మీకు బుక్ రీడింగ్ అలవాటు లేదా? రోజుకి కొన్ని పేజీలు చదివితే కలిగే లాభాలు తెలిస్తే ఈరోజే బుక్ చేతికి తీసుకుంటారు
Book Reading: పుస్తకాలు చదవడం వల్ల మీ రోజువారీ జీవితంలో అనేక మార్పులు రావడాన్ని మీరు గమనించొచ్చు. రోజుకి కొన్ని పేజీలు చదవడం ద్వారా మీ రోజువారీ ఒత్తిడి నుంచి కూడా సులభంగా బయటపడొచ్చు.
మొబైల్ చేతికి వచ్చిన తర్వాత మనలో చాలా మంది పుస్తకాలు చదవడమే మానేసి ఉంటారు. పుసక్త పఠనం మానసిక శక్తిని పెంచి, ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తుంది. అలానే మనకు తెలియని కొత్త విషయాలు కూడా నేర్పుతుంది. మంచి పుస్తకాలు చదివితే.. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ.. మనలో చాలా మంది గంటలకొద్దీ ఫోన్‌లు చూడటానికి ఇష్టపడతాం తప్ప.. 10 నిమిషాలు కూడా బుక్ చదవడానికి మొగ్గు చూపడం లేదు.
పుస్తకాలు చదువుతున్నప్పుడు మన మెదడు వివిధ దృశ్యాలను, భావనలు సృష్టిస్తుంది, ఇది సృజనాత్మకతను పెంచుతుంది. అలానే పుస్తకాలు మనల్ని దూరదృష్టి ఉన్న వ్యక్తులుగా మార్చి, ఆలోచన శక్తిని కూడా పెంచుతాయి. పుస్తకం చదవడం మంచి నిద్రకు కూడా సహాయపడుతుంది.
ఎలా చదవాలి?
పుస్తక పఠనం సరళంగా సాగాలంటే నిర్దిష్ట ప్రణాళిక అవసరం. ఒక పుస్తకం చదివేటప్పుడు, ముఖ్యమైన విషయాలను గుర్తించుకోవాలి. ముఖ్యంగా మీ ఆసక్తులకు, లక్ష్యాలకు సంబంధించిన పుస్తకాలను ఎంచుకోవడం మంచిది. మీకు పుస్తకం చదివే అలవాటు లేకపోతే తొలుత నెమ్మదిగా చదవాలి, అలానే అర్ధం చేసుకుంటూ చదవడం కూడా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ప్రతి రోజు ఒక నిర్దిష్ట సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయించడం ద్వారా మీకు అది అలవాటుగా మారుతుంది.
ఎప్పుడు చదవాలి?
ఉదయం లేదా రాత్రి సమయాలలో పుస్తకం చదవడం ఉత్తమం. విశ్రాంతిగా ఉండే సమయాల్లో లేదా నిద్రకు ముందు చదవడం మీ ఆలోచనశక్తిని మెరుగుపరుస్తుంది. వారంలో కనీసం ఒక పుస్తకం చదవాలని లక్ష్యం పెట్టుకుని క్రమశిక్షణతో బుక్ చదవండి.
రోజుకి ఎన్ని పేజీలు?
ప్రతిరోజూ కనీసం 20-30 పేజీలు చదవడం మంచి ఆరంభం. ఇది మీ సమయాన్ని బట్టి 50 పేజీల వరకు పెంచుకోవచ్చు. ఇక వీకెండ్‌లో అయితే ఈ పేజీలను రెట్టింపు చేసుకుని పుస్తకాన్ని ఫినిష్ చేయడానికి ప్రయత్నించండి. ఇలా వారానికి ఒక పుస్తకం చదివితే.. మీ వ్యక్తిగత, వృత్తి జీవితంలో మెరుగైన ఫలితాలు చూస్తారు.
వారానికి ప్రణాళిక
మీ తీరికను బట్టి వారానికి 200-250 పేజీల ప్రణాళికను పెట్టుకోవచ్చు. వారంలో ఏడు రోజులకి ఈ పేజీలను విభజించి క్రమబద్ధంగా చదవండి. ఉదయం, రాత్రి.. వీలైతే మధ్యాహ్నం కూడా కొన్ని పేజీలను చదవడానికి ప్రయత్నించండి.
వేరియేషన్ చూసుకోండి
ప్రతి వారం ఒకే జానర్ పుస్తకాలు కాకుండా.. వారానికి ఒక జానర్ చొప్పున పుస్తకాలు చదవడం మీకు కొత్తగా అనిపిస్తుంది. కాల్పనిక పుస్తకాలు, ఆత్మకథలు చదవడం ద్వారా మీ నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకోవచ్చు.
బెడ్‌రూములో బుక్‌లు
రాత్రి నిద్ర రాక ఇబ్బందిపడేవారు. బెడ్ రూములోనే చేతికి అందుబాటులో పుస్తకాలు ఉంచుకోవాలి. రాత్రి పడుకునే ముందు కొన్ని పేజీలు పుస్తకం చదివితే చాలు.. ఆటోమేటిక్‌గా నిద్ర వచ్చేస్తుంది. చదివే సమయంలో టీవీ, మొబైల్ ఫోన్లకి దూరంగా ఉంటే మీరు బుక్ రీడింగ్‌ను బాగా ఆస్వాదించొచ్చు.
పుస్తకాలు చదివే వారు.. ఇంటా బయట మీనింగ్‌ఫుల్‌గా మాట్లాడగలరు. అలానే అర్థవంతంగా రాయగలిగే శక్తి కూడా వారికి లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈరోజు నుంచే పుస్తక పఠనాన్ని మొదలెట్టండి.
టాపిక్