Saturday Motivation: మీలో నిరాశ కమ్మినప్పుడు మీకు మీరే ఇలా ధైర్యం చెప్పుకోండి, స్వీయ ప్రేరణ పొందండి-say this to yourself when you feel down get self motivated ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation: మీలో నిరాశ కమ్మినప్పుడు మీకు మీరే ఇలా ధైర్యం చెప్పుకోండి, స్వీయ ప్రేరణ పొందండి

Saturday Motivation: మీలో నిరాశ కమ్మినప్పుడు మీకు మీరే ఇలా ధైర్యం చెప్పుకోండి, స్వీయ ప్రేరణ పొందండి

Haritha Chappa HT Telugu
Sep 14, 2024 05:00 AM IST

Saturday Motivation: నిరాశను అధిగమించడానికి చాలా ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా స్వీయ ప్రేరణ చాలా అవసరం. మిమ్మల్ని మీరు ఎలా ప్రేరేపించుకోవాలో తెలుసుకోండి.

మోటివేషనల్ స్టోరీ
మోటివేషనల్ స్టోరీ (shutterstock)

ఏదైనా సాధించాలనుకుంటే మిమ్మల్ని మీరే ప్రేరేపించుకోవాలి. మీలో మీరే ధైర్యాన్ని నింపుకోవాలి. జీవితంలో రాణించాలంటే స్వీయ ప్రేరణ చాలా అవసరం. పరిస్థితులు ఎంత నిరాశపరిచినా కూడా మీ ఆత్మను, మనస్సును ఉన్నత భావాల వైపు నడిపించాల్సింది మీరే. కష్టాలను అధిగమించడానికి అవసరమైన శక్తిని కూడగట్టాల్సింది కూడా మీరే. కష్ట సమయాల్లో నిరుత్సాహపడితే యుద్ధం ముగియకముందే ఓడిపోవడం ఖాయం. మీరు నిరాశగా అనిపించినప్పుడు మీకు ఉత్సాహాన్ని నింపే వ్యాఖ్యలను చదవడం చాలా ముఖ్యం.

జీవితంలో వైఫల్యం, నిరాశ కమ్మినప్పుడు మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవాలి. ఇందుకోసం మీరు అద్దం ముందు నిలబడి మీతో మీరే మాట్లాడుకోండి. మీకు మీరే ధైర్యం చెప్పుకోండి. మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకోండి. ఈసారి ఓడిపోవచ్చు… మరోసారి గెలిచి తీరుతా అని చెప్పుకోండి.

ఆలోచనలు స్పష్టంగా ఉండాలంటే వాటిని ఒక చోట రాయండి. అలా చేయడం వల్ల మీ నిర్ణయాల్లో కూడా స్పష్టత వస్తుంది. మీకు ఎప్పుడైనా నిరాశగా అనిపించినప్పుడు కూడా మీ మనసులో మాట ఒకచోట అక్షరాల రూపంలో మార్చేందుకు ప్రయత్నించండి. ఇది మీ మనసును శాంత పరుస్తుంది. మీలో మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.

స్వీయ ప్రేరణ పొందే వారికి ఇతరుల అవసరం తక్కువగా ఉంటుంది. కాబట్టి స్వీయ ప్రేరణ కోసం మీతో మీరు కాసేపు సమయం గడపండి. ఒంటరిగా నడవండి. మీతో మీరు మాట్లాడుకోండి. ప్రతికూల ఆలోచనలను నియంత్రించుకోండి. కలలు కనడమే కాదు, వాటిని నెరవేర్చుకోవడం మీ బాధ్యత… అని మీకు మీరు చెప్పుకోండి.

ఏదైనా కోరుకుంటే సరిపోదు, దానికోసం కష్టపడాలి. స్థిరంగా నడుస్తూ వచ్చే అడ్డంకులను అధిగమించాలి. మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. అలా ఎప్పుడైతే పోల్చుకుంటారో, మిమ్మల్ని మీరు పాతాళానికి తొక్కేసుకున్నట్టే, మీరే మీ స్థాయిని తగ్గించుకున్నట్టు. కాబట్టి ఇతరులతో పోలికలు చేయకండి, మీతోనే మిమ్మల్ని పోల్చుకోండి. నిన్నటికీ ఈరోజుకి మీరు ఎంత మారారో గమనించండి. నెలరోజులు కిందటే వ్యక్తికి, ఇప్పటికీ మీరు ఎంతో కొంత అభివృద్ధి సాధించారా లేదా అన్నది అంచనా వేసుకోండి. అది మీలో ఉత్సాహాన్ని, శక్తిని నింపుతుంది. ఎప్పుడైతే మీ పక్కనున్న వారితో పోల్చుకుంటారో అది మీలో భయాన్ని నిరాశను కమ్మేలా చేస్తుంది.

విజయం అందుకోవడం అనేది అంతిమ ప్రయాణం కాదు. అలాగే వైఫల్యం కూడా చివరి అడుగు కాదు, మీరు విజయం సాధించినా, వైఫల్యం పొందినా కూడా మీ జీవితాన్ని మీరు కొనసాగించాలి. కాబట్టి అపజయం ఎదురవగానే నిరాశ పడిపోకండి. జీవితాన్ని కొనసాగించాలన్న ఆలోచనతో ముందుకే సాగండి. అందుకు మీరు మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలి.

మీరు వెళ్లే మార్గంలో ఏదైనా అడ్డంకులు వస్తే వెనక్కి తిరిగి వచ్చేయడం వల్ల మీరు కోరుకున్న గమ్యాన్ని ఎప్పటికీ చేరలేరు. మీకు ఏదైనా అడ్డంకి తొలగించుకుంటూ ముందుకు వెళ్ళండి, మీరు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు.

నిన్నటి గతాన్ని నిన్నతోనే వదిలేయండి. ఈరోజు కొత్తగా జీవితాన్ని ప్రారంభించండి. గతం ఎంత చేదుగా ఉన్నా కూడా ఈరోజు మీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. భవిష్యత్తు కూడా మీ కోసం ఆశగా చూస్తుంది. కాబట్టి గత భారాలను మోయకుండా వర్తమానాన్ని, భవిష్యత్తును విజయం వైపు నడిపించేందుకు స్వీయ ప్రేరణ పొందండి.