Saturday Vibes : నిన్ను చూసి నవ్వే వాళ్లే.. నిన్ను ఎదిగేలా చేసేది
Saturday Motivation : ఒక పని మెుదలుపెడితే.. చూసి నవ్వే వాళ్లు అనేకమంది. అయితే వారి నవ్వును చూసి కుంగిపోతే.. అక్కడే ఉండిపోతావ్. హేళన చేసే వారి నవ్వును మెట్లలాగా ఉపయోగించుకోవాలి.
ఏదో ఒక పని మెుదలుపెడతాం.. ఆ పని గురించి మనకేమీ తెలియదు. చేస్తుంటే.. తప్పులు జరుగుతాయి. పని మీద అవగాహన లేక అలా జరగడం సహజం. అయితే ఇదే అదునుగా కొంతమంది మనల్ని చూసి నవ్వుతారు. హేళన చేస్తారు. పరువు తీస్తారు. ఇలాంటి సమయంలో నువ్వు వాళ్ల మాటలకు భయపడితే.. అక్కడే ఉండిపోతావ్. పరువు తీసే వాళ్లు చాలా మందే ఉంటారు. చేయూతనిచ్చే వాళ్లు తక్కువగా మంది ఉంటారు. అందుకే.. నవ్వే వాళ్లను పట్టించుకోవద్దు.
ట్రెండింగ్ వార్తలు
మనల్ని చూసి నవ్వే వాళ్లను చూసి.. వారి నవ్వును మెట్లుగా వాడుకోవాలి. ఇలాంటి టైమ్ లో నువ్వు వాళ్ళ మాటలకు భయపడి పనిని మానేస్తే.. నీకెప్పటికీ ఆ పని గురించి తెలియకుండానే పోతుంది. నువ్వు విజయం చుట్టు పక్కలకు కూడా వెళ్లలేవు. ఎవరైనా తెలియదని నీతో అంటే.. సరే తెలియదని చెప్పు. వాళ్ళ మాటలను స్వీకరించు. నీకు తెలియదన్న నిజాన్ని ఒప్పుకో. అయితే ఓటమినీ మాత్రం అస్సలు ఒప్పుకోకు. తెలుసుకోవాలన్న కోరికను కూడా అస్సలు వదులుకోవద్దు.
ఒకటి గుర్తుపెట్టుకోండి.. నిన్ను ఎవరైతే హేళన చేస్తున్నారో వాళ్లు ఓ రకంగా నీకు మేలు చేస్తున్నట్లే. ఎందుకంటే నువ్వు చేసే పనిలో నీకేం రాదో నీకు చెబుతున్నారు. నేర్చుకో అని మీకు సలహాలు ఇస్తున్నారు. అది నువ్వు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. మీకు తెలియకుండానే.. మీమ్మల్ని చూసి నవ్వే వాళ్లు.. మీకు సలహాలు ఇస్తున్నారు. చెప్పకనే చెప్పే.. సూచనలు నువ్వు జాగ్రత్తగా స్వీకరించు. నువ్వు కచ్చితంగా ఎదుగుతావ్.
విజయం దగ్గరకు రావాలంటే.. కష్టపడాలి. మొదట్లో ఓడిపోతావేమో.. చిట్టచివరికి గెలుస్తావ్. నిన్ను హేళన చేసిన వారు నిన్ను చూసి నీతో మాట్లాడేందుకు వస్తారు. ఏదైనా పనిచేస్తున్నప్పుడు ముందుగా ఓటమి ఎదురవడం సహజం. అవమానాలు కూడా ఎదురవుతాయి. నువ్వు అనుకోగానే విజయం వచ్చేయదు.. అలాంటి విజయంలో కిక్ ఉండదు. మీ విజయం నలుగురికి పాఠం కావాలి. అవమానాలు రావాలి..., సవాళ్ళు రావాలి. వాటిని ఎదుర్కోవడంలో నువ్వు రాటు దేలాలి. అప్పుడే విజయంలో అసలైన కిక్ ఉంటుంది.
ఓపిక ఉన్నంత వరకూ కాదు.. ఊపిరి ఉన్నంత వరకూ పోరాడాలి. అలా చేస్తే.. ఓటమి నీ కాళ్ల దగ్గర.., గెలుపు నీ కళ్ల ముందు ఉండిపోతాయి. గెలుపు, ఓటమిని పక్కన పెట్టి.. అనుకున్న దారిలో నడవడం మాత్రం మానుకోకండి. మీరు సృష్టించిన గమ్యం కోసం గుంపుతో లేని సముహంలా, గురువు లేని ఏకలవ్యుడిలా పయనం సాగిస్తూనే ఉండాలి.