Raw Mango Masala Curry: పచ్చి మామిడితో మసాలా కర్రీ వండితే రుచి అదిరిపోతుంది, రెసిపీ చాలా సింపుల్
Raw Mango Masala Curry: పచ్చిమామిడికాయలు వేసవిలో అధికంగా దొరుకుతాయి. వీటితో మసాలా కర్రీ వండుకోవచ్చు. వేడివేడి అన్నంలో ఈ కర్రీ కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది.
Raw Mango Masala Curry: వేసవిలో మామిడి పండ్లను తినేందుకు ఎక్కువమంది వేచి ఉంటారు. అలాగే పచ్చి మామిడితో ఊరగాయలు, ఆవకాయలు పెట్టేందుకు సిద్ధమవుతారు. అలాగే పచ్చిమామిడితో మసాలా కర్రీ వండుకుని చూడండి. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ అదిరిపోతుంది. పచ్చి మామిడిని తీసుకుంటే ఈ కర్రీ సూపర్ గా వస్తుంది. పుల్ల పుల్లని మామిడితో స్పైసీగా కర్రీ వండితే ఆ రుచే వేరు. దీన్ని ఒకసారి తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. వేసవిలో మాత్రమే పచ్చి మామిడికాయలు దొరుకుతాయి. కాబట్టి ఈ రెసిపీని ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి.
మామిడికాయ మసాలా కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు
పచ్చి మామిడికాయలు - రెండు
ధనియాలు - రెండు స్పూన్లు
ఆవాలు - అర స్పూను
కారం - రెండు స్పూన్లు
తెల్ల నువ్వులు - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - ఆరు
ఉప్పు - రుచికి సరిపడా
ఎండుమిర్చి - నాలుగు
నూనె - సరిపడినంత
మెంతులు -పావు స్పూను
కరివేపాకులు - గుప్పెడు
నూనె - సరిపడినంత
మామిడికాయ మసాలా కర్రీ రెసిపీ
1. పుల్లటి పచ్చి మామిడికాయను ఈ రెసిపీ కోసం ఎంచుకోవాలి. పైన పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు మిక్సీ జార్లో ధనియాలు, ఆవాలు, ఎండుమిర్చి, మెంతులు, నువ్వులు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పొడిచేయాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
4. అందులో వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకులు వేసి వేయించాలి.
5. ఆ తర్వాత మామిడి ముక్కలను వేసి గరిటెతో కలుపుకోవాలి.
6. ఒక ఐదు నిమిషాల పాటు మామిడికాయ ముక్కలను మూత పెట్టి ఉడికిస్తే అవి మెత్తగా ఉడుకుతాయి.
7. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి బాగా కలుపుకోవాలి.
8. అలాగే కారం కూడా వేసి బాగా కలపాలి. ఇగురు కోసం కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించాలి.
9. తర్వాత పైన కొత్తిమీరను జల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ మామిడికాయ మసాలా కర్రీ రెడీ అయినట్టే.
10. ఇది వేడి అన్నంలో వేసుకుని కలుపుకొని తింటే రుచి అదిరిపోతుంది.
దాదాపు ఊరగాయ రుచి కన్నా ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది. మామిడికాయలను సన్నగా తురుముకుంటే అన్నంలో బాగా కలుస్తాయి. పెద్ద ముక్కలు తరుముకుంటే ఊరగాయల బుద్ధి చేస్తాయి పచ్చి మామిడిలో ఉండే పోషకాలు అన్ని మనకు కావాలంటే కచ్చితంగా ఇలాంటి కూరలు రెసిపీలు ప్రయత్నించాల్సిందే