Sarees for Bathukamma: బతుకమ్మ, దసరాకి ఏ చీర కొంటున్నారు? ఇప్పుడు ట్రెండింగ్ ఇవే..-saree shopping tips for bathukamma and dussehra festivals ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sarees For Bathukamma: బతుకమ్మ, దసరాకి ఏ చీర కొంటున్నారు? ఇప్పుడు ట్రెండింగ్ ఇవే..

Sarees for Bathukamma: బతుకమ్మ, దసరాకి ఏ చీర కొంటున్నారు? ఇప్పుడు ట్రెండింగ్ ఇవే..

Sarees for Bathukamma: బతుకమ్మ, దసరా పండగల రోజు ప్రత్యేకంగా కనిపించాలంటే మంచి చీరలు కొనాల్సిందే. ఈ సారి, ఈ సీజన్ లో ట్రెండింగ్ లో ఉన్న వెరైటీలేంటో తెలుసుకోండి.

ట్రెండింగ్ చీరలు (pexels)

దసరా, బతుకమ్మ కోసం షాపింగ్ మొదలు పెడదాం అనుకుంటున్నారా? అయితే ఈ పండగలంటేనే సాంప్రదాయ దుస్తులు. చీరలు, లెహెంగాలు, లంగావోనీలతో అందరూ అదరగొట్టేస్తారు. అయితే షాపింగ్ వెళ్లేముందు ఇప్పుడు ఈ సీజన్ లో ట్రెండింగ్ లో ఉన్న చీరలేంటి, రంగులేంటీ అని ఒక అవగాహన ఉండాలి. అయితేనే అందరి దృష్టిని ఆకర్షించే బట్టల్ని కొనుక్కోగలరు. ఇప్పుడు బాగా పాపులారిటీ ఉన్న చీరల రకాలు, రంగులు చూసేయండి.

మంగళగిరి చీరలు
మంగళగిరి చీరలు

మంగళగిరి పట్టు:

మన తెలుగు వాళ్లకి మంగళగిరి చీరల గురించి తెలీకుండా ఉండదు. కాటన్ తో చేసే ఈ చీరల్లో జరీ పనితనం ఉంటుంది. చాలా హుందాగా ఉంటాయి. ఇప్పుడు తక్కువ ధరల్లో, ఫ్యాన్సీ రకాల్లో కూడా ఇవి దొరికేస్తున్నాయి. వీటిలో చాలా రంగులే అందుబాటులో ఉంటాయి. యువతులకైనా, కాస్త మధ్య వయస్కులకైనా ఈ చీరలు నప్పేస్తాయి.

పైథానీ పట్టు:

రెండు వేల సంవత్సరాలకు పైగా ప్రాచీనమైన పనితనం పైథానీ. ఇది మహారాష్ట్రకు చెందింది. మల్బెర్రీ సిల్క్ తో ఈ చీరలు చేస్తారు. మంచి రంగురంగుల ప్రింట్లు ఈ చీరల ప్రత్యేకత. చీర మొత్తం మెరుస్తూ మంచి పట్టుచీర లుక్ లో ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గరా ఈ చీర ఒక్కటన్నా ఉండాల్సిందే. వీటిలో సీ గ్రీన్, బేబీ పింక్, పసుపు, ఊదారంగులో ఉన్నవి ఇప్పుడు కాస్త ట్రెండింగ్ అని చెప్పొచ్చు.

గద్వాల్, ఇక్కత్ చీరలు
గద్వాల్, ఇక్కత్ చీరలు

గద్వాల్, ఇక్కత్ చీరలు:

ఎన్ని సంవత్సరాలయినా ట్రెండ్ తగ్గని చీరలివి. ఇక్కత్, గద్వాల్ చీరలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కాస్త ధర ఎక్కువ అయినా కూడా ఈ చీరలు కట్టుకుంటే వచ్చే లుక్ వేరు. పండగరోజు ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. ఇదివరకటిలా కాకుండా ఇప్పుడు ఇవికూడా ఫ్యాన్సీ డిజైన్లలో వచ్చేశాయి. ముదురు, లేత రంగుల్లో అందుబాటులో ఉంటున్నాయి. మీకు నప్పే మంచి రంగుని ఎంచుకుని మెరిపించడమే.

షిబోరీ ప్రింట్ చీరలు
షిబోరీ ప్రింట్ చీరలు

ట్రెండింగ్ ప్రింట్లు:

పట్టులో కాకుండా కాస్త ఫ్యాన్సీలో తీసుకుందాం, ట్రెండీగా కనిపిద్దాం అనుకుంటే వెరైటీ ప్రింట్ చీరల్ని ఎంచుకోవచ్చు. పిచ్వాయీ ప్రింట్స్, షిబోరీ ప్రింట్లు, ఫ్లోరల్ డిజైన్, కళంకారీ ప్రింటెడ్, డిజిటల్ ప్రింట్ ఉన్న చీరలు ఎంచుకోవచ్చు. ఇవన్నీ కాస్త తక్కువ వయస్సున్న వాళ్లకి బాగా సెట్ అవుతాయి. ముదురు రంగుల్ని ఎంచుకుంటే పండగ రోజు మెరిసిపోతారు.

ట్రెండింగ్ రంగులు:

ముదురు రంగుల కన్నా కాస్త లేత రంగులకే ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెళ్లి కూతుర్లు కూడా లేత రంగు దుస్తులకే మొగ్గు చూపుతున్నారు. అవే ట్రెండింగ్ మరి. స్కై బ్లూ, లేత గులాబీ, లేత ఊదారంగు, మింట్ గ్రీన్, క్రీం, పేస్టల్ రంగులున్న వాటిని ఎంచుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు.