Pulagam recipe: పులగం ఇలా చేశారంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది, పిల్లలకు వారానికి ఒకసారైనా పెట్టండి
Pulagam recipe: పులగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ దీన్ని తినే వారి సంఖ్య ఇప్పుడు తక్కువగానే ఉంది. నిజానికి పులగం లంచ్ బాక్స్ రెసిపీ గా కూడా ఉపయోగించవచ్చు. దీన్ని సింపుల్ గా ఎలా చేయాలో తెలుసుకోండి.
పులగం పేరు చెబితే వద్దనే పిల్లలే ఎక్కువ. నిజానికి పులగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు టేస్టీగా వండి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. దీని లంచ్ బాక్స్ రెసిపీగా కూడా పెట్టవచ్చు. దీన్ని సింపుల్ గా రుచికరంగా ఎలా వండాలో ఇక్కడ రెసిపీ ఇచ్చాము. దీన్ని ఫాలో అయిపోండి. కచ్చితంగా ఇది మీకు నచ్చే తీరుతుంది.
పులగం రెసిపీకి కావలసిన పదార్థాలు
బియ్యం - ఒక కప్పు
పెసరపప్పు - అరకప్పు
నూనె - రెండు స్పూన్లు
కరివేపాకులు - గుప్పెడు
ఉప్పు - రుచికి సరిపడా
ఆవాలు - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూన్
పసుపు - పావు స్పూను
మిరియాలు - అర స్పూను
పచ్చిమిర్చి - ఆరు
టమాటో - ఒకటి
ఉల్లిపాయ - ఒకటి
పులగం రెసిపీ
1. బియ్యం, పెసరపప్పు విడివిడిగా శుభ్రంగా కడిగి గంటసేపు నీళ్లలో నానబెట్టుకోవాలి.
2. ఇప్పుడు కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి.
3. ఆ నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మిరియాలు వేసి వేయించుకోవాలి.
4. తర్వాత నిలువుగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి.
5. అలాగే గుప్పెడు కరివేపాకులను కూడా వేసి వేయించాలి.
6. ఇప్పుడు పసుపును వేసి కలుపుకోవాలి.
7. ముందుగా నానబెట్టిన పెసరపప్పును, బియ్యాన్ని కూడా వేసి బాగా కలపాలి.
8. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి.
9. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమం ఉడకడానికి మూడు కప్పుల నీళ్లను పోసి కుక్కర్ మీద మూత పెట్టేయాలి.
10. మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి.
11. ఆ తర్వాత ఆవిరిపోయాక మూత తీస్తే టేస్టీ పులగం సిద్ధమైనట్టే.
12. ఇది పిల్లలకు ఎంతో నచ్చుతుంది. పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకుంటే స్పైసీగా ఉంటుంది. అదే తక్కువగా వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు.
పులగంతో ఎలాంటి రైతా, కూరలు అవసరం లేకుండానే తినేయవచ్చు. పులగం తినడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలే జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో మన ఆరోగ్యానికి అవసరమైన పదార్థాలను వేసాము. మీకు పులగం స్పైసీగా అనిపిస్తే రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసి ఉండండి. రుచి అదిరిపోతుంది. పిల్లలకు పెట్టేటప్పుడు నెయ్యి వేసి పెడితే వారు ఇష్టంగా తినే అవకాశం ఉంది. దీనిలో పెసరపప్పు వేసాము. కాబట్టి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే మిరియాలు కూడా మన రోగనిరోధక వ్యవస్థను కాపాడుతాయి. పులగం ప్రతి వారం తినాల్సిన అవసరం ఉంది. పిల్లలకు ఒక్కసారైనా పులగాన్ని వండి పెట్టండి. వారి శరీరానికి బలం అందుతుంది, వారు ఉత్సాహంగా ఉంటారు.