Weight Gaining Reasons : వ్యాయామాలు చేసినా బరువు తగ్గడం లేదా? కారణాలివే-reasons for weight gaining after workout all you need to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Gaining Reasons : వ్యాయామాలు చేసినా బరువు తగ్గడం లేదా? కారణాలివే

Weight Gaining Reasons : వ్యాయామాలు చేసినా బరువు తగ్గడం లేదా? కారణాలివే

Anand Sai HT Telugu

Weight Gaining Reasons After Workout : కొంత మంది ఎంత వ్యాయామం చేసిన బరువు తగ్గరు. డైట్ ఫాలో అయినా బరువు పెరుగుతూనే ఉంటుంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి.

వ్యాయామం చేసినా బరువు తగ్గడం లేదా?

మంచి శరీర ఆకృతి ఉంటే వచ్చే కిక్కు వేరు. మనల్ని మనం అందంగా చూసుకోవడానికి కష్టపడతాం. ఆహారంతో పాటు గంటల తరబడి వర్కవుట్ చేస్తాం. వర్కౌట్స్ చేసి చెమట వచ్చేలా చేస్తూ పోతే శరీరం మరింత బిగువుగా కనిపిస్తుంది. ఒకవేళ మీరు కంటిన్యూగా వర్కవుట్ చేసి ఆపై కూడా బరువు పెరుగుతూ ఉంటే భయపడటం సహజం. అయితే ఆందోళన చెందే బదులుగా అసలు అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. అప్పుడే ప్రత్యామ్నాయం ఆలోచించొచ్చు.

వర్కవుట్ చేయడం వల్ల శరీరంలోని అదనపు క్యాలరీలను కరిగించి శరీర ఆకృతిని మెరుగుపరచడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మీరు ఆశించిన ఫలితాలను పొందకపోతే దాని వెనక చాలా కారణాలు ఉన్నాయని అర్థం. అసలు వ్యాయామం చేసిన తర్వాత కూడా బరువు పెరిగేందుకు కారణాలను తెలుసుకోవాలి.

మీరు వర్కౌట్స్ చేసినప్పుడు గట్టి కండరాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా ఆహారం, వ్యాయామంపై ఆధారపడి ఉంటుంది. మీరు వర్కౌట్‌లు చేసినప్పుడు, తగినంత మొత్తంలో ప్రోటీన్‌ను తీసుకుంటే అది మీ కండర ద్రవ్యరాశిని మరింత పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో బరువును తనిఖీ చేసినప్పుడు తగ్గడానికి బదులుగా పెరిగినట్లు కనిపిస్తుంది. చాలా మంది ప్రోటీన్‌తోపాటుగా ఇతర ఆహార పదార్థాలను తీసుకుంటారు. కొందరు వర్కౌట్ చేసినా సరైన జీవన శైలి పాటించరు. దీంతో బరువు తగ్గినట్టుగా అనిపించదు.

వ్యాయామం తర్వాత కూడా మీ బరువు తగ్గకపోవడం గమనిస్తే కొంత సప్లిమెంట్‌ను తీసుకుంటున్నారని అర్థం. దీని వల్ల కొంత వరకు బరువు పెరిగే సమస్య ఉండవచ్చు. నిజానికి చాలా మంది అథ్లెట్లు వ్యాయామం తర్వాత కార్బోహైడ్రేట్లను కలిగి ఉన్న సప్లిమెంట్లను తీసుకుంటారు. పిండి పదార్థాలు కండరాలలో గ్లైకోజెన్‌తో నీటిని పునరుద్ధరించడానికి సహాయపడతాయి. ఇది సాధారణ ఆరోగ్యకరమైన రికవరీ ప్రక్రియ. అందువల్ల మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మీ స్వంతంగా ఏదైనా సప్లిమెంట్ తీసుకోవడం మాత్రం మెుదలుపెట్టవద్దు.

వ్యాయామం తర్వాత మీ బరువు తగ్గడం మీరు చూస్తే చెమట కారణంగా మీ శరీరం నీటిని కోల్పోతుంది. అదేవిధంగా, మీరు పెరిగిన బరువును గమనించినట్లయితే అది నీటిని నిలుపుకోవడం వల్ల కావచ్చు. సాధారణంగా ఇది వ్యాయామం తర్వాత తరచుగా జరుగుతుంది. అందరూ చెమట వచ్చేలా వ్యాయామం చేయరు. కొందరు జిమ్ వెళ్లి వచ్చామంటే వచ్చాం అన్నట్టుగానే చేస్తారు. మీ శరీరంలో నుంచి చెమట రూపంలో నీరు బయటకు రాకుంటే వర్కౌట్స్ చేసినా బరువు తగ్గరు. ఎంత ఉన్నారో అంతే ఉంటారు.

ఇక ఎక్కువ మంది చేసే సాధారణ తప్పు ఒకటి ఉంది. ఇది కచ్చితంగా రిపీట్ చేస్తుంటారు. చాలా సార్లు మనం వర్క్ అవుట్ చేసి, అవసరానికి మించి తింటాం. వర్కవుట్ చేయడం వల్ల కేలరీలు కరిగిపోయాయని భావిస్తాం. దీంతో కొంచెం ఎక్కువ తింటాం. దీని వల్ల ప్రయోజనం ఉండదు. ఇలా నిరంతరం చేస్తే మీ బరువు పెరుగుతుంది. మనం బర్న్ చేసే దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకోవడం ప్రారంభించడం మంచిది కాదు. అందువల్ల అనారోగ్యకరమైన స్నాక్స్‌కు బదులుగా పండ్లు, కూరగాయలను తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. మెరుగైన ఫలితాలు కావాలంటే ప్రీ-వర్కౌట్, పోస్ట్-వర్కౌట్, రోజూ వారీ భోజనం గురించి డైటీషియన్‌ను సంప్రదించాలి.