flying Kites: పండక్కి పతంగులు ఎగరేస్తున్నారా..? ఇవన్నీ చెక్ చేసుకుని సంతోషంగా ఎగరేయండి!-safety tips for flying kites this sankranti to enjoy the festival with caution ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Flying Kites: పండక్కి పతంగులు ఎగరేస్తున్నారా..? ఇవన్నీ చెక్ చేసుకుని సంతోషంగా ఎగరేయండి!

flying Kites: పండక్కి పతంగులు ఎగరేస్తున్నారా..? ఇవన్నీ చెక్ చేసుకుని సంతోషంగా ఎగరేయండి!

Ramya Sri Marka HT Telugu
Jan 12, 2025 02:31 PM IST

flying Kites: గాలిపటాలు ఎగరేయకుండా సంక్రాంతి పండుగ జరుగుతుందా? ఛాన్సే లేదు కదా! మీ పతంగులతో ఆకాశాన్ని నింపే ముందు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఇవి మీ పండుగ సంతోషాన్ని పాడు చేయకుండా ఉంటాయి.

పండక్కి పతంగులు ఎగరేస్తున్నారా..
పండక్కి పతంగులు ఎగరేస్తున్నారా..

సంక్రాంతి అంటేనే సరదా ఆటలు, పిండివంటలు, ముగ్గులు. ముఖ్యంగా చిన్న పిల్లల దగ్గర్నుంచీ పెద్ద వాళ్ల వరకూ సంతోషంగా గాలిపటాలు ఎగరేయడం సంక్రాంతి పండుగ ప్రత్యేకత. కుటుంబ సభ్యులు, సన్నిహితులు అంతా కలిసి సరదాగా ఎగరేసే గాలిపటాల ఆటలో ఈ మధ్య అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. చాలా మంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలను సైతం పొగొట్టుకుంటున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే మీ సంక్రాంతి పండుగ సంతోషంగా జరగాలంటే పతంగులను ఎగరేసే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుని సంక్రాంతి సెలవుల్లో సరదాగా, సంతోషంగా పతంగులను ఎగరేసుకోండి.

వాతావరణాన్ని చెక్ చేసుకొండి:

గాలిపటాలను ఎగరేసేటప్పుడు వాతావరణాన్ని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. గాలిపటాలు ఎగరడానికి ముందు గాలికి సంబంధించిన పరిస్థితులను చూసుకోవాలి. గాలి చాలా వేగంగా ఉంటే కైట్లు సరిగ్గా ఎగరవు. అలాగే వాటిని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది.

చేతులకు రక్షణగా..

పతంగులు ఎగరేసేటప్పుడు చేతులకు గ్లౌజులు లేదా ప్లాస్టర్ వంటివి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మాంజా కారణంగా చేతులకు, వేళ్లకూ గాయాలు కాకుండా ఉంటాయి.

పాదాలకు గాయాలు కాకుండా..

పతంగులను మీకు కావాల్సిన ఎత్తుకు తీసుకెళ్లేందుకు, నచ్చిన దిశగా తిప్పుకోవడానికి మీరు అటు ఇటూ పరుగెత్తుతుంటారు. ఈ సమయంలో మీరు దారిని గమనించకుండానే అడుగులు వేస్తాయి. ఇలాంటప్పుడు కాళ్లకు గాయాలు కాకుండా, ముళ్లు, రాళ్లు గుచ్చుకోకుండా ఉండేందుకు మందపాటి చెప్పులు, షూస్ ను వేసుకోండి.

పతుంగుల ఎగరేసే దారం..

మాంజా ఎంచుకొనేటప్పుడే జాగ్రత్తగా చూసి ఎంచుకోండి. వీలైనంత వరకూ సింథటిక్, నైలాన్ తో తయారు చేసిన వాటికి దూరంగా ఉండండి. ఇవి చాలా పదునుగా ఉండి గాయాలు చేస్తాయి. వీటి వల్ల ఆకాశంలోని పక్షులకు కూడా గాయలు అయ్యే అవకాశముంది.

మేడలు, మిద్దెల మీద కాకుండా..

మైదానాలు, పార్కులు వంటి ఖాళీ స్థలాలను ఎంచుకుని ఎగరేయాలి. బిల్డిండులు, ఇంటి కప్పుల మీదకు ఎక్కి ఎగరేయడం వల్ల ఆదమరిచి కింద పడే ప్రమాదముంది.

రోడ్డు పక్కన..

రోడ్డు పక్కనే పతంగులకు ఎగరేయడం కూడా చాలా ప్రమాదకం. గాలిపటం కోసం పరిగెత్తుతున్నప్పుడు రోడ్డు మీద బండ్లకు ఎదురెల్లే అవకాశం ఉంది. ఒక్కోసారి రోడ్డు మీద వెళ్తున్న వారికి దారి తగిలో, మీరు తగిలో ప్రమాదాలు జరగవచ్చు.

పోయిన వాటిని పోనివ్వండి..

విద్యుత్ పోల్‌లకు, కరెంట్ వైర్లకు అంటుకున్న గాలిపటాలను తిరిగి తీసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తారు. ఎంత జాగ్రత్త పడినా కూడా కొన్నిసార్లు ఇది మీ ప్రాణాలను హరించవచ్చని గుర్తుంచుకోండి.

చుట్టు పక్కల పరిస్థితులు..

మీరు పతంగులను ఎగరేసేటప్పుడు మీ చుట్టు పక్కల చిన్న పిల్లలు, వృద్ధులు లేకుండా చూసుకోండి. వాటిని ఎగరేసే ఉత్సాహంతో ముందూ వెనకా చూడకుండా వాళ్ల మీద పడే అవకాశాలున్నాయి. వారికీ మీకూ గాయాలయ్యే ప్రమాదముంది జాగ్రత్త.

Whats_app_banner

సంబంధిత కథనం