Pregnant Ladies: గర్భవతులకు కోపం వస్తే, కడుపులోని శిశువుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? తల్లీ బిడ్డా ఆరోగ్యం కోసం ఏం చేయాలి?
Pregnant Ladies: గర్భవతిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలి. కోపం తెచ్చుకోకూడదని సలహాలిచ్చేది. కేవలం తల్లి కోసమే కాదు, కడుపులో పెరిగే బిడ్డ కోసం కూడానని నిపుణులు చెబుతున్నారు. కోపం రావడం వల్ల నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం కూడా ఉందట.

మహిళకు గర్భం దాల్చడం అనేది జీవితంలో కీలక ఘట్టం. శారీరకంగా, మానసికంగా ప్రసవం తర్వాత వారిలో మార్పులు కలుగుతాయి. వాస్తవానికి మహిళల్లో ఆ మార్పు వచ్చేది గర్భిణీగా ఉన్నప్పుడే. అదెలా అంటారా? గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ హార్మోన్ల మార్పుల కారణంగా, మహిళలు తమ శరీరంలో మాత్రమే కాకుండా, మానసికంగానూ అనేక మార్పులకు గురవుతుంటారు. దీనిని సాధారణంగా మూడ్ స్వింగ్స్ అంటారు. గర్భవతి అయిన స్త్రీ మానసిక భావోద్వేగ ఆరోగ్యం ఆమె గర్భంలోని శిశువుపై లోతైన ప్రభావం చూపుతుంది. అందుకే, పెద్దలు, వైద్యులు గర్భంలోని బిడ్డ ఆరోగ్యకరమైన అభివృద్ధికి తల్లి సంతోషంగా ఉండాలని, తనను తాను నియంత్రించుకుంటూ సంతోషంగా ఉండాలని సలహాలు ఇస్తుంటారు.
ఇదిలా ఉంచితే, చాలా మంది గర్భవతుల్లో శరీరంలోని హార్మోన్ల మార్పుల కారణంగా అధిక ఒత్తిడి, చిరాకు ఉంటాయి. మీకు కూడా అలా ఉంటే, గర్భధారణ సమయంలో కోపం, ఒత్తిడి మీ బిడ్డ అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోండి. అంతేకాకుండా దాని నుండి తప్పించుకునే పరిష్కారాలు కూడా తెలుసుకోండి.
గర్భధారణ సమయంలో కోపంగా ఉంటే శిశువుపై ఎలాంటి ప్రభావం కనిపిస్తుందంటే,
మానసిక అభివృద్ధిపై ప్రభావం
గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీ కోపంగా ఉంటే, ఆమె గర్భంలోని శిశువు మానసిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శిశువు నాడీ వ్యవస్థ గర్భం దాల్చిన ఆరో నెల నుంచి అభివృద్ధి చెందుతుంది. దీని వలన, గర్భంలోని శిశువు ప్రతి భావనను అనుభవిస్తుంది. గర్భధారణ సమయంలో అధిక కోపం ఉన్న తల్లుల శిశువులకు జన్మ ఇచ్చిన తర్వాత ప్రవర్తన సంబంధిత సమస్యలు ఉండవచ్చు.
ఆరోగ్య సంబంధిత సమస్యలు
అధిక ఒత్తిడి, కోపాన్ని ఎదుర్కొనే మహిళల శరీరంలో కార్టిసోల్, అడ్రినలిన్ హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. ఈ హార్మోన్లు తల్లి శరీరంలో ఒత్తిడిని పెంచుతాయి. అలాగే ప్లాసెంటా ద్వారా శిశువుకు చేరుకొని, శిశువు హృదయ స్పందనను వేగవంతం చేసి, గుండె అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
అభివృద్ధిలో అడ్డంకులు
గర్భిణీ స్త్రీ అధిక కోపం వల్ల ఆమె శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. ఇది గర్భంలోని శిశువు అభివృద్ధి ప్రక్రియను ప్రభావితం చేసి, శిశువు మానసిక స్థితి, నిద్ర, అభివృద్ధిలో అడ్డంకులను సృష్టిస్తుంది.
అకాల ప్రసవం
చాలా సార్లు అధిక కోపం, ఒత్తిడి శిశువు తక్కువ బరువు లేదా అకాల ప్రసవానికి కారణం కావచ్చు.
గర్భవతుల్లో కోపాన్ని నియంత్రించే మార్గాలు
- యోగా మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. కోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వైద్యుని సలహా తీసుకొని, మీరు తేలికపాటి యోగాసనాలను మీ రోజువారీ కార్యక్రమంలో చేర్చుకోవచ్చు.
- వాకింగ్ లాంటి తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. అదనంగా ఎక్సర్ సైజులు చేయాలనుకుంటే వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమం.
- సరైన మొత్తంలో క్రమం తప్పకుండా నీరు తీసుకుంటూ ఉండాలి.
- సమతుల్య, పోషకాలు ఉండే ఆహారం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
- శారీరక, మానసికంగా బలపడటానికి తేలికపాటి మసాజ్ చేసుకుంటూ ఉండండి.
- చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండేందుకు తరచూ స్కిన్ కేర్ ప్రొడక్టులు వాడుతూ ఉండాలి.
- గర్భధారణ సమయంలో నిద్ర కోసం సరిపడా సమయాన్ని కేటాయించండి. నిద్రలేమి వల్ల మహిళలకు చిరాకు, కోపంరావచ్చు.
సంబంధిత కథనం