ఏ పరిస్థితిలోనైనా విజయం సాధించాలంటే, ఎలాంటి కష్టాన్ని అయినా అధిగమించాలంటే నియంత్రణ చాలా ముఖ్యం. ఇక్కడ నియంత్రణ అంటే ఇతరుల మీద చూపించేది కాదు, మీ మీద మీకు నియంత్రణ ఉండాలి. దీన్నే స్వీయ నియంత్రణ అంటారు. ఇందులో ముఖ్యమైనది కష్టతరమైన, ప్రతికూలమైన, అసాధారణ పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండేలా మీ మనస్సును, శరీరాన్ని మలుచుకోవడం. ఎందుకంటే మన ఆలోచనలు, శారీరక కార్యకలాపాలు, మాటల్లో తొందరపాటు కారణంగా ఎక్కువగా తప్పులు జరుగుతాయి.
కొన్నిసార్లు ఈ పొరపాట్లు మిమ్మల్ని విజయానికి దూరం చేస్తాయి. సంతోషాన్ని దక్కనివ్వకుండా అడ్డుకుంటాయి. మీతో పాటు మీ చుట్టు పక్కల వారినీ, కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెడతాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మీ మనస్సుపై మీకు నియంత్రణ ఉండాలి. మీ మనస్సుపై మీకు నియంత్రణ ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా శాంతంగా ఉంటే.. ఏ రకమైన పరిస్థితులను అయినా ఎదుర్కోవడం సులభం అవుతుంది. ఇందుకోసం మీరు ఏం చేయాలో తెలుసుకోండి.
ఎవరైనా మీకు కోపం తెప్పించేలా ప్రవర్తిస్తే, మిమ్మల్ని తక్కువ చేసి చులకనగా చూపించే ప్రయత్నం చేస్తే 'నా ప్రతిస్పందన నా బలం, నేను దాన్ని ఇంత సులువగా చూపించను' అని మీతో మీరే చెప్పుకోండి. ఎందుకంటే కోపంలో స్వీయ నియంత్రణను కోల్పోవడం వల్ల శక్తి కూడా పోతుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయి.
చాలా తీవ్రమైన, డిప్రెషన్, ఒత్తిడితో కూడిన పరిస్థితులు వచ్చినప్పుడు మూడు సార్లు లోతుగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. 'నేను ఇక్కడ ప్రతిస్పందించడం అవసరమా.. లేదా?' అని ఆలోచించండి. శాంతంగా ఉండే వ్యక్తులు తమ ప్రతిస్పందనల విషయంలో అత్యవసరత చూపించరు. త్వరగా ప్రతిస్పందించే వారు చాలా సార్లు బలహీన వ్యక్తులుగా నిలుస్తారు. తొందరపాటు మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. బలహీనులను చేస్తుంది.
చాలా మంది పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నిస్తారు నిజానికి అది సాధ్యం కాని పని. పరిస్థితిని కాదు దానికి తగ్గట్లుగా స్వంత మనస్సును నియంత్రించడం అవసరం. మానసికంగా బలమైన వ్యక్తులు ఇదే సూత్రాన్ని పాటిస్తారు. ఏదైనా ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు గాబరా పడకుండా ప్రతి సమస్యకు సమాధానం ఉంటుందని గుర్తుంచుకోండి. “నేను ఇంతకు ముందు కూడా ఎన్నో కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. దీన్ని కూడా ఎదుర్కొంటాను.” అని మీకు మీరే ధైర్యం చెప్పుకోండి. అధికంగా ఆలోచించడం మానేసి, మీ చర్యలలో స్పష్టత తెచ్చుకోండి. దీనివల్ల సమస్యను త్వరగా నివారించవచ్చు.
ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు మీ మనస్సుపై మాత్రమే కాకుండా శరీర భాషపై కూడా నియంత్రణ ఉంచండి. వెన్నెముకను నిటారుగా ఉంచండి, ఛాతీని తెరిచి ఉంచండి, నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఇలా చేయడం వల్ల శరీర భాష నియంత్రణలో ఉంటుంది. మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
అన్ని పరిస్థితులను సానుకూలంగా మార్చుకోవడానికి ముందుగా మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రాకుండా చూడండి. నెగిటివ్ల ఆలోచనలు వచ్చినప్పుడు “ నా ఆలోచన సరైనదేనా ఇది కేవలం నా భ్రమేనా” అని మిమ్మల్ని మీరే ప్రశించుకోండి. మీ ఆలోచనలను మీరే మార్చుకోండి. ఇలా చేయడం వల్ల మీ మనస్సులో స్పష్టత పెరుగుతుంది. నిర్ణయాలను ప్రశాంతంగా తీసుకోగలుగుతారు.
సంబంధిత కథనం