Sabudana Atlu: సాబుదానాతో టేస్టీ అట్లు, ఉపవాసం రోజు తింటే రోజంతా శక్తినిస్తాయి
Sabudana Atlu: ఉదయం కడుపునిండా, రుచిగా ఏదైనా తినాలంటే సాబుదానా అట్లు మంచి ఆప్షన్. ఉపవాసం రోజు కూడా తినదగ్గ ఈ అట్ల తయారీ ఎలాగో చూసేయండి.
సాబుదానా అట్లు
సాబుదానాతో చేసే అట్లు అల్పాహారంలోకి ఉత్తమ ఆప్షన్. ఇవి రోజంతా కావాల్సిన శక్తినిస్తాయి. ముఖ్యంగా ఉపవాసం రోజున తినడానికి మంచి ఆహారం ఇది. మామూలుగా సాబుదానాతో వడలు, కిచిడి, పాయసం చేసుకుంటారు. కానీ అట్లు కూడా వేసుకోవచ్చు. ఉపవాసం సమయంలోనే కాకుండా వారంలో ఒకసారైనా వీటిని మీ బ్రేక్‌ఫాస్ట్ లిస్టులో చేర్చుకోవచ్చు.
సాబుదానా అట్ల కోసం కావాల్సిన పదార్థాలు:
1 కప్పు సాబుదానా
1 పెద్ద ఆలుగడ్డ
2 పచ్చిమిర్చి, సన్నం ముక్కల తరుగు
అర టీస్పూన్ అల్లం ముద్ద
1 కరివేపాకు రెమ్మ
అరటీస్పూన్ జీలకర్ర
2 చెంచాల బియ్యంపిండి (ఉపవాసం రోజు రాజ్‌గిరా పిండి వాడొచ్చు)
తగినంత ఉప్పు
2 చెంచాల నూనె
సాబుదానా అట్ల తయారీ విధానం:
- ముందుగా సాబుదానాను పెద్ద బౌల్ లోకి తీసుకోండి. అది మునిగేనన్ని నీళ్లు పోసి కనీసం రెండు మూడు సార్లయినా బాగా కడుక్కోవాలి.
- తర్వాత కప్పు సాబుదానాకు సగం కప్పు నీళ్లు పోసి కనీసం ఒక పూట లేదంటే ఆరేడు గంటలు నానబెట్టుకోవాలి.
- ఉదయం అల్పాహారం కోసం అయితే సాబుదానా రాత్రి నానబెట్టుకుంటే సరిపోతుంది.
- ఇప్పుడు నానిన సాబుదానాను మిక్సీ జార్‌లో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
- దీన్ని ఒక బౌల్ లోకి తీసుకుని అందులో ఉడికించి బాగా మెదుపుకున్న బంగాళదుంప ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, అల్లం ముద్ద, ఉప్పు వేసుకోవాలి.
- అన్నీ కలిసిపోయాక కరివేపాకు తరుగు, కాస్త బియ్యం పిండి కూడా వేసి అవసరం అయితే నీళ్లు పోసుకుని చిక్కటి పిండి కలుపుకోవాలి.
- ఇప్పుడు పెనం పెట్టుకుని వేడెక్కాక ఒక గరిటెడు పిండి తీసుకుని దోశ లాగా వేసుకోవాలి. కాస్త మందంగా ఉన్నా పరవాలేదు.
- అంచుల వెంబడి నూనె వేసుకుని రెండు వైపులా కాల్చుకుంటే రుచికరమైన సాబుదానా అట్లు రెడీ.