Rangeela Burfi: తీయ తీయని రంగీలా బర్ఫీ , పాలపొడితో పావుగంటలో ఈ స్వీట్ చేసేయొచ్చు
Rangeela Burfi: రంగీలా బర్ఫీ పేరు వింటేనే ఒక క్లాసిక్ ఇండియన్ స్వీట్‌లా అనిపిస్తుంది. వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండగలు వచ్చేస్తున్నాయి. ఈ రంగీలా బర్ఫీ స్వీట్ రెసిపీని తెలుసుకొని అతిధులకు వడ్డించేయండి.
Rangila Burfi: రంగీలా బర్ఫీ చూడగానే నోరూరించేలా ఉంటుంది. దీన్ని చాలా తక్కువ సమయంలో వండేసుకోవచ్చు. దీన్ని పాలపొడితో చేస్తారు. కాబట్టి రుచి కూడా అదిరిపోతుంది. పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. దీన్ని ఒకసారి చేసుకుని చూడండి, ఏ పండగ వచ్చినా మీరు రంగీలా బర్ఫీని చేసుకునేందుకు ఇష్టపడతారు.
రంగీలా బర్ఫీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
పాలపొడి - రెండు కప్పులు
పాలు - ఒక కప్పు
చక్కెర - అర కప్పు
నెయ్యి - అర కప్పు
ఫుడ్ కలరింగ్ - చిటికెడు
బాదం - గుప్పెడు
రంగీలా బర్ఫీ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయండి.
2. ఆ నెయ్యిలో పాలు వేసి చిన్న మంట మీద కలుపుతూ ఉండండి.
3. ఆ పాలల్లో పాల పొడిని కూడా వేసి గరిటతో కలుపుతూనే ఉండండి. లేకుంటే ఉండలు కట్టే అవకాశం ఉంది.
4. అందులోనే చక్కెరను వేసి బాగా కలుపుకుంటూ ఉండండి.
5. యాలకుల పొడిని కూడా ఆ మిశ్రమంలో వేయండి.
6. ఈ మొత్తం మిశ్రమం దగ్గరగా హల్వాలాగా అయ్యేవరకు వేయించండి.
7. మీకు నచ్చిన ఫుడ్ కలర్ ఇందులో వేసుకోండి.
8. ఫుడ్ కలర్ కచ్చితంగా వేయాలని లేదు. ఫుడ్ కలరింగ్ వేస్తే మీకు నచ్చిన రంగులో ఈ స్వీట్ వస్తుంది. లేకుంటే పాలపొడి రంగులోనే క్రీమ్ కలర్ లో ఉంటుంది.
8. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక ట్రేలో వేసి ముక్కలుగా కోసి చల్ల బరచండి.
9. అంతే టేస్టీ రంగీలా బర్ఫీ రెడీ అయిపోతుంది.
10. దీన్ని చేయడం చాలా సులువు. ఒకసారి చేశారంటే అది చేయడం ఎంత ఈజీయో మీకు అర్థం అవుతుంది.
11. అతిథులు హఠాత్తుగా ఇంటికి వస్తున్నప్పుడు ఈ రంగీలా బర్ఫీని చేసి పెట్టొచ్చు. లేదా పుట్టినరోజు వేడుకలు, వినాయక చవితి వంటి పండగల్లో కూడా ఈ రంగీలా బర్ఫీని భాగం చేయవచ్చు.
పాల పొడిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి ఈ స్వీటులో కూడా కొన్ని పోషకాలు లభించే అవకాశం ఉంది. దీనిలో చక్కెర అధికంగా వేశాం, కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు మాత్రం తినకపోవడం మంచిది. పిల్లలకు ఇస్తే దీని ఇష్టంగా తింటారు.