Saturday Motivation : మన నిర్ణయాలే.. మన జీవితం.. మంచి అనుకుంటే మంచే జరుగుతుంది-saturday motivation good thoughts will give good life ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Saturday Motivation Good Thoughts Will Give Good Life

Saturday Motivation : మన నిర్ణయాలే.. మన జీవితం.. మంచి అనుకుంటే మంచే జరుగుతుంది

HT Telugu Desk HT Telugu
Sep 09, 2023 05:00 AM IST

Saturday Motivation : జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. మనం మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచే జరుగుతుంది. చెడు నిర్ణయాలు తీసుకుంటే చెడు బాటలోనే ప్రయాణించాల్సి వస్తుంది. దీనికోసం ఓ కథ కూడా ఉంది.

మన నిర్ణయాలే.. మన జీవితం
మన నిర్ణయాలే.. మన జీవితం (unsplash)

ఒక పెద్ద ఆశ్రమంలో శిష్యులు వృత్తాకారంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వారి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఒక పక్క దొంగకి ఎప్పుడూ చెడు జరుగుతుంది అని వాదించారు కొంతమంది. లేదు లేదు మంచి జరుగుతుందని మరికొందరు అన్నారు. అక్కడకు వారి గురువు వచ్చాడు. వారి మాటలు విని సమస్య ఏమిటని అడిగాడు. వారి మధ్య నడుస్తున్న వాదన గురించి చెప్పారు. అందులోని నిజానిజాలు వారికి అర్థమయ్యేలా ఓ కథ చెప్పడం మొదలుపెట్టాడు గురువు.

ట్రెండింగ్ వార్తలు

ఓ వ్యక్తి ఎక్కడెక్కడో తిరుగుతాడు. అతడికి కొన్ని యుద్ధ విద్యలు వచ్చు. చివరకు ఓ రాజు దగ్గరకు వెళ్లి సేవకుడు అవుతాడు. అయితే ఇదే సమయంలో రాజుగారి భార్యతో ప్రేమలో పడతాడు సేవకుడు. ఆమెకు కూడా అతడే అంటే ఇష్టం ఏర్పడుతుంది. అంత:పురం నుంచి పారిపోవాలని అనుకుంటారు. పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని వెళ్తారు ఇద్దరు. కొన్ని రోజులకు వారి దగ్గర ఉన్న డబ్బు అయిపోతుంది. డబ్బులు అయిపోయాక రాను రాను సేవకుడు తీరుపై రాజు భార్యకు విసుగువస్తుంది. దీంతో వదిలేసి వెళ్తుంది.

కొన్ని రోజులకు సేవకుడు బిచ్చగాడి అవతారమెత్తుతాడు. తాను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా కొన్ని మంచి పనులు చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇతడు బిచ్చమెత్తుకునే ప్రాంతానికి దగ్గరలోనే ఓ కొండ ఉంటుంది. జనాలు వెళ్లాలంటే ఆ కొండ దాటాలి. కొండపై ప్రమాదకరమైన రహదారి ఉందని, చాలా మంది చనిపోతున్నారని, గాయపడుతున్నారని తెలుసుకుని కొండ గుండా సొరంగం వేయాలని నిర్ణయించుకున్నాడు సేవకుడు.

పగటిపూట ఆహారం కోసం అడుక్కునేవాడు. రాత్రిపూట పనిచేసేవాడు. ముప్పై సంవత్సరాలు కష్టపడి సొరంగం 2,280 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో తవ్వుతాడు. ఇక కొన్ని రోజులు అయితే సొరంగం తవ్వడం అయిపోతుందనుకునే సమయంలో తన దగ్గర పని చేసి మోసం చేసిన వ్యక్తి సొరంగం తవ్వుతున్నట్టుగా రాజు తెలుసుకుంటాడు. ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తాడు. నువ్ నాకు చేసిన మోసానికి నా చేతులతో నిన్ను చంపేస్తాను అని రాజు చెబుతాడు. అప్పుడు సేవకుడు మీరు నన్ను చంపేయోచ్చు, కానీ నాకు ఒక కోరిక ఉంది, ఈ సొరంగం పూర్తి చేసిన తర్వాత చంపేయాలని కోరుతాడు.

దీంతో రాజు వెనుదిరిగి వెళ్తాడు. కానీ సేవకుడు నిజంగానే సొరంగం తవ్వుతున్నాడా లేదా.. అబద్ధం చెప్పి తప్పించుకోవాలనుకున్నాడా అని పరిశీలిస్తాడు. నిజంగానే సొరంగం తవ్వడం చూసి ఆశ్చర్యపోతాడు. ఇన్ని సంవత్సరాలు అయినా.. ఎందుకు ఒక్కడివే పని చేస్తున్నావని, నీకు ప్రతిఫలం కూడా ఉండదు కదా అని రాజు ప్రశ్నిస్తాడు. అప్పుడు తెలిసో.. తెలియకో మీకు మోసం చేశానని, ఆ తప్పుకు ఇప్పుడు ప్రాయశ్చిత్తంగా సొరంగం తవ్వుతున్నానని సేవకుడు బదులిస్తాడు. దీంతో రాజు ఆశ్చర్యపోతాడు. నా పని పూర్తి అయింది.. నన్ను నరికేయమని రాజుతో అనగా.. నువ్ ఒకప్పటి వ్యక్తివైతే నరికేసేవాన్ని.. ఇప్పుడు నువ్ పూర్తిగా మారిపోయావ్.. నువ్ తీసుకున్న నిర్ణయమే.. నిన్ను బతికేలా చేసిందని చెప్పి వెళ్లిపోతాడు రాజు.

దొంగగా ఉండి, తిరిగి మంచిగా ఆలోచిస్తే అతనికి మంచి జరుగుతుందని శిష్యులతో గురువు చెబుతాడు. అలా మనం తీసుకున్న నిర్ణయాలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. మన నిర్ణయాలే-మన జీవితం..

WhatsApp channel