Pumpkin Leaves For Women: ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు గుమ్మడికాయ ఆకులు చక్కటి పరిష్కారంగా పనిచేస్తాయి!
Pumpkin Leaves For Women: గుమ్మడికాయ అనగానే చాలా మంది మొహం విరుచుకుంటారు. కానీ దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ముఖ్యంగా గుమ్మడికాయ ఆకులను డైట్లో చేర్చుకోవడం వల్ల ఆడవారు చాలా సమస్యలను నుంచి తప్పించుకోవచ్చట. అవేంటో తెలుసుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
గుమ్మడికాయ తినడం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుమ్మడికాయలే కాదు, గుమ్మడి ఆకులు కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయట. ముఖ్యంగా ఆడవారిలో వచ్చే అనేక సమస్యలను నయం చేయగలిగే శక్తి గుమ్మడి ఆకుల్లో ఉంటుందట. గుమ్మడికాయ ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు, బీటా-కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా కాల్షియం, మాంగనీస్, విటమిన్ B6, ఫాస్ఫరస్ వంటి వాటితో నిండి ఉంటాయి గుమ్మడి ఆకులు. వీటిలోని పోషకాలు శారీరక, మానసిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. గుమ్మడికాయ ఆకులు తినడం వల్ల మహిళల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

గుమ్మడికాయ ఆకులు తినడంమహిళల ఆరోగ్యానికి కలిగే 5 ప్రయోజనాలు:
ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్:
ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ (PMS) ఇప్పుడు చాలా మంది మహిళలకు పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యతో బాధపడే మహిళలు మానసిక మార్పులు, తలనొప్పి, నిరాశ, చిరాకు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. దీని నుండి ఉపశమనం పొందడానికి మహిళలు మాంగనీస్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తారు. గుమ్మడికాయ ఆకుల్లో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని డైట్లో చేర్చుకోవడం వల్ల మహిళలు పీఎంఎస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
మలబద్ధకం:
మహిళల్లో ఎవరైనా మలబద్ధకంతో బాధపడుతున్నట్లయితే, గుమ్మడికాయ ఆకులు వారికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఫైబర్ అధికంగా ఉన్న గుమ్మడికాయ ఆకులను తరచుగా తీసుకోవడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది మలాన్ని మృదువుగా చేయడంతో పాటు విసర్జన ప్రక్రియను కూడా సులభతరం చేస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
బలమైన ఎముకలు:
గుమ్మడికాయ ఆకుల్లో కాల్షియం, ఫాస్ఫరస్ మెండుగా ఉంటాయి. వీటిని తమ డైట్లో భాగం చేసుకోవడం వల్ల మహిళల ఎముకలు బలంగా తయారవుతాయి. దంతాల ఆరోగ్యంలో కూడా గుమ్మడికాయ ఆకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మహిళలు కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పుల నుండి ఉపశమనం పొందగలుగుతారు.
రక్తహీనత:
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య రక్తహీనత. మారిన జీవినశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఇది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. గుమ్మడికాయ ఆకుల్లో ఇనుము పుష్కలంగా ఉండటం వల్ల దీన్ని తినడం వల్ల రక్తహీనత సమస్య క్రమంగా తగ్గుతుంది. పీరియడ్స్ నొప్పుల నుండి కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది.
కొలెస్ట్రాల్:
గుమ్మడికాయ ఆకుల్లో ఉండే ద్రావణీయ ఫైబర్ చిన్న ప్రేగుల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. పిత్త ఆమ్లాల శోషణను తగ్గించడంలోనూ ఇది చాలా బాగా సహాయపడుతుంది. దీంట్లో అధికంగా లభించే ఫైబర్ రక్తంలొ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్త కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఏదో ఒక రూపంలో తరచుగా గుమ్మడి ఆకులను తమ డైట్లో చేర్చుకోవడం వల్ల మహిళలు గుండె జబ్బుల ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.