Saturday Motivation: కమ్యూనికేషన్ గ్యాప్‌తో దెబ్బ తింటున్న అనుబంధాలు, మీ బంధాల కోసం కమ్యూనికేషన్ మెరుగుపరచుకోవాల్సిందే
Saturday Motivation: ఏ అనుబంధమైనా కలకాలం సాగాలంటే వారి మధ్య కమ్యూనికేషన్ ఉండాల్సిందే. కమ్యూనికేషన్ అనేది పరస్పర అవగాహనను, నమ్మకాన్ని పెంచుతుంది.
కమ్యూనికేషన్ గ్యాప్ ఇది చాలా చిన్నదిగా కనిపించే పెద్ద సమస్య. ఎన్నో అనుబంధాలను నిర్వీర్యం చేస్తుంది. సంబంధాలను దూరం చేస్తుంది. నిశ్శబ్ధంగానే తీరం దాటని దూరాన్ని సృష్టిస్తుంది. ఏ అనుబంధమైనా నిలబడాలంటే ప్రభావంతమైన కమ్యూనికేషన్ ఉండాల్సిందే. మనసులోని భావాలు మనసులోనే ఉండిపోతే... అవి అక్కడే సమాధి అయిపోతాయి. మీ మనసులోని మాటను ఎదుటివారు తెలుసుకోలేరు. మీ బాధను అర్థం చేసుకోలేకపోవచ్చు. మీ ఆనందం, బాధ, వైరాగ్యం అన్నీ బయటికి చెబితేనే ఎదుటివారు అర్థం చేసుకుంటారు. ఈరోజు నుంచి మనసులో ప్రతిదీ మూట కట్టుకోకుండా మాట్లాడడం మొదలు పెట్టండి.
కమ్యూనికేషన్ ఎందుకంత ముఖ్యం?
కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఇది పరస్పర అవగాహనను పెంపొందిస్తుంది. నమ్మకానికి పునాది వేస్తుంది. జీవిత భాగస్వాముల మధ్య భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యకరమైన సంబంధానికి కమ్యూనికేషన్ అనేది అత్యంత ముఖ్యమైన అంశం. కానీ ఎంతో మందికి ఈ విషయం తెలియక కమ్యూనికేషన్ గ్యాప్ తో సమస్యల బారిన పడుతున్నారు. ఒకరికొకరు దూరం అవుతున్నారు.
ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు... వారు చెప్పేది వినకుండా మీరు ఫోన్లో మెసేజ్లు చేయడం, మధ్య మధ్యలో ఫోన్లు మాట్లాడడం వంటి పనులు మానేయండి. అలా చేయడం వల్ల ఎదుటివారి మనసు నొచ్చుకుంటోంది. మీరు కూడా అర్థవంతంగా సమాధానం ఇవ్వలేరు. మీతో ఏదైనా విషయం చెబుతున్నప్పుడు ఎదుటివారు చెబుతున్న దానిపైనా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.
స్నేహితులైనా, తల్లిదండ్రులైనా, భార్యాభర్తలైనా రాత్రి నిద్రపోయి ఉదయం లేచాక ఒకరినొకరు పలకరించుకోవడం చాలా అవసరం. గుడ్ మార్నింగ్ అనే ఒక మెసేజ్ లేదా ఒక మాట చెప్పడం వల్ల వారికి మీరు ఎంతో దగ్గరవుతారు. మీ స్నేహితుడు, మీ తల్లిదండ్రులు మాట్లాడేటప్పుడు మీరు పరధ్యానంగా ఉండకండి.. ప్రతిస్పందిస్తూ ఉండండి. శ్రద్ధతో వినండి. ఇలా చేయడం వల్ల మీరు ఎదుటివారికి ఎంతో విలువిస్తున్న విషయం వారి మనసుకే అర్థమవుతుంది.
ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ కమ్యూనికేషన్‌ను మరింత పెంచేందుకు ప్రయత్నించండి. ఎక్కడికక్కడ తెగ్గొట్టేయకండి. దీనివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది. ఎదుటివారు చెబుతున్న విషయంపై ప్రశ్నలు అడగండి. మీ అభిప్రాయాలను పంచుకోండి. అంతేకానీ అవును లేదా కాదు అనే చిన్న సమాధానంతో సరిపెట్టకండి. ఇది ఆ కమ్యూనికేషన్‌ను అక్కడే ఆగిపోయేలా చేస్తుంది.
విభేదాలు వచ్చినప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. నిజానికి కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే విభేదాలు వస్తాయని చెప్పుకునే వారు కూడా ఉంటారు. విభేదాల సమయంలో మీ స్వరం సానుకూలంగా ఉండేలా జాగ్రత్త పడండి. మాటలు దురుసుగా కాకుండా సరళంగా ఉండేలా చూసుకోండి.
బాడీ లాంగ్వేజ్ ఇలా
కమ్యూనికేషన్ లో బాడీ లాంగ్వేజ్, ముఖ కవళికలు చాలా ముఖ్యం. అవి ఎంత పద్ధతిగా ఉంటే ఎదుటివారు కూడా మీరు ఇచ్చే వివరణను అంతే పద్ధతిగా స్వీకరిస్తారు. లేకుంటే అది సమస్యగా మారిపోయే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడూ మీ స్థానంలోనే ఉండే కాదు... ఎదుటివారి స్థానంలో ఉండి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఇది వారి బాధను, ఆవేదనను అర్థం చేసుకునే అవకాశాన్ని మీకు ఇస్తుంది. స్వేచ్ఛగా కమ్యూనికేషన్ చేసే పరిస్థితులను మీ స్నేహితులకు, తల్లిదండ్రులకు, జీవిత భాగస్వాములకు కల్పించండి. దీనివల్ల మీ మధ్య అనుబంధం సురక్షితంగా ఉంటుంది.