Ragi moringa roti: రాగి మునగాకు రొట్టె.. షుగర్ ఉన్నవాళ్లకు మంచి అల్పాహారం..
Ragi moringa roti: అల్పాహారంలోకి.. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా తినగలిగే రాగి మునగాకు రొట్టె పోషకాలమయం. దాన్నెలా తయారు చేయాలో చూసేయండి.
రాగి మునగాకు రొట్టె
చిరుధాన్యాలు లేదా మిల్లెట్స్ మీద అవగాహన చాలా పెరిగింది. రోజూవారీ ఆహారంలో చాలా మంది వీటిని తప్పకుండా చేర్చుకునే మార్గాల గురించి ఆలోచిస్తున్నారు. అలాంటి వాటిలో మంచి మార్గం రాగి రొట్టెలు. వీటికే మునగాకును చేర్చి చేసే రాగి మునగాకు రొట్టె ఆరోగ్యదాయకం. దాన్నెలా తయారుచేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
2 కప్పుల రాగిపిండి
1 కప్పు గోదుమపిండి
1 కప్పు మునగాకు, తరుగు
చిన్న అల్లం ముక్క, తరుగు
4 పచ్చిమిర్చి, సన్నని తరుగు
అరచెంచా మిరియాల పొడి
తగినంత ఉప్పు
2 చెంచాల నెయ్యి
తయారీవిధానం:
- ముందుగా మునగాకును శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు పెద్ద గిన్నెలో రాగిపిండి, గోదుమపిండి, పచ్చిమిర్చి సన్నని ముక్కలు, అల్లం తురుము, మునగాకు, మిరియాల పొడి, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
- కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటూ పిండిని పక్కన పెట్టుకోవాలి.
- వీటిని వేడిగా తింటేనే సరైన రుచి కాబట్టి. వేడిగా చేసుకుంటూ ఇంట్లో వాళ్లకి సర్వ్ చేసేస్తూ ఉండండి.
- ముందుగా కలుపుకున్న పిండిని ఉండల్లా చేసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. వేడిపెనం మీద వేసుకుని కాల్చుకోవాలి.
- రెండు వైపులా అంచుల వెంబడి నెయ్యి వేసుకుని కాస్త రంగు మారేదాకా కాల్చుకోవాలి.
- ఈ రాగి రొట్టెల్ని ఏదైనా కర్రీతో లేదా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. చల్లని పెరుగుతో అద్దుకుని తిన్నా బాగుంటుంది.