Pulihora Pulusu: పులిహోర పులుసు ఇలా చేసి పెట్టుకోండి రసం కన్నా ఇది చాలా రుచిగా ఉంటుంది, అన్నం ఇడ్లీలతో తినవచ్చు
Pulihora Pulusu: పులిహోర పులుసు అనగానే పులిహోర కలపడానికి తయారు చేసే మిశ్రమం అనుకోకండి. చారుకు బదులు పులిహోర పులుసు వండుకుంటే టేస్టీగా ఉంటుంది. రెసిపీ తెలుసుకోండి.H
Pulihora Pulusu: ఇంట్లో భోజనం చేసేటప్పుడు కూరా, పప్పు, పెరుగుతో పాటు రసం కూడా ఉండాల్సిందే. ఎప్పుడూ ఒకేలాంటి రసం పెట్టుకునే బదులు కొన్నిసార్లు పులిహోర పులుసును చేసుకోండి. ఇది వండుకుంటే కూర వండాల్సిన అవసరం లేదు. దీన్ని అన్నంతోనే కాదు ఇడ్లీ ,దోశలతో కూడా తినవచ్చు. ఇది కూడా చింతపండుతోనే తయారు చేస్తారు. పుల్లపుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే దీని రుచి మీకు అర్థమవుతుంది. ఈ పులిహోర పులుసును వేడివేడి అన్నంలో కలుపుకొని వడియాలు, అప్పడాలు నంజుకుంటే ఆ రుచే వేరు.
పులిహోర పులుసు రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చింతపండు రసం - అరకప్పు
మినప్పప్పు - అర స్పూను
శనగపప్పు - అర స్పూను
ఆవాలు - ఒక స్పూను
ఎండుమిర్చి - నాలుగు
ఇంగువ - చిటికెడు
బెల్లం తురుము - అర స్పూను
పసుపు - అర స్పూను
నువ్వుల నూనె - రెండు స్పూన్లు
నీరు - సరిపడినంత
పచ్చిమిర్చి - రెండు
పులిహోర పులుసు రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నువ్వుల నూనె వేయండి.
2. అందులోనే శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించండి.
3. తర్వాత ఆవాలు కూడా వేసి వేయించండి.
4. ఎండుమిర్చి, పసుపు, ఇంగువ వేసి వేయించుకోండి.
5. గుప్పెడు కరివేపాకులను కూడా వేయండి. పచ్చిమిర్చిని నిలువుగా కోసి ఒక నిమిషం పాటు వేయించండి.
6. తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి రుచికి సరిపడా ఉప్పును వేసి మీడియం మంట మీద ఉడికించండి.
7. చింతపండు రసం బాగా ఉడుకుతున్నప్పుడు ఒకటిన్నర కప్పు నీళ్లు వేయండి.
8. అలాగే బెల్లం తురుము వేసి ఉడకనివ్వండి.
9. అది కాస్త చిక్కగా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి.
10. అంతే టేస్టీ పులిహార పులుసు రెడీ అయినట్టే. మీకు కావాలంటే దీనిలో కొత్తిమీర తరుగును చల్లుకోవచ్చు.
పులిహోర పులసును వేడి వేడి అన్నంలో కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది. దీనిలో ఎక్కువ అన్నం కలుస్తుంది. అలాగే ఇడ్లీ, దోశెల్లో తిన్నా కూడా పులిహోర పులుసు చాలా టేస్టీగా ఉంటుంది.
అన్నంలో చారు కచ్చితంగా ఉండాల్సినవారు ప్రతి రోజూ దానినే తినకుండా ఇలా పులిహోర పులుసును చేసుకొని తినండి. ఒక్కోసారి కూరా, పప్పు, రసం చేసుకునే ఓపిక లేనప్పుడు ఇలా పులిహోర పులుసును చేసుకుంటే ఇది పుల్ల పుల్లగా రుచిగా ఉంటుంది. కూరగా, రసంగా కూడా ఉపయోగపడుతుంది. మీరు ఒక్కసారి చేసుకొని చూడండి. మీకు నచ్చడం ఖాయం.
టాపిక్