Diwali Safety Tips: దీపావళి రోజున టపాకాయలు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి, పొరపాటున గాయమైతే ఇలా చేయకండి
Diwali crackers: దీపావళి రోజున టపాకాయలు కాల్చడం అందరికీ సరదానే. కానీ.. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా గాయాలయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ పొరపాటున గాయమైతే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
దీపావళి రోజున చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు టపాకాయలు కాల్చడాన్ని బాగా ఇష్టపడుతుంటారు. కానీ.. పండగ రోజు అజాగ్రత్తగా ఉంటే అది గాయాలకి దారితీసే ప్రమాదం ఉంది. బాణాసంచా పొరపాటున మన చర్మంపై పడితే తీవ్ర గాయమవడంతో పాటు చెవులు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి.
టపాకాయలు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సురక్షిత ప్రదేశం
టపాకాయలు కాల్చడానికి తొలుత సురక్షిత ప్రదేశాన్ని ఎంచుకోవాలి. కొంత మంది అనాలోచితంగా ఇంటి ఆవరణంలోనే కాల్చడానికి ప్రయత్నిస్తుంటారు. మరీ ముఖ్యంగా పార్కింగ్ ఏరియా అస్సలు కాల్చకూడదు. అలానే ఇళ్ల మధ్యలో టపాకాయలు కాల్చకూడదు. ఓపెన్ ఏరియాలో టపాకాయలు కాల్చడం ఉత్తమం.
అనువైన బట్టలు
దీపావళి పండగ రోజు మీకు ఇష్టమైన కొత్త బట్టలు వేసుకోడం మంచిదే. కానీ.. టపాకాయలు కాల్చే సమయంలో బిగితు దుస్తులు షార్ట్స్ వేసుకోడం మీకు గాయాల ప్రమాదాన్ని పెంచుతుంది. మీకు సౌకర్యంగా ఉండేలా, చర్మాన్ని రక్షించేలా పొడవైన దుస్తులు ధరించడం మంచిది.
బక్కెట్ నీరు లేదా ఇసుక
టపాకాయాలు కాల్చే సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే అప్పటికప్పుడు వెతుక్కోకుండా ఒక బక్కెట్ నీరు లేదా ఇసుకని సిద్ధం ఒక పక్కన ఉంచుకోండి. పొరపాటున చర్మంపై బాణాసంచా పడినప్పుడు వెంటనే నీటితో శుభ్రం చేసుకోవడం ద్వారా ప్రమాద స్థాయిని తగ్గించుకోవచ్చు.
నిత్యం పర్యవేక్షణ
చిన్న పిల్లలు టపాకాయలు కాల్చేటప్పుడు కొంచెం అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. కాబట్టి.. పెద్దవారు వారి దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలకి ప్రమాదం గురించి వివరిస్తూనే వాళ్లు కంగారు పడకుండా ఎంజాయ్ చేసేలా చూసుకోవాలి. పొరపాటున పిల్లలు చూసుకుంటారులే అని ఏమరపాటుతో ప్రమాదాల్ని ఆహ్వానించొద్దండి.
లిమిట్స్ క్రాస్ చేయొద్దు
కొంత మందికి ఒకేసారి రెండు టపాకాయల్ని కాల్చడం మహా సరదా. కానీ ఇది చాలా ప్రమాదకరం. ఎక్కువ మోతాదులో లేదా రెండు టపాకాయలు ఒకేసారి కాల్చడానికి ప్రయత్నించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి.
కళ్లు జాగ్రత్త
టపాకాయల్లోని రసాయనాలు కళ్లుపై ప్రభావం చూపించొచ్చు. కాబట్టి.. టపాకాయల్ని కాల్చే సమయంలో వీలైనంత దూరంగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. ఒకవేళ పొరపాటున టపాకాయల్లోని సల్ఫర్, గన్‌పౌడర్ వంటికి కళ్లల్లో పడితే మీకు కళ్లు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రభావం మీకు కళ్ల నుంచి నీరు కారడం, మంట లేదా దురద వంటి సమస్యలకి దారితీయవచ్చు.
పొరపాటున గాయాలైతే ఏం చేయాలి?
టపాకాయలు కాల్చే సమయంలో పొరపాటున గాయమైతే.. కాలిన ప్రాంతాన్ని నీటితో నెమ్మదిగా తొలుత శుభ్రం చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన బట్టతో గాయాన్ని నెమ్మదిగా తుడవాలి. అంతేతప్ప.. ఆ గాయంపై పసుపు లేదా కాఫీ పొడి లాంటివి పెట్టకూడదు.
గాయాన్ని గట్టితో గుడ్డతో కట్టడం లాంటివి కూడా చేయకూడదు. జస్ట్ సాఫ్ట్ బ్యాండ్‌తో గాయాన్ని కప్పి ఉంచండి. ఒకవేళ గాయం తీవ్రమైనదిగా మీకు అనిపిస్తే వెంటనే సమీపంలోని వైద్యుడి దగ్గరికి వెళ్లి చికిత్స చేయించుకోండి.
పెద్ద శబ్దాలు వచ్చే టపాకాయలు కాల్చి ఇతరుల్ని ఇబ్బంది పెట్టకుండా.. వెలుగులు విరజిమ్మే చిచ్చుబుడ్లు, కాకరపూవత్తులు, భూచక్రాల వంటివి కాల్చి దీపావళిని ఎంజాయ్ చేయండి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు, ఇబ్బందులు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్