Flu in RainySeason: వర్షాకాలంలో ఫ్లూ బారిన పిల్లలు పడకుండా కాపాడుకోండిలా-protect children from flu during monsoons ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Flu In Rainyseason: వర్షాకాలంలో ఫ్లూ బారిన పిల్లలు పడకుండా కాపాడుకోండిలా

Flu in RainySeason: వర్షాకాలంలో ఫ్లూ బారిన పిల్లలు పడకుండా కాపాడుకోండిలా

Haritha Chappa HT Telugu
Aug 02, 2024 06:30 PM IST

Flu in RainySeason: వర్షాకాలం వచ్చిందంటే పిల్లల్లో ఫ్లూ సమస్య ఎక్కువైపోతుంది. ఫ్లూ బారిన పడకుండా పిల్లలను ఎలా కాపాడుకోవాలో ఫెర్నాండేజ్ ఆసుపత్రి డాక్టర్ సునీల్ పవార్ చెబుతున్నారు.

పిల్లల్లో ఫ్లూ లక్షణాలు
పిల్లల్లో ఫ్లూ లక్షణాలు (Pixabay)

Flu in RainySeason: వానాకాలం వచ్చిందంటే మండే ఎండల నుంచి ఉపశమనం లభించడం మాత్రమే కాదు, ఈ సీజన్లో వెంటాడే పలు సమస్యలు ఉన్నాయి. వర్షాల వల్ల తడి బట్టలు, గాలిలో దుర్వాసన, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, అధిక తేమ, వైరల్ ఫీవర్లు పెరగడం వంటి కారణాల వలన ‘ఫ్లూ వైరస్’ వ్యాప్తికి ఈ సీజన్‌ అత్యంత అనుకూలంగా ఉంటుంది.

yearly horoscope entry point

ఈ సీజన్‌లో పిల్లల్లో మార్పులు వస్తే ఆ విషయాన్ని తల్లిదండ్రి గమనించాలి. ముఖ్యంగా ఇన్‌ఫ్లుయేంజా వైరస్‌ల వ్యాప్తిని నివారించడం పై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. వర్షాకాలంలోనే పిల్లలు అధికంగా ఫ్లూకి గురవుతారు. ఫ్లూ చేరడం వల్ల చిన్నారుల రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో వారు అనారోగ్యాలను ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది. ఈ తరుణంలో పాఠశాలలు, పిల్లల సంరక్షణ కేంద్రాలు ఫ్లూ వైరస్ వ్యాప్తికి హాట్‌స్పాట్‌లుగా మారుతాయి. ఇక్కడే పిల్లలు ఇతరులతో సన్నిహితంగా ఎక్కువ సమయం గడుపుతారు.

ఫ్లూ లక్షణాలు ఇవే

ఫ్లూ వచ్చిన పిల్లల్లో జ్వరం, జలుబు, దగ్గు, కండరాల నొప్పి, దద్దుర్లు, ఎరుపు రంగు కళ్లు, నీళ్ల విరేచనాలు, వాంతులు తదితర సమస్యలు కనిపిస్తాయి. కొంతమంది పిల్లల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బీపీలో హెచ్చుతగ్గులు, మూర్ఛ రావడం వంటి తీవ్రమైన లక్షణాలు సైతం కనిపిస్తాయి. ముఖ్యంగా అప్పటికే గుండె జబ్బులు లేదా ఉబ్బసం వంటి ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్న శిశువులకు ఈ ఫ్లూ ప్రాణాంతకంగా మారుతుంది.

మీ బిడ్డను ఎలా రక్షించుకోవాలి?

టీకాలు వేయడం: ఫ్లూని నివారించడానికి టీకాలు వేయడం అత్యంత శ్రేయస్కరమైన పద్ధతి. ప్రతి సీజన్‌లో ఫ్లూ వ్యాక్సిన్ పిల్లలకు వేయించడం చాలా మంచిది. ఇది రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఇది పిల్లల్లో వ్యాధి సంక్రమణను తగ్గించడానికి పోరాడుతుంది. ఆరు నెలలు, అంతకంటే ఎక్కువ వయస్సున్న పిల్లలకు కనీసం ఐదేళ్ల వయస్సు వచ్చే వరకు ప్రతి సంవత్సరం ఫ్లూ టీకా తప్పనిసరిగా వేయాలి.

మంచి పరిశుభ్రత: వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో పిల్లలకు మంచి పరిశుభ్రత అలవాట్లను నేర్పించడం ముఖ్యం. ఈ అలవాట్లలో భాగంగా సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోవడం, హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించేలా చూసుకోవాలి. దగ్గినా లేదా తుమ్మిన సమయంలో టిష్యూలు, మోచేతులతో వారి నోరు, ముక్కు కప్పుకోవడం ముఖ్యం.

ఆరోగ్యకరమైన జీవనశైలి: మీ బిడ్డకు పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే సమతుల్య ఆహారాన్ని అందించండి. వారి రోగనిరోధక వ్యవస్థలను బలోపేతం చేయడానికి తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి. ఈ సీజన్‌ ముగిసే వరకు తగినంత పరిమాణంలో వెచ్చని పానీయాలు వారి చేత తాగించండి.

మీ చిన్నారులకు ఫ్లూ ఉంటే ఏమి చేయాలి?

ఉపశమన మార్గాలు: అత్యవసర పరిస్థితుల్లో జ్వరం, శరీర నొప్పులు తదితర లక్షణాలను ఇంట్లోనే తగ్గించడానికి వైద్యుడు సూచించిన మెడిసిన్‌ను ఉపయోగించవచ్చు. ఈ క్రమంలో పిల్లలకు ఎంత మోతాదులో అందించాలనే విషయంలో వైద్యుల మార్గదర్శకాలను పాటించడం మాత్రం తప్పనిసరి.

యాంటీ వైరల్ డ్రగ్స్: పిల్లలు ఫ్లూతో బాధపడుతున్న సమయంలో.. వైద్యుడు సూచించిన విధంగా యాంటీవైరల్ మందులు తీసుకోవడం వల్ల అనారోగ్యం తీవ్రత, దాని వ్యవధి తగ్గుతుంది. ముఖ్యంగా వ్యాధి లక్షణాలు ప్రారంభమైన మొదటి 48 గంటలలోపు ఈ మందులు తీసుకుంటే చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. సాధారణంగా వీటిని శిశువులకు, తీవ్రమైన లక్షణాలు ఉన్నవారికి లేదా ఆస్తమా వంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి కేటాయించబడతాయి.

హైడ్రేషన్: పిల్లలు పుష్కలంగా నీరు త్రాగడం, ఎక్కువ విశ్రాంతి తీసుకుంటే బాగా కోలుకుంటారు. డీ హైడ్రేషన్‌ సమస్య రాకుండా చూసుకోండి. దీనిని నివారించడంలో గోరువెచ్చని నీరు, ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ వంటి పానీయాలు తాగించాలి.

పిల్లలకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీ నొప్పి, అధిక జ్వరం ఉంటే తల్లిదండ్రులు వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

- రచయిత: డాక్టర్ సునీల్ పవార్,

కన్సల్టెంట్ & లీడ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ నియోనాటాలజీ,

ఫెర్నాండెజ్ హాస్పిటల్

Whats_app_banner