Gulkand Kajjikayalu Recipe: హోలీ స్పెషల్! కజ్జికాయలను గుల్‌కంద్‌తో తయారు చేయండి అదిరిపోతుంది, రెపిపీ కూడా చాలా సింపుల్!
Gulkand Kajjikayalu Recipe: మీకు గుల్‌కంద్ తెలుసా? దీనితో చేసిన తయారు కజ్జికాయలను ఎప్పుడైనా తిన్నారా? ఇప్పటివరకూ లేకపోతే ఈ హోలీకి తప్పకుండా ట్రై చేయండి. ఎంతో రుచిగా ఉండే గుల్‌కంద్ కజ్జికాయలు తయారు చేయడం కూడా చాలా సులువు. ఇదిగోండి రెసిపీ..

హోలీ పండుగ వచ్చిందంటే చాలు చాలా ఇళ్లలో కజ్జికాయలు, పకోడీలు తప్పనసరిగా ఉంటాయి. ఈ రోజున వీటిని తప్పనిసరిగా తినాలనే సంప్రదాయాన్ని చాలా మంది పాటిస్తారు. ఈ హోలీ నాడు మీ ఇంట్లో కూడా కజ్జికాయలను తప్పనిసరిగా చేసుకోవాలనుకుంటే ఈసారి కొత్తగా ట్రై చేయండి. కజ్జికాయలను రోటిన్‌గా కొబ్బరి, కోవా, డ్రైఫ్రూట్స్ వంటి వాటితో కాకుండా గుల్‌కంద్‌తో తయారు చేసి చూడండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి.
గుల్‌కంద్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు, చర్మాన్ని మరింత కాంతివంతగా తయారు చేయడానికి, శరీరంలోని శక్తి స్థాయిలను పెంచడానికి గుల్‌కంద్ చాలా బాగా సహాయపడుతుంది. అలాంటి గుల్‌కంద్‌తో రుచికరమైన కజ్జికాయలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి.
గుల్‌కంద్ కజ్జికాయలు తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు:
- ఒక కప్పు మైదా
- అర చెంచా యాలకుల పొడి
- డీప్ ఫ్రైకి సరిపడా నూనె
- 2 పెద్ద చెంచాల గుల్‌కంద్
- 10 నుండి 12 కేసరి రేకులు
- రెండు కప్పులు చక్కెర
- 2 పెద్ద చెంచాలు తురిమిన కొబ్బరి
- అర కప్పు కోవా
గుల్‌కంద్ కజ్జికాయలు తయారు చేసే విధానం:
గుల్‌కంద్ కజ్జికాయలు తయారు చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో కప్పు మైదా పిండి వేయండి.
తరువాత దీంట్లో నూనె పోసి, కొద్దికొద్దిగా నీరు పోసుకుంటూ పిండిని బాగా కలపండి.
ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టి 2 గంటలకు పైగా పక్కకు పెట్టి ఉంచండి.
ఈలోపు ఒక కడాయి తీసుకుని దాంట్లో కోవా బాగా వేయించండి.
ఆ తర్వాత దీనిలో తురిమిన కొబ్బరి, కేసరి, గుల్కంద్, యాలకుల పొడిని వేసి బాగా కలిపి వేయించండి.
అన్నీ కలిసిపోయేంత వరకూ కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి.
ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత పొడి చేసిన చక్కెరను దీంట్లో వేసి కలపండి.
ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న వుండలుగా చేసుకుని పూరీలను తయారు చేసుకోండి.
మరీ మందంగా, కాకుండా మరీ పలుచగా తయారు చేసుకున్న పూరీలలో గుల్‌కంద్, కోవా మిశ్రమాన్ని వేసి నింపండి.
తరువాత పూరీ అంచులను కొద్ది కొద్దిగా తడుపుకుంటూ కజ్జికాయల్లాగా మడతపెట్టుకోండి.
ఇలా మిగిలిన పిండి, గుల్‌కంద్, కోవా మిశ్రమంతో కజ్జికాయలను తయారు చేసుకుని పక్కకు పెట్టుకోండి.
తర్వాత డీప్ ఫ్రై కోసం ఒక కడాయి తీసుకుని దాంట్లో నూనెను పోసి వేడి చేయండి.
నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో కజ్జికాయలను వేసి వేయించండి. రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చేంత వరకూ వేయించి బయటకు తీసుకోండి.
అంతే రుచికరమైన గుల్‌కంద్ కజ్జికాయలు రెడీ అయినట్టే. మీకు కావాలంటే ఇవి వేడి మీద ఉన్నప్పుడే వీటి మీద సన్నగా తరిగి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ తో గార్నీష్ చేసుకోవచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయి.
సంబంధిత కథనం