Covishield vaccine side effects: కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ టిటిఎస్.. ఇది రాకుండా ఎలా జాగ్రత్త పడాలి?
Covishield vaccine: కరోనా రాకుండా కోవిషీల్డ్ టీకా వేసుకున్న వారికి భవిష్యత్తులో దుష్ప్రభావాలు వస్తున్నట్టు ఆ వ్యాక్సిన్ తయారుచేసిన సంస్థ ఒప్పుకుంది. ముఖ్యంగా టీటీఎస్ వంటి ప్రాణాంతక సమస్యలు వస్తున్నాయి.
Covishield vaccine: కరోనా వ్యాక్సిన్‌గా కోవిషీల్డ్ టీకా పరిచయమైంది. ఈ వ్యాక్సిన్‌ను ఆస్ట్రాజెనికా సంస్థ తయారు చేసింది. మనదేశంలో ఎన్నో లక్షల మందికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను వేశారు. దీన్ని బ్రిటిష్‌కు చెందిన ఆస్ట్రోజెనకా సంస్థ తయారు చేసింది. అయితే కోవిషిల్డ్ వ్యాక్సిన్ వల్ల కొన్ని రకాల అనారోగ్యాలు వస్తున్నాయని, ఆ అనారోగ్యాలు మరణాలకు కారణం అవుతున్నాయని బ్రిటన్ కోర్డులో కేసులు నడుస్తున్నాయి. దీనిపై అక్కడి కోర్టు విచారణ చేస్తోంది. దీనిలో భాగంగా ఆస్ట్రాజెనికా సంస్థను కూడా కోర్టు ప్రశ్నించింది. ప్రారంభంలో ఆస్ట్రాజెనికా తాము తయారు చేసిన వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవని చెప్పింది. కానీ తరువాత మాత్రం తమ టీకా వల్ల ప్రాణాంతక సైడ్ ఎఫెక్టులు ఉన్నట్టు ఒప్పుకుంది.
TTS అంటే ‘థ్రోంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్’. దీనిలో రక్తం గడ్డ కట్టడం అనే సమస్యను థ్రోంబోసిస్ అంటారు. రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన ప్లేట్లెట్స్ తక్కువ స్థాయిలో ఉండడాన్ని ‘థ్రోంబోసైటోపెనియా’ అంటారు. తక్కువ స్థాయి ప్లేట్లెట్లను కలిగి ఉండడం, రక్తం గడ్డ కట్టడం అనే రెండు అనారోగ్యాలను కలిపి ‘థ్రోంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్’ అని పిలుస్తారు. ఇది చాలా అరుదుగా వచ్చే వ్యాధి. కొన్ని రకాల టీకాల వల్ల వస్తుంది. ఈ సిండ్రోమ్ వచ్చినప్పుడు ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోతుంది. దీనివల్ల మెదడులో లేదా ఇతర శరీర భాగాల్లో రక్తం గడ్డ కడుతుంది. ఎప్పుడైతే రక్తనాళాల్లో రక్తం గడ్డ కడుతుందో శరీరానికి రక్తప్రసరణ జరగదు. ముఖ్యంగా గుండెకు రక్తప్రసరణ ఆగిపోయి మరణం అంచులకు చేరుకుంటారు.
కోవీషీల్డ్ టీకా అనేది కరోనా రాకుండా అడ్డుకునే వ్యాక్సిన్ గా మనకు పరిచయమైంది. ఇది నిస్సందేహంగా ప్రాణాలను కాపాడింది. అయితే చాలా అరుదుగా కొంతమందిలో టీటీఎస్ అనారోగ్యం రావడానికి కూడా కారణమైంది. TTS అనేది అమెరికాలో ఒక ఏడాదిలో లక్ష మంది ప్రాణాలను తీస్తోందని నివేదికలు చెబుతున్నాయి.
TTS లక్షణాలు ఇవే
తీవ్రమైన తలనొప్పి రావడం, ఆ తలనొప్పి తరచూ రావడం, దృష్టి మసకబారడం, శ్వాస ఆడక పోవడం, ఛాతీలో నొప్పి రావడం, కాళ్లలో వాపు కనిపించడం, కడుపునొప్పి అధికంగా రావడం, ఎక్కడైతే వ్యాక్సిన్ తీసుకున్నారో ఆ భాగంలో చర్మం కింద సులభంగా గాయాలు కావడం, చిన్న రక్తపు మచ్చల్లాంటివి కనిపించడం... ఇవన్నీ కూడా టిటిఎస్ లక్షణాలుగా చెప్పుకోవాలి. టీకా వేసిన కొన్ని వారాలలోపు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడాలి.
ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి?
TTS లక్షణాలు కనిపిస్తే వెంటనే కార్డియాలజిస్టులను సంప్రదించాలి. వీరు గుండెపోటు రాకుండా చికిత్స ప్రారంభిస్తారు. ఎందుకంటే రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె వైఫల్యం చెందే అవకాశం ఉంది. టీటీఎస్ తీవ్రంగా మారితే కార్డియాలజిస్టులు, హెమటాలజిస్టులు, న్యూరాలజిస్టులు కలిసి ఆ వ్యక్తికి చికిత్స చేయాల్సి ఉంటుంది. బ్రిటన్ లో ఎంతోమంది టీటీఎస్ సోకడం వల్ల మరణించారు. టిటిఎస్ రాకుండా అడ్డుకోవడం అసంభవం. టీకా వేయించుకున్న తర్వాత కొందరిలో ఈ లక్షణాలు కనిపించవచ్చు. లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించడం తప్ప, టీకా వల్ల ఈ వ్యాధి వస్తే దానిని రాకుండా అడ్డుకునే శక్తి మాత్రం ఎవరికీ లేదు.