relationship mistakes : బంధాన్ని బలహీనపరిచే తప్పులు
relationship mistakes : బంధం నిలబడాలన్నా, బలహీనపడుతున్నా మన చేతిలోనే ఉంటుంది. మనం చేసే పనులే ప్రతిదీ నిర్ణయిస్తాయి. ఒక బంధంలో ఉన్నప్పుడు దాన్ని నిలబెట్టుకోడానికి మనం చేయకూడని పనులేంటంటే..
బంధం బలహీనపడటానికి మనకు తెలిసీ తెలియక చేసే పనులే కారణాలవుతాయి. ఒక మనిషితో మనం ఎలా మసులుకుంటున్నామో చూసి మనం ఎలాంటి బంధంలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. ఇద్దరి మధ్య మాటలు సరిగ్గా లేకపోతే ఎదుటి వ్యక్తిని తప్పుగా అపార్థం చేసుకుంటాం. ఒక బంధంలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి చేస్తున్న తప్పుల మీద కన్నా మన తీరులో ఏమైనా మార్చుకుంటే సమస్య పరిష్కారం అవుతుందేమో ఆలోచించాలి. ఉదాహరణకు ఎదుటి వ్యక్తిలో మీకు నచ్చని కొన్ని అలవాట్లు ఉండొచ్చు. వాటితో మీరు సర్దుకునే ప్రయత్నమే మొదట చేయాలి.

వీటన్నింటితో పాటూ ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి. అవేంటంటే..
నిజాయతీగా ఉండకపోవడం :
తప్పు చేసినా, తెలియక ఏదైనా పొరపాటు జరిగినా ఒప్పుకోండి. తప్పించుకోడానికి అబద్ధం చెప్పకండి. మీకు సంబంధించిన ప్రతి విషయంలో నిజాయతీగా ఉండండి. ఏదో ఒక్కసారి అబద్ధం చెబితే ఏం కాదులే అని వదిలేస్తే దానివల్ల ఎదుటి మనిషికి మీమీద నమ్మకం తగ్గుతుంది.
అతిగా ఆశించడం:
ఒకరి మీద ఒకరు తెలీకుండానే ఆధారపడటం మొదలెడతారు. దానివల్ల ఎదుటి వ్యక్తి నుంచి ఆశించడం మొదలెడతాం. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఏం చెప్పకుండానే అర్థం చేసుకుంటారని ఆశించడం కన్నా, ఏం కావాలో చెప్పి చూడండి. ఇలా చేస్తే మీకిష్టమని చెప్పి చూడండి. ఆ తరువాత ఇబ్బంది వస్తే ఆలోచించాలి తప్ప కావాలనే మీకోసం ఏమీ చేయట్లేదని ఊహించుకోకూడదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. వాటిని వివరంగా చెప్పే ప్రయత్నం చేయండి.
మాసనసిక ఆరోగ్యం :
కొన్ని సార్లు ఒకరి వల్ల ఇంకొకరు బాధ పడొచ్చు. ప్రతి బంధంలో ఇది సర్వ సాధారణం. కానీ దాని గురించి మాట్లాడి పరిష్కరించుకోవడమో, లేదంటే పూర్తిగా మర్చిపోవడమో చేయాలి. అంతేకానీ బయటకు చెప్పకుండా మనసులో కోటలు కట్టుకుంటూ పోతే ఆనందంగా ఉండలేరు. బయట ఆనందంగా ఉండి, మీలో మీరే బాధపడితే ఎప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకదు. చిన్న గొడవలు కాస్తా పెద్దగా మారే ప్రమాదం ఉంది.
హద్దులుండాలి కానీ.. :
ప్రతి మనిషికీ ఎదుటి మనిషికి మనం ఇచ్చే చొరవ విషయంలో వారి సొంత అభిప్రాయాలుంటాయి. ఉదాహరణకు కొంతమందికి ఎదుటి మనిషి వాళ్ల విషయాల్లో జోక్యం చేసుకుంటే నచ్చదు. కొంతమందేమో ఎదుటి వారికి ప్రతిదీ చెప్పుకోవాలనుకుంటారు. మీకు ఎలా ఉంటే నచ్చుతుందో ఇద్దరూ కలిసి ఒక అభిప్రాయానికి రావాలి. దానికి తగ్గట్టుగా డబ్బు విషయంలోనో, కుటుంబ విషయంలోనో, స్నేహితుల విషయంలోనో కొన్ని హద్దులు నిర్ణయించుకోండి. వాటివల్ల ఎదుటి మనిషికి ఇబ్బంది కలగకుండా చూసుకోండి.
టాపిక్