Saturday Motivation: మంచి రోజులు రావాలంటే ముందుగా చెడు రోజులతో పోరాడాలి, అంతే తప్ప పారిపోకూడదు
Saturday Motivation: మీ జీవితం బావుండాలన్నా, మీ గమ్యాన్ని చేరుకోవాలన్నా... ముందుగా మీరు మానసికంగా సిద్ధపడాలి. ఎదురొచ్చే గడ్డు పరిస్థితులను, చెడు రోజులను చూసి పారిపోకూడదు.
Saturday Motivation: ప్రతి మనిషి రేపు అనే భవిష్యత్తు కోసమే జీవిస్తాడు. ఆ భవిష్యత్తు అందంగా ఉండాలని కోరుకుంటాడు. అలా అందంగా ఉండాలన్నా, ఆ అందమైన జీవితాన్ని అనుభవించాలన్నా... మంచి రోజుల కోసం వేచి ఉండడమే కాదు, ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న చెడు రోజులతో పోరాడాలి. లక్ష్యం ఉన్నవాడికి ఆ పోరాటం పెద్ద కష్టమేమీ కాదు. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరికను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు. ఏ లక్ష్యం లేని వాడు బ్రహ్మస్త్రాన్ని కూడా గడ్డిపరకల్లాగే వదిలేస్తాడు. కాబట్టి ముందుగా గట్టి లక్ష్యాన్ని పెట్టుకోండి. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పుడు కలిసి రాని కాలంతో పోరాటం చేయండి. ఓపికగా ఉండండి.
కాలం కలిసి రాకపోయినా, అనుకున్నది జరగకపోయినా... కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, లేదా ఆ పనిని అక్కడే వదిలేసి భయంతో పారిపోతారు. ఈ రెండూ కూడా మిమ్మల్ని మనిషిని చేయవు. మనిషిగా పుట్టిన తర్వాత ఎదురయ్యే ప్రతి పోరాటాన్ని స్వాగతించాల్సిందే. ఆ పోరాటంలో మీరు గెలిచినా, ఓడినా ప్రయత్నం మాత్రం చేయాల్సిందే. మీరు భయపడి వెనకడుగు వేస్తూ ఉంటే ఆ భయం మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ వెంటాడుతూనే ఉంటుంది. ఆ భయానికి ఎదురు వెళ్లి చూడండి, అది కళ్ళముందే మాయమైపోతుంది.
జీవితంలో మంచి రోజులు రావాలంటే... ఆ జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలవాలి. అప్పుడే మీకు విజయం సొంతం అవుతుంది. ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం మీకు ఉండాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు. మీరు ముందుగా గెలుపు గురించి కాదు, ఓటమిని తట్టుకునే శక్తిని పొందండి. కష్టాలను ఎదుర్కొనే ఓపికను పెంచుకోండి.
కాలం కలిసి రానప్పుడు నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవీ మిమ్మల్ని గెలిపించలేవు. కేవలం ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. కాబట్టి చెడు రోజుల్లో మీకు ఉండాల్సింది ఓర్పు, సహనం మాత్రమే. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒకచోట ఉపయోగపడుతుంది. ఈ కలిసిరాని కాలం కూడా మీకు అలాంటి జీవితానుభవాన్ని అందించే ప్రయత్నం చేస్తుందేమో. ఇలా సానుకూలంగా ఆలోచించి ఆ కష్టాలను దాటేందుకు ఓపికగా ఉండాలి.
జీవితమే ఒక యుద్ధ భూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఏ పనీ చేయకుండా నిలిచి ఉంటే మాత్రం... ఓటమి తప్పదు. కాబట్టి రోజులు బాలేదని తిట్టుకోవడం కన్నా, ఆ రోజులను ఎలా దాటాలో ఆలోచించండి.