Saturday motivation: తొందరపాటు మాని.. మనసుల్ని గెలవండి..
Saturday motivation: తొందరపాటూ, ఆతృత వల్ల మన జీవితంలో అనేక అనర్థాలు జరగొచ్చు. ఈ అలవాటు మానుకుంటే ఎన్ని లాభాలో చూడండి.

ఆతృత, తొందరపాటు.. ఇవి కొన్నిసార్లు మంచివి. కొన్నిసార్లు అస్సలు కాదు. ఆలస్యం అమృతం విషం అన్న పెద్దవాళ్లే నిదానమే ప్రదానమూ అనీ చెప్పారు. కాబట్టి కొన్ని పనులు వీలైనంత తొందరగా చేయడం ఎంత ముఖ్యమో, కొన్ని పనుల్లో నిదానమూ అంతే ముఖ్యం. మాస్టారు తరగతి గదిలో ఒక ప్రశ్న అడిగినప్పుడు ప్రశ్న సగం పూర్తికాకముందే సమాధానం చెప్పడం ఆతృత. ఒక గొడవ జరిగినప్పుడు ఎదుటి వ్యక్తి ఏం చెబుతున్నారో వినకుండా వాదించడం తొందరపాటు. తొందరపాటు వల్ల ఎదుటివ్యక్తికే కాదూ మీకు ఇబ్బందే. దానివల్ల మీతో మాట్లాడటానికి ఎవ్వరూ ఇష్టపడరు.
ఎదుటి వ్యక్తి సంభాషణ మొదలు పెట్టినప్పుడు పూర్తయ్యేదాకా వినే ఓపిక ఉండాలి. మధ్యలో ఆపేసి మన విషయాలు మొదలెట్టకూడదు. ఎంత వింటే అంత తెలివి పెరుగుతుంది. ఎంత మాట్లాడితే అంత విలువ తగ్గుతుంది. మనం మాట్లాడి, మన గొప్పలు చెబితేనే మనం గొప్పోళ్లం అయిపోము. వాళ్ల మాటలు విని మంచి అభిప్రాయమో, సలహానో ఇచ్చినా నిదానమైన మనిషని వాళ్లకూ అనిపిస్తుంది.
మరోసారి మీతో ఇంకేమైనా విషయం పంచుకోవాలి అనిపిస్తుంది. అలాగే మాట్లాడేటప్పుడు ఆపకుండా బడబడా వాగేయకూడదు. మీ కుటుంబ సభ్యులతో, మీ గురించి తెల్సిన వాళ్లతో ఎలా మాట్లాడినా పరవాలేదు కానీ, బయటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఒక సెకను మీరు మాట్లాడే మాట గురించి ఆలోచించాకే బయటకు అనాలి. తొందరపాటుతో పనులు చేసినా, మాట్లాడినా చాలా అనర్థాలు జరగొచ్చు.
ఒక అడవిలో రెండు పిచ్చుకలు కాపురం ఉండేవి. ఒకరోజు మగ పిచ్చుక ఆడ పిచ్చుకతో "నాకూ పాయసం తినాలని ఉంది, చేసి పెడతావా?" అని అడిగింది. పాయసం చేయడం మొదలు పెట్టింది ఆడ పిచ్చుక. పొయ్యంటించి గిన్నెలో నీళ్ళు, బియ్యం పోసి ఉడకపెట్టింది. బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా? కాని మగ పిచ్చుకకు తినాలనే ఆతృత ఎక్కువై "పాయనం తయారయిందా?" అని అడిగింది. "ఇంకా బియ్యం ఉడక లేదు" అని చెప్పింది ఆడ పిచ్చుక కాసేపు ఆగి "ఇంకా అవలేదా?" అని అడిగింది మగ పిచ్చుక. "ఇప్పుడే పంచదార, పాలు కలిపాను, ఇంకొంచెం ఉడకాలి" అని అంటుంది. "పాయసం అయ్యిందా?" అని మగ పిచ్చుక అడిగిన ప్రశ్నకు ఆడ పిచ్చుక "అయ్యింది కానీ.." అని మాట పూర్తి చేయకముందే వేడి పాయసంలో మూతి పెట్టి కాల్చుకుంది మగ పిచ్చుక. ఆ కోపానికి పాయసం అంతా పడేసింది. "అయ్యింది కానీ.. చల్లారాలి అని నేను మాట పూర్తి చేయక ముందే తినబోయి ఎంత పని చేశావు" అన్నది ఆడ పిచ్చుక.
మగ పిచ్చుక గిన్నెలో మిగి లిన ఒక చుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది. ఎంతో రుచిగా ఉంది. తాను తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేసినందుకు బాధపడింది. ఓపిక లేకుండా తొందరపడడం మంచిది కాదని అప్పుడు తెలుసుకుంది.
ఇక్కడ పిచ్చుక తొందరపాటు వల్ల కేవలం రుచికరమైన పాయసం మాత్రమే పడేసుకుంది. మూతి కాల్చుకుంది. కానీ మనం నిజ జీవితంలో తొందరపాటు వల్ల పెద్ద అనర్థాలు జరగొచ్చు. మంచి అవకాశాలు మన చేజారిపోవచ్చు. కాబట్టి నెమ్మదస్తులుగా మారిపోకండి కానీ.. నిదానమే ప్రదానం అని రోజూ స్మరించండి.