Jeans in Summer: వేసవిలో టైట్ జీన్స్‌కు గుడ్ బై చెప్పండి, లేకుంటే ఇలాంటి చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ
Jeans in Summer: వేసవిలో వదులుగా ఉన్న దుస్తులను వేసుకోవాలి. కానీ ఇప్పటికీ ఎంతో మంది యువత టైట్‌గా ఉండే జీన్స్ వేసుకొని బయటకు వెళ్తున్నారు. దీనివల్ల అనేక రకాల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Jeans in Summer: వేసవిలో ఎవరికైనా వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు త్వరగా వస్తాయి. వాటి బారిన పడకుండా ఉండాలంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువే. చర్మానికి ఎప్పుడైతే గాలి తగలదో... అప్పుడు కొన్ని రకాల చర్మవ్యాధులు రావచ్చు. చర్మానికి గాలి తగిలేలా వదులుగా ఉన్న డ్రెస్సులు వేసుకోమని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఇప్పటికీ కూడా టైట్ జీన్స్‌లో తిరుగుతున్న యువత అధికంగానే ఉంది. ఇలా జీన్స్ వేసుకోవడం వల్ల వేడి వాతావరణంలో శరీరం చర్మానికి అలెర్జీలు దద్దుర్లు, రింగువార్మ్స్, కాంటాక్ట్ డెర్మటైటిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

జీన్స్‌తో సమస్యలు
జీన్స్ గాలిని శరీరానికి తగలకుండా నిరోధిస్తాయి. శరీరానికి పట్టిన చెమటను కూడా ఆరిపోనివ్వవు. వేడి చెమట చర్మం పైనే ఎక్కువ కాలం అలా ఉండి శిలీంధ్రాల పెరుగుదలకు కారణం అవుతాయి. రోజులో ఎక్కువ సమయం పాటు ఇలా టైట్‌గా ఉండే జీన్స్ వేసుకోవడం వల్ల అక్కడ చేరిన చెమట, వేడి కలిసి చర్మ కణాలపై ఇన్ఫెక్షన్ లేదా అలెర్జీని కలిగిస్తాయి. తొంభై శాతం రింగ్ వార్మ్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. ముఖ్యంగా తొడల భాగంలో, గాలి తగలని మూలల్లో ఇలా వచ్చే అవకాశం ఉంది.
జీన్స్ తరచుగా ఉతకరు. కనీసం నాలుగైదు రోజులు వేశాకే జీన్స్ ప్యాంటును ఉతుకుతూ ఉంటారు. అలాంటి జీన్స్ ప్యాంట్లను వేసుకున్నాక చెమట, వేడికి గురైతే అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్లు మరింత త్వరగా పెరిగే అవకాశం ఉంది. జీన్స్‌కు అతుకున్న ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఒక్కసారి ఉతికితే పోవు. కనీసం నాలుగైదు సార్లు ఉతికితేనే జీన్స్ పై ఉన్న ఫంగస్, వైరస్, బ్యాక్టీరియా వంటివి పోతాయి.
వేసవి కాలంలో జీన్స్ వేసుకోదగ్గ ఫ్యాబ్రిక్ కాదు. కేవలం శీతాకాలం, వర్షాకాలంలోనే జీన్స్ వేసుకోవచ్చు. అవి చలిని తట్టుకుంటాయి. కానీ వేసవిలో జీన్స్ వంటి ఫ్యాబ్రిక్‌లను వేసుకోవడం వల్ల చర్మ సమస్యలు ఎక్కువైపోతాయి. జీన్స్ తయారీ ప్రక్రియలో అనేక రంగులను, రసాయనాలను వినియోగిస్తారు. ఇది కూడా చర్మంపై పట్టిన వేడికి, చెమటకు ప్రతి చర్యలు మొదలవుతాయి. దీని వల్ల కూడా చర్మ సమస్యలు ఎక్కువైపోతాయి. చర్మంపై పట్టిన చెమట పోతేనే అక్కడ బ్యాక్టీరియా నివసించకుండా ఉంటుంది. ఎప్పుడైతే చర్మంపై చెమట స్థిరంగా ఉండిపోతుందో అక్కడ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌కు గురిచేస్తుంది. అలాగే వాపులు, దురదలు వస్తాయి. విపరీతంగా మంట కూడా పుడుతుంది. చర్మం రంగు ఎర్రగా మారిపోతుంది.
ఎలాంటి దుస్తులు వేసుకోవాలి?
వేసవిలో బిగుతైన దుస్తులకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. శరీరానికి స్వేచ్ఛగా గాలి తగిలేలా ఉండాలి. అలాగే తమ శరీరానికి పట్టిన చెమటను పీల్చుకునే దుస్తులను వేసుకోవాలి. దీని వల్ల ఎలాంటి చర్మ సమస్యలు రావు. ఎక్కువగా కాటన్ దుస్తులను వేసుకుంటే మంచిది. వదులుగా ఉండడం వల్ల గాలి కూడా శరీరానికి తాకుతుంది. అలాగే పట్టిన చెమటను కూడా ఈ ఫ్యాబ్రిక్ పీల్చేస్తుంది. కాబట్టి ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు టైట్ దుస్తుల్లో ఉండకూడదు. సాధారణంగా కూడా శరీరానికి టైట్ దుస్తులు ఎక్కువసేపు మంచి చేయవు. ఇంటికి వచ్చాక చాలామంది ఆ జీన్స్ తోనే పడుకోవడం వంటివి చేస్తారు. ఇంటికి చేరుకున్నాక వదులుగా దుస్తులు వేసుకోవాల్సిన అవసరం ఉంది. గంటలపాటు జీన్స్ లాంటి టైట్ దుస్తులను వేసుకుంటే త్వరగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వేసవిలో చర్మాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే వదులుగా ఉండే కాటన్ దుస్తులను వేసుకోండి.