Rice Diet: అన్నం తింటూ బరువు తగ్గించేదే రైస్ డైట్, దీన్ని ఎలా పాటించాలో, ఎలా బరువు తగ్గాలో తెలుసుకోండి
Rice Diet: డైటింగ్ అనగానే మొదట చేసే పని అన్నం మానేయడం. నిజానికి అన్నం తింటూ కూడా బరువును సులువుగా తగ్గవచ్చు. ఇదే విషయాన్ని చెబుతోంది రైస్ డైట్. ఈ డైట్‌ను ఎలా పాటించాలో తెలుసుకుందాం.
Rice Diet: ప్రపంచవ్యాప్తంగా ఉన్న 350 కోట్ల మంది ప్రజలు అన్నాన్ని ప్రధాన ఆహారంగా తింటున్నారు. ప్రతిరోజూ అన్నం తింటేనే వారికి పొట్ట నిండిన భావన కలుగుతుంది. అన్నం తినడం వల్ల శక్తి ఎక్కువ కాలం పాటు అందుతుంది. కానీ బరువు పెరగడం అనేది సమస్యగా మారాక... డైటింగ్ లో భాగంగా అన్నాన్ని మానేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. నిజానికి బరువు తగ్గేందుకు అన్నాన్ని మానేయాల్సిన అవసరం లేదు. సరిపడినంత అన్నం తినడం వల్ల ఆరోగ్యకరమైన బరువు ఉంటారు. అతిగా తింటేనే బరువు పెరుగుతారు, ఇదే విషయాన్ని రైస్ డైట్ చెబుతోంది.
ఈ రైస్ డైట్‌ను డ్యూక్ యూనివర్సిటీ వైద్యుడు వాల్టర్ కెప్నర్ 1939లోనే అభివృద్ధి చేశారు. ఈ రైస్ డైట్లో భాగంగా అధిక సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్స్, తక్కువ కొవ్వు, తక్కువ సోడియం ఉన్న ఆహారాన్ని తినాలి. దీనివల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావు. అలాగే శరీరంలో నీరు పేరుకు పోవడానికి కూడా ఇది తగ్గిస్తుంది.
రైస్ డైట్‌లో ఏం తినాలి?
రైస్ డైట్ అంటే మీరు కేవలం అన్నాన్ని మాత్రమే తినమని కాదు, సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం అని అర్థం. అలాగే వ్యాయామాలు చేయడం ఇందులో భాగమే. అన్నంతో పాటూ పండ్లు, కూరగాయలు, ఇతర ధాన్యాలు తింటూ ఉండాలి. ముఖ్యంగా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. ఆల్కహాల్, పాల ఉత్పత్తులను తగ్గించాలి. రోజుకు 1200 నుంచి 1500 క్యాలరీలకు మించకుండా ఆహారాన్ని తీసుకోవాలి.
రైస్ డైట్లో అన్నాన్ని తినవచ్చు. అయితే అన్నంతో పాటు దానికి సమానంగా కూరగాయలతో చేసిన కూరలను తినాలి. ముఖ్యంగా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తినాలి. అప్పుడే ఆహారం సమతులంగా ఉంటుంది. ఇలా తినడం వల్ల మీ గుండె, పొట్ట, కాలేయం వంటి వాటిపై సానుకూల ప్రభావం ఉంటుంది.
రైస్ డైట్‌లో కుకీలు, కేకులు వంటివాటిని దూరం పెట్టాలి. అన్నంతో వండిన ఆహారాలు, చిలగడదుంపలు, ఓట్స్ వంటి వాటిని తినాలి. వీటిలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉంటాయి. మీ ఆహారం నుండి పిండి పదార్థాలు ఉన్న ఉత్పత్తులను తీసేయాలి. అంటే బంగాళదుంపలను మానేయాలి. ఇలా చేయడం వల్ల అధిక అలసట, మెదడు మొద్దు మారడం, అధిక ఆకలి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
ఎలాంటి బియ్యాన్ని ఎంచుకోవాలి?
రైస్ డైట్లో భాగంగా ఎలాంటి ఆహారాన్ని ఎంచుకుంటే మంచిదో కూడా వివరిస్తున్నారు పోషకాహార నిపుణులు. బ్రౌన్ రైస్, రెడ్ రైస్ అనేవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది కొనలేని వారు వైట్ రైస్‌ను కూడా వినియోగించుకోవచ్చు. అయితే వైట్ రైస్ అధికంగా కాకుండా ఎంత కూర తింటారో... అంతే అన్నాన్ని తినడం అలవాటు చేసుకోవాలి. ఇక బ్రౌన్ రైస్ ప్రాసెస్ చేయకుండా ఉన్నదే కొనుక్కోవాలి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
టాపిక్