Ragi flour recipes: రాగిపిండిని మూడు పూటల భోజనంలో.. ఈ 9 రుచుల్లో తినొచ్చు..-ragi flour recipes for diabetic patients for three time meals ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ragi Flour Recipes: రాగిపిండిని మూడు పూటల భోజనంలో.. ఈ 9 రుచుల్లో తినొచ్చు..

Ragi flour recipes: రాగిపిండిని మూడు పూటల భోజనంలో.. ఈ 9 రుచుల్లో తినొచ్చు..

HT Telugu Desk HT Telugu

Ragi flour recipes: రాగి పిండిని మూడు పూటలా భోజనంలో ఎలా చేర్చుకోవచ్చో తెలుసుకోండి. రాగిపిండితో చేసుకోదగ్గ రుచికరమైన వంటల వివరాలివే..

రాగి పిండితో వంటలు (pexels)

రాగుల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. మధుమేహాన్ని నియంత్రించడంలో ఇవి చాలా దోహదం చేస్తాయి. అయితే వాటిని ఆహారంలో ఎలా చేర్చుకోవాలో తెలీక వాటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అందుకే రోజూవారీ ఆహారంలో రాగిని రుచికరంగా ఎలా తినొచ్చో తెలుసుకుంటే చాలా మేలు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి ప్రకారం 100 మిలియన్ల భారతీయులు మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రాగుల్లో ఉండే అధిక శాతం పీచు, మినరళ్ల వల్ల షుగర్ వ్యాధిని నియంత్రించడంలో సాయపడతాయి.

రాగుల్ని ఆహారంలో ఎలా చేర్చుకోవాలో చూడండి:

1. అల్పాహారం

రాగి జావ:

పాలు లేదా నీళ్లలో రాగి పిండిని ఉడికించి జావ చేసుకుని తాగచ్చు. దీంట్లో తీపి కోసం తేనె లేదా బెల్లం కాస్త కలుపుకుంటే రుచి పెరుగుతుంది. ఇంకాస్త ఆరోగ్యకరంగా మార్చడానికి మీద ఏవైనా పండ్ల ముక్కలు, డ్రైఫ్రూట్స్ వేసుకుని తాగేయొచ్చు.

రాగి ఇడ్లీ లేదా రాగి దోశ:

ఇడ్లీ, దోశ పిండి నానబెట్టేటపుడు బియ్యానికి బదులుగా రాగుల్ని వాడితే చాలు. రాత్రంతా పిండిని పులియబెట్టి ఉదయాన్నే రాగి ఇడ్లీ లేదా దోశలు చేసుకోవచ్చు.

రాగి ప్యాన్ కేకులు:

రాగి పిండిని గోదుమలు లేదా ఓట్స్ పొడితో కడిపి మజ్జిగ కలుపుకుని ప్యాన్ కేకులు చేసుకోవచ్చు. వాటిని యోగర్ట్ లేదా ఇష్టమైన పండ్ల ముక్కలతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

2. మధ్యాహ్న భోజనం:

రాగి రొట్టె:

రాగి పిండిని గోదుమ పిండి, మసాలాలు, తరిగిన కూరగాయ ముక్కలు కలిపి మెత్తగా కలుపుకోవాలి. వాటిని రొట్టెల్లాగా ఒత్తుకుని నూనె లేకుండా కాల్చుకుంటే చాలు. ఏదైనా కూరతో , పెరుగుతో, చట్నీతో వీటిని తినేయొచ్చు.

రాగి ఉప్మా:

ముందుగా రాగి పిండిని వేయించుకోవాలి. తరువాత మామూలు ఉప్మా ఎలా చేస్తామో అలాగే అన్ని కూరగాయలు, మసాలాలు వేసుకుని నీల్లు పోసుకోవాలి. నీళ్లు మసులుతున్నప్పుడు రాగిపిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుకుంటే చాలు. ఈ రాగి ఉప్మా తింటే కడుపు నిండుతుంది.

రాగి సలాడ్:

రాగుల్ని నానబెట్టి మొలకెత్తాక వాటిలో రకరకాల కూరగాయ ముక్కలు, పుదీనా లాంటి ఆకులు వేసుకుని సర్వ్ చేయొచ్చు. ఆరోగ్యకరమైన లంచ్ రెడీ అవుతుంది.

3. రాత్రి భోజనం:

రాగి సూప్:

కూరగాయలు ఉడికించిన నీళ్లు పక్కన పెట్టుకుంటే దాంతో రుచికరమైన రాగి సూప్ రెడీ చేసుకోవచ్చు. ఆ నీళ్లలో రాగి పిండిని ఉడికించి, పిండి ఉడుకుతున్నప్పుడు వివిధ రకాల కూరగాయ ముక్కలు, మసాలాలు వేసుకోవాలి. రాత్రి భోజనానికి ఈ సూప్ తాగితో కడుపు నిండిపోతుంది.

రాగి పాస్తా:

రాగిపిండితో ఇంట్లో పాస్తా సిద్దం చేసుకోవడం కష్టమే కానీ.. మార్కెట్లో రాగి పిండితో చేసిన పాస్తా దొరుకుతోంది. దాన్ని తెచ్చుకుని ఇంట్లోనే ఇష్టమైన సాస్‌లు కలిపి పాస్తా చేసుకోవచ్చు.

రాగి కిచిడి:

రాగుల్ని బియ్యం, పప్పులు, కూరగాయ ముక్కలతో కలిపి ఉడికించుకోవాలి. దీంట్లో తాలింపు పెట్టుకుని పచ్చడి లేదా పెరుగుతో సర్వ్ చేసుకోవచ్చు.