Sajja Halwa: సజ్జ పిండితో ఇలా హల్వా చేయండి, రుచికి రుచి పైగా ఎంతో ఆరోగ్యం-sajja halwa recipe in telugu know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sajja Halwa: సజ్జ పిండితో ఇలా హల్వా చేయండి, రుచికి రుచి పైగా ఎంతో ఆరోగ్యం

Sajja Halwa: సజ్జ పిండితో ఇలా హల్వా చేయండి, రుచికి రుచి పైగా ఎంతో ఆరోగ్యం

Haritha Chappa HT Telugu
Jan 09, 2024 11:00 AM IST

Sajja Halwa: సజ్జలతో ఏం స్వీట్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఓసారి సజ్జల హల్వా చేయండి. టేస్టీగా ఉంటుంది.

సజ్జ పిండితో హల్వా రెసిపీ
సజ్జ పిండితో హల్వా రెసిపీ (Sanjeev Kapoor Khazana/youtube)

Sajja Halwa: చిరుధాన్యాల్లో ముఖ్యమైనవి సజ్జలు. వీటిని ఒకప్పుడు విపరీతంగా తినేవారు. ఎప్పుడైతే తెల్ల బియ్యం వాడుకలోకి వచ్చాయో, సజ్జలను వాడడం తగ్గించేశారు. ఇప్పుడు కరోనా తర్వాత కొందరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. దీనివల్ల మళ్లీ చిరుధాన్యాలను తినే వారి సంఖ్య పెరుగుతోంది. చాలామందికి సజ్జలతో ఎలాంటి వంటకాలు వండుకోవాలో తెలియదు. అన్నంలాగా వీటిని ఉడికించుకొని తినడం మాత్రం అనుకుంటారు. సజ్జలను పిండి చేయించుకుంటే అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. అలాంటి వాటిలో హల్వా ఒకటి. ఇది రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యం కూడా. సజ్జల హల్వా ఎలా చేయాలో తెలుసుకుందాం.

సజ్జ హల్వా రెసిపీకి కావలసిన పదార్థాలు

సజ్జ పిండి - ఒక కప్పు

నెయ్యి - అర కప్పు

బెల్లం తురుము - ఒక కప్పు

పాలు - అర కప్పు

యాలకుల పొడి - అర స్పూను

బాదం తురుము - నాలుగు స్పూన్లు

జీడిపప్పు తురుము - నాలుగు స్పూన్లు

పిస్తా తురుము - నాలుగు స్పూన్లు

సజ్జ హల్వా రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.

2. నెయ్యి వేడెక్కాక సజ్జ పిండిని వేసి బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి.

3.ఇప్పుడు మరో కళాయిలో పాలు వేసి వేడి చేయాలి.

4. వేడెక్కిన పాలలో తురిమిన బెల్లాన్ని వేయాలి. బెల్లం, పాలు కలిపి సిరప్‌లా అవుతాయి.

5. ఈ సిరప్ లో ముందుగా వేయించుకున్న సజ్జ పిండిని మెల్లగా వేస్తూ గరిటతో కలుపుతూ ఉండాలి.

6. ఒకేసారి అంతా వేస్తే ముద్దలు కట్టే అవకాశం ఉంది.

7. కాబట్టి కొంచెం కొంచెంగా వేస్తూ గరిటతో కలుపుతూ ఉంటే ముద్దలు కట్టకుండా వస్తుంది.

8. చిన్న మంట పెట్టి ఈ హల్వాను గరిటతో కలుపుతూ ఉండాలి.

9. హల్వా దగ్గరగా అయ్యాక యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి.

10. ఇప్పుడు స్టవ్ కట్టేసి ముందుగా వేయించుకున్న బాదం, జీడిపప్పు, పిస్తా తురుమును పైన చల్లుకోవాలి.

11. అంతే సజ్జ పిండి హల్వా రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది పైగా ఆరోగ్యానికి ఎంతో మంచిది.

సజ్జలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని పెరల్ మిల్లెట్ అని కూడా అంటారు. మన గుండె పనితీరును మెరుగుపరచడానికి ఇవి చాలా అవసరం. వీటిలో ఏమైనా ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. మన జీర్ణశక్తి ఈ అమైనో ఆమ్లాలు తోడ్పడతాయి. మధుమేహంతో బాధపడేవారు ప్రతిరోజూ సజ్జలను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. చపాతీలకన్నా సజ్జ రొట్టెలు తినడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఆకలి వెంటనే వేయదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరగవు. పైగా బరువు కూడా పెరగరు.

పిల్లలకు కూడా సజ్జల అన్నాన్ని వండి కూరగాయలతో కలిపి తినిపిస్తే మంచిది. పొట్టలో మంట, అజీర్తి వంటి సమస్యలు ఉన్నవారు తెల్లఅన్నానికి బదులు సజ్జలను తినడం అలవాటు చేసుకోవాలి. ఎవరికైతే రక్తహీనత ఉంటుందో వారు సజ్జలను తినడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే సజ్జల్లో ఇనుము, జింకు పుష్కలంగా ఉంటాయి. నిద్రలేమితో బాధపడుతున్న వారు ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న వారు సజ్జలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. సజ్జలతో అన్నం వండుకోవడమే కాదు ఉప్మా చేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు సజ్జలను తినడం వల్ల పిల్లలకు మరింత బలం చేరుతుంది. ప్రతిరోజూ సజ్జలు తినలేం అనుకున్న వారు వారానికి కనీసం రెండుసార్లు సజ్జలతో ఏదైనా వండి తినడం అలవాటు చేసుకోవాలి.

Whats_app_banner