Mutton Curry: పచ్చిమామిడి మటన్ కర్రీ స్పైసీగా వండుకుంటే అదిరిపోతుంది
Mutton Curry: వేసవిలో పచ్చిమామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి. వీటితో మటన్ కర్రీ వండితే కాంబినేషన్ అదిరిపోతుంది. రెసిపీ కూడా చాలా సులువు.
Mutton Curry: మటన్ కర్రీ పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఇక పచ్చి మామిడితో మటన్ కర్రీ తిన్నారంటే ఇక మర్చిపోలేరు. వేసవిలోనే పచ్చిమామిడి అధికంగా దొరుకుతుంది. ఇది సీజనల్‌గా దొరికేది, కాబట్టి ఆయా సీజన్లలో వీటిని కచ్చితంగా తినాలి. పచ్చిమామిడితో మటన్ కర్రీ వండుకొని చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం. దీన్ని కాస్త స్పైసీగా ఉంటే ఎంతోమంది ఫ్యాన్స్ అయిపోతారు. పచ్చిమామిడి కాయ మటన్ కర్రీ రెసిపీ ఎలాగో ఇక్కడ ఇచ్చాము.
పచ్చిమామిడి మటన్ కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు
మామిడికాయ - ఒకటి
మటన్ - అరకిలో
పసుపు - పావు స్పూను
కారం - రెండు స్పూన్లు
ఎండుమిర్చి - ఆరు
గరం మసాలా - ఒక స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
ఉల్లిపాయలు - రెండు
జీలకర్ర - అర స్పూను
నూనె - సరిపడా
ఉప్పు - రుచికి సరిపడా
మామిడికాయ మటన్ కర్రీ రెసిపీ
1. మటన్ లేతగా ఉన్నది తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి.
3. వాటిని తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయల్ని కూడా ఇలా వేయించి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
4. ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
6. నూనెలో గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ ముద్దను వేసి బాగా వేయించుకోవాలి.
7. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం కూడా వేసి వేయించాలి.
8. చిన్న మంట మీద వేస్తే ఇవి పచ్చివాసన పోయేదాకా ఉంటాయి.
9. ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న మటన్ ను వేసి బాగా కలపాలి.
10. ఈ మొత్తం మిశ్రమాన్ని కుక్కర్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అందులోనే మామిడికాయను తొక్కు తీసి చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి.
11. రుచికి సరిపడా ఉప్పును వేసి కుక్కర్ మూత పెట్టేయాలి.
12. రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. అంతే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది.
13. మటన్ లేతగా ఉన్నది తీసుకుంటే త్వరగా ఉడుకుతుంది. అదే ముదురుది అయితే ముందుగానే కుక్కర్లో బాగా ఉడికించుకున్నాకే వండుకోవాలి.
14. ఈ మామిడికాయ మటన్ కర్రీ గ్రేవీ చిక్కగా వస్తుంది. వేడి వేడి అన్నంలో, బిర్యానిలో, బగారా రైస్ లో వేసుకుంటే రుచి అదిరిపోతుంది.
కేవలం వేసవిలో మాత్రమే దొరికే సీజనల్ ఆహారం పచ్చిమామిడి దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. పచ్చిమామిడిని తినడం వల్ల రోగనిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది. అలాగే చిగుళ్ల ఇన్ఫెక్షన్, రక్తం కారడం, పంటి నొప్పిని తగ్గించే శక్తి పచ్చి మామిడికి ఉంది. కాబట్టి పచ్చిమామిడిని తింటే ఈ సమస్యలు తగ్గుతూ ఉంటాయి. జుట్టుకి, చర్మానికి పచ్చిమామిడి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్ ఈ, ప్రోటీన్లు, ఐరన్, జింక్, విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి మెరుపును తెస్తుంది. ఇందులో ఉండే బీటా కెరాటిన్, ఒక యాంటీ ఆక్సిడెంట్ దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి బలంగా మారుతుంది.
మటన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా గర్భిణులు మటన్ తినడం వల్ల పిల్లల్లో ఎలాంటి లోపాలు రాకుండా పుట్టే అవకాశం ఎక్కువ. డయాబెటిస్ ఉన్నవారు మటన్ పరిమితంగా తినాలి. సాధారణ వ్యక్తులు మటన్‌ను మితంగా తింటేనే ఆరోగ్యం. అతిగా తింటే మాత్రం చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి వారానికి ఒకసారి మటన్ తినడం వల్ల అన్ని రకాలుగా ఆరోగ్యం అందుతుంది.
టాపిక్