Ragi Garelu: రాగులతో చేసే రెసిపీలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ వాటితో ఏం చేయాలో తెలియక ఎంతోమంది జావ మాత్రం చేసుకొని తాగుతారు. ఇక్కడ మేము రాగి గారెల రెసిపీ ఇచ్చాము. వీటిని చేయడం చాలా సులువు. ఇవి క్రంచీగా, టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి చేసుకుంటే మీకు మళ్లీ మళ్లీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఈ రాగి గారెలు రెసిపీ ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి.
రాగి పిండి - ఒక కప్పు
పుట్నాల పప్పు - అర కప్పు
వేరు శనగపప్పు - అర కప్పు
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - ఒక కట్ట
కరివేపాకులు - గుప్పెడు
పచ్చిమిర్చి - ఐదు
ఉల్లిపాయ - ఒకటి
1. మిక్సీలో పుట్నాల పప్పును, వేరుశెనగ పలుకులను వేసి బరకగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక గిన్నెలో రాగి పిండిని వేయాలి.
3. ఆ రాగి పిండిలోనే ఈ పప్పుల పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
4. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని వేసి బాగా కలపాలి.
5. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకులను వేసి కలుపుకోవాలి.
6. రుచికి సరిపడా ఉప్పును వేయాలి.
7. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి.
8. గారెలు వేయడానికి ఎంత మందంగా పిండి కావాలో అంత మందంగా ఆ పిండిని కలుపుకోవాలి.
9. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి.
10. నూనె వేడెక్కాక ఈ రాగి పిండిని చేతితోనే చిన్న ముద్ద తీసుకొని గారెల్లా ఒత్తుకొని నూనెలో వేసుకోవాలి.
11. రెండు వైపులా కాల్చుకొని తీసి టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి.
12. టిష్యూ పేపర్ అదనపు నూనె పీల్చేస్తుంది.
13. అంతే టేస్టీ రాగి గారెలు రెడీ అయినట్టే.
14. ఈ రాగి గారెలను కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
రాగులతో చేసిన వంటకాలు తినడం చాలా ముఖ్యం. మినప్పప్పుతో చేసిన గారెల కన్నా రాగి పిండితో చేసిన గారెలు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఆహారంలో చిరుధాన్యాలను భాగం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. కేవలం రాగులతోనే కాదు కొర్రలు, సామలతో కూడా గారెలను ప్రయత్నించవచ్చు.