Business with Rs50: కేవలం 50 రూపాయలతో ప్రారంభించిన రాఖీల బిజినెస్ ఇప్పుడు లండన్ వరకు చేరింది, ఏడాదికి లక్షల సంపాదన-rakhi business started with just rs 50 has now reached london meenakshi walke earning lakhs per year ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Business With Rs50: కేవలం 50 రూపాయలతో ప్రారంభించిన రాఖీల బిజినెస్ ఇప్పుడు లండన్ వరకు చేరింది, ఏడాదికి లక్షల సంపాదన

Business with Rs50: కేవలం 50 రూపాయలతో ప్రారంభించిన రాఖీల బిజినెస్ ఇప్పుడు లండన్ వరకు చేరింది, ఏడాదికి లక్షల సంపాదన

Haritha Chappa HT Telugu

Business with Rs50: అన్నదమ్ములు అనుబంధానికి చిహ్నంగా రాఖీని చెప్పుకుంటారు. రాఖీలలో వెదురు రాఖీలు వెరీ స్పెషల్. అలా వెదురు రాఖీలతోనే తన బిజినెస్ ను ఖండాంతరాలు దాటించింది ఓ గృహిణి.

రాఖీల బిజినెస్

ఏ బిజినెస్ చేయడానికి అయినా వేలల్లో లేదా లక్షల్లో పెట్టుబడి పెట్టాలి. కానీ ఒక మహిళ కేవలం 50 రూపాయల పెట్టుబడితో బిజినెస్‌ను మొదలుపెట్టింది. ఆ బిజినెస్ ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. లండన్‌లో కూడా ఈమె తయారు చేసిన వెదురు రాఖీలను వాడుతున్నారంటే అర్థం చేసుకోండి. ఆమె బాగా చదువుకున్న ఆధునిక మహిళ కాదు. ఒక సాధారణ స్త్రీ తన తెలివితేటలతో, కృషితో సొంతంగా బిజినెస్‌ను మొదలుపెట్టి ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.

మహారాష్ట్రలో మీనాక్షి వాల్కేను ‘బాంబూ విమెన్’ అని పిలుస్తారు. ఈమె తయారు చేసిన వెదురు రాఖీలే ఈమెకు వెదురు మహిళగా పేరును తెచ్చిపెట్టాయి.

డిప్రెషన్ నుంచి

మీనాక్షికి 2014లో వివాహం జరిగింది. రెండేళ్ల పాటు ఆమె ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉండేది. ఒక కొడుకు పుట్టాక భర్త తెచ్చిన జీతం సరిపోయేది కాదు. దీంతో ఆమె కూడా పనిచేయాలని అనుకుంది. ఇంట్లోనే తనకు వచ్చిన చెక్క బొమ్మలు, దారంతో ఆభరణాలు తయారు చేయడం ప్రారంభించింది. అలా నాలుగేళ్ల పాటు అదే పని చేసింది. 2018లో ఆమె మళ్ళీ ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. కానీ ఆ కుమార్తె ప్రసవ సమయంలోనే మరణించింది. తాను అధికంగా కష్టపడడం వల్లే ఒత్తిడికి గురై ఇలా ప్రసవంలో బిడ్డ చనిపోయిందని అనుకుంది. అందుకని ఇంట్లో ఏ పని చేయడానికి ఇష్టపడేది కాదు. ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఆమె భర్త ఎంతో సహకరించాడు. తిరిగి పని మొదలుపెట్టమని ప్రోత్సహించారు.

యాభై రూపాయలతో వెదురు కొని

అటవీ శాఖ వారు ఒకసారి వెదురుతో రకరకాల వస్తువులు తయారు చేయడం పై శిక్షణను ఇచ్చారు. ఆ శిక్షణకు వెళ్ళమని భర్త ప్రోత్సహించడంతో మీనాక్షి వెళ్ళింది. ఆమెకి అప్పటికి చెక్క పని తప్ప ఇంకేమీ తెలియదు. ఎప్పుడైతే వెదురుతో కళాఖండాలు చేయడం నేర్చుకుంది. ఆమెకి దానిపై ఇష్టం పుట్టింది. ఆ శిక్షణ సమయంలోనే వెదురుతో వస్తువులు చేసేందుకు ఒక టూల్ కిట్ ఇచ్చారు. ఆమె దానితోపాటు ఒక 50 రూపాయలు పెట్టి వెదురును కొని ఇంటికి తెచ్చింది. అదే ఆమె మొదటిసారిగా పెట్టిన పెట్టుబడి.

50 రూపాయల వెదురుతోనే చిన్న చిన్న వస్తువులను తయారు చేసి, వాటిని అమ్మింది. అలా ప్రతిసారీ వెదురు కొనుక్కొని తెచ్చుకొని చిన్నచిన్న బొమ్మలు చేసి అమ్మడం మొదలు పెట్టింది. అలా ఆమెకు ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. ఒకసారి ప్రభుత్ంవ నిర్వహించిన ఒక పెద్ద ఉత్సవంలో ఆమె తన వెదురు కళాఖండాలను ప్రదర్శించింది. అప్పుడు ఎంతోమంది కొనుక్కోవడం ఆమెకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది.

వెదురు రాఖీలు
వెదురు రాఖీలు

మీనాక్షికి మెల్లమెల్లగా గుర్తింపు వచ్చిన తర్వాత ఆమె వెదురు కళాఖండాల్లో కొత్తదనాన్ని తీసుకురావాలని అనుకుంది. ఆమె బాగా ఆలోచించి రాఖీలను ఎందుకు తయారు చేయకూడదని అనుకుంది. అలాగే ఫ్రెండ్షిప్ బ్యాండ్‌లను కూడా తయారు చేసింది. వెదురుతోనే తయారు చేసిన రాఖీలు చాలా అందంగా, సృజనాత్మకంగా అనిపించాయి. దీంతో ఆమెకు ఆర్డర్లు మరింతగా పెరిగాయి. రాఖీల తయారీలో ఎలాంటి ప్లాస్టిక్ వాడకుండా కేవలం వెదురుతో పర్యావరణహితంగా ఆమె తయారు చేయడంతో ఉత్పత్తుల అమ్మకాలు పెరిగాయి.

రాఖీలకు వాడే దారం కూడా ఖాదీతో తయారు చేసిందే. దీంతో కస్టమర్లు ఆమెకు అధికంగా ఆర్డర్ లేవడం మొదలుపెట్టారు. 500 రాఖీలను తొలిసారి లండన్‌కు ఎగుమతి చేసింది. అక్కడ ఈమె చేసిన రాఖీలు నచ్చడంతో పదివేల రాఖీలు కావాలని ఆర్డర్లు వచ్చాయి. ఆ పదివేల రాఖీలతో ఆమె మూడు లక్షల రూపాయలు సంపాదించింది. అక్కడి నుంచి రకరకాల రాఖీలు తయారు చేస్తూ ఆమె బిజీగా మారిపోయింది. ఇంట్లో భార్య చేసిన చేస్తున్న వ్యాపారం పుంజుకోవడంతో భర్త కూడా సాయం చేయాల్సి వచ్చింది. ఆయన తన ఉద్యోగాన్ని వదిలేసి ఆమెతో పాటే ఆర్డర్లు తీసుకోవడం, మార్కెటింగ్ వంటి బాధ్యతలు తీసుకున్నారు.గతేడాది రాఖీ పండుగకు 6000 రాఖీలను అందింది.

వెదురు రాఖీ
వెదురు రాఖీ (Meenakshi Walke/Instagram)

తాను వెదురు రాఖీలతో ఉపాధి పొందడమే కాదు తనలాంటి 200 మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చింది. వారందరినీ స్వయం సమృద్ధిగా జీవించమని చెప్పింది. వారిపై వారికి నమ్మకం కుదిరేలా చేసింది.

సామాన్య మహిళలే ఇలా సొంతంగా ఉపాధి పొందుతూ మంచి పేరు సంపాదిస్తున్నారు. చాలామంది బిజినెస్ చేయాలంటే లక్షల రూపాయలు కావాలని అనుకుంటారు. తెలివిగా ఉపయోగిస్తే 100 రూపాయలతో కూడా బిజినెస్‌ను పెట్టవచ్చు. దానికి కావాల్సినదల్లా కృషి, పట్టుదల, తన మీద తనకు నమ్మకం.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం