Pumpkin seeds for hair: ఈ గింజలు గుప్పెడు తింటే చాలు.. జుట్టు రాలదు..
Pumpkin seeds for hair: జుట్టు ఆరోగ్యం కోసం చాలా రకాల ఆహారాలు తీసుకుంటాం. ముఖ్యంగా గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల జరిగే మేలు గురించి, వాటిని ఆహారంలో చేర్చుకునే మార్గాల గురించి తెలుసుకోండి.
జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంటే తరచూ షాంపూలు, వివిధ ఉత్పత్తులు మార్చడం చేస్తుంటాం. ఇవేవీ ఫలితాలు ఇవ్వకపోతే జుట్టు ఎక్కువగా రాలిపోయి కొన్ని ట్రీట్మెంట్లు కూడా చేయించుకోవాల్సిన పరిస్థితి. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పనులు. ఇవేవీ లేకుండా సహజసిద్ధంగా జుట్టును ధృడంగా ఉంచుకునేందుకు అనేక మార్గాలున్నాయి. వాటిలో ఉత్తమమైన మార్గంగా మన రోజూవారీ ఆహారంలో చెంచాడు గుమ్మడి గింజలను తీసుకుంటే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ గుమ్మడి గింజల ద్వారా జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి.
కుదుళ్ల రక్షణకు..:
గుమ్మడికాయ గింజల్లో ప్రధానంగా జింక్, ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇందులోని మెగ్నీషియం జుట్టు కుదుళ్లు బలంగా, ఆరోగ్యకరంగా ఉంచేందుకు సహాయపడతాయి. అదే విధంగా ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇది హెయిర్ ఫోలికల్స్‌కు ఆక్సిజన్ రవాణాలో కీలకంగా ఉంటుంది. తద్వారా జుట్టు కుదుళ్లనుంచి బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
కొత్త జుట్టు వచ్చేలా..:
సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో కీలకమైన ప్రోటీన్లు ఈ గుమ్మడి గింజల్లో పుష్కలం. ఈ ప్రోటీన్లు ప్రధానంగా జుట్టు పెరుగుదలకు ఉపయుక్తంగా ఉంటాయి. ఉన్న జుట్టును ధృడంగా ఉంచడమే కాకుండా కొత్త జుట్టు పెరుగుదలకు సాయపడతాయి. అదేవిధంగా దెబ్బతిన్న జుట్టును ఆరోగ్యవంతంగా చేసేలా మేలు చేస్తాయి. ప్రోటీన్లతో పాటే.. ఈ గింజల్లో ఒమేగా-3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి తలకు పోషణ, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.
చుండ్రు తగ్గుతుంది.. :
జుట్టు రాలడం ఒక సమస్య అయితే.. తలలో చుండ్రు రావడం మరో సమస్య. దీనివల్ల కూడా జుట్టు ఆరోగ్యం దెబ్బతిని, జుట్టు నిర్జీవంగా మారి త్వరగా ఊడిపోతుంది. నిత్యం మనం తీసుకునే ఆహారంలో సరైన మోతాదులో పోషకాలు లేకపోవడం కూడా చుండ్రు వచ్చేందుకు ఓ కారణం. అయితే చుండ్రును దూరం చేసేందుకు గుమ్మడికాయ గింజలు ఎంతగానే సహాయపడతాయి. గింజల్లో అధికమొత్తంలో ఉండే జింక్ ఖనిజం మూలంగా ఈ సమస్య దూరం అవుతుంది. ఈ జింక్ వలన మరో ఉపయోగం ఏంటంటే.. జుట్టు సులభంగా తెగిపోకుండా, దృఢంగా మారుస్తుంది. జింక్, మెగ్నీషియం ఖనిజాల వల్ల రక్తప్రసరణను మెరుగుపఢుతుంది. ఈ గింజల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్లు మాడుకు పోషణని అందించి, పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
ఆహారంలో ఎలా చేర్చుకోవచ్చు?
- నూనె లేకుండా వేయించిన గుమ్మడి గింజల్ని సాయంత్రం పూట స్నాక్ లాగా తీసుకోవచ్చు.
- ఓట్స్ లాంటివి తింటున్నపుడు వాటిలో ఈ గింజల్ని కలుపుకుని, పాలు పోసుకుని తినేయొచ్చు.
- ఏవైనా పండ్లతో స్మూతీలు చేస్తున్నపుడు వీటిని గుప్పెడు కలపండి.
- సలాడ్లు, కూరల్లో గుమ్మడి గింజల పొడిని వాడుకోవచ్చు.