్రాగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది, గొంతులో మంట వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
తేనె-అల్లం సిరప్
ఒక గిన్నెలో నీటిని పోసి దాంట్లో కొద్దిగా అల్లం ముక్క వేసి స్టవ్ మీద పెట్టండి. చిన్న మంట మీద 10 నిమిషాల పాటు ఈ నీటిని మరిగించండి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకూ పక్కకు పెట్టండి. కాసేపటి తర్వాత ఈ టీని వడకట్టి, దానిలో తేనెను కలిపి త్రాగండి. ఈ చిట్కా రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, వాపును తగ్గిస్తుంది.
దాల్చిన చెక్కతో తేనె
శీతాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందడానికి, తేనె ఎంత ముఖ్యమో, దాల్చిన చెక్క కూడా అంతే ముఖ్యమైనది. ప్రతి రోజూ అర చిటికెడు దాల్చినచెక్క పొడిని తేనెతో కలిపి ఉదయాన్నే తాగండి. సీజనల్ వ్యాధుల నుండి రక్షణ పొందండి.
తేనె, పసుపు
జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందడానికి, అర టీస్పూన్ పసుపు పొడిని ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలిపి పేస్ట్ లా తయారు చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందడానికి ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకోండి.
వెల్లుల్లితో తేనె
పిండి రసం పిండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తినడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.