hair loss with helmet: హెల్మెట్ వల్ల జుట్టు రాలకూడదంటే.. ఇలా మేలు-precautions to take while wearing helmet for preventing hair loss ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Loss With Helmet: హెల్మెట్ వల్ల జుట్టు రాలకూడదంటే.. ఇలా మేలు

hair loss with helmet: హెల్మెట్ వల్ల జుట్టు రాలకూడదంటే.. ఇలా మేలు

hair loss with helmet: హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువవుతోందా? అయితే ఈ చిట్కాలు పాటించండి. సమస్య వెంటనే తగ్గుతుంది.

హెల్మెట్ వల్ల జుట్టు రాలడం (pexels)

హెల్మెట్ వల్ల జుట్టు రాలుతుందా అంటే.. అవును. ఆ సమస్య ఎదుర్కుంటున్న వాళ్లు చాలా మందే ఉంటారు. ప్రాణ సంరక్షణ కోసం హెల్మెట్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. కానీ తరచూ వాడుతుండటం వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది. హెల్మెట్ తీయగానే కొన్ని సార్లు జుట్టు కూడా కనిపిస్తుంది. చెమట ఎక్కువగా రావడం, బ్యాక్టీరియా, నాణ్యత లేని హెల్మెట్లు వాడటం వల్ల ఈ సమస్య మొదలవుతుంది. హెల్మెట్ పెట్టుకున్నపుడు జుట్టు ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే జుట్టు రాలే సమస్య మరింత ఎక్కువవుతుంది.

హెల్మెట్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  1. హెల్మెట్ లోపల ఒక క్లాత్ ఏదైనా పెట్టండి. దీనివల్ల హెల్మెట్ లోపలి భాగం వల్ల జుట్టు దెబ్బతినదు. చెమట కూడా పీల్చుకుంటుంది. దీన్ని కూడా తరచూ శుభ్రం చేసుకోవాలి. దూర ప్రయాణాలు చేస్తున్నపుడు నాణ్యత ఉన్న బైకర్స్ మాస్క్ వాడండి. హెల్మెట్ వల్ల జుట్టు తెగిపోకుండా అది కాపాడుతుంది.
  2. జుట్టు తడిగా ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకోకండి. దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు మొదలై చుండ్రు, దురద సమస్యతో పాటూ జుట్టు కూడా రాలుతుంది. తడిగా ఉన్నపుడు జుట్టు బలహీనంగా ఉంటుంది కాబట్టి త్వరగా ఊడుతుంది కూడా. పూర్తిగా ఆరాకే హెల్మెట్ పెట్టుకోండి.
  3. మంచి క్వాలిటీ హెల్మెట్ ప్రమాదాలు జరిగినపుడు కాపాడటమే కాదూ, జుట్టుకు కూడా ఇబ్బంది రానివ్వదు. అసౌకర్యంగా ఉండదు. కాబట్టి మీకు సౌకర్యంగా ఉండి నాణ్యమైన హెల్మెట్ ఎంచుకోండి.
  4. వారానికోసారి తప్పకుండా హెల్మెట్ లోపల వైపు కూడా శుభ్రం చేసుకోండి. లోపల ఉండే కుషనింగ్ మీద ఉన్న మురికి తొలగించండి.
  5. హెల్మెట్ వాడనప్పుడు కూడా గాలి తగిలే చోట పెట్టండి. లేదంటే ఫంగస్ వల్ల జుట్టుకు హాని జరుగుతుంది. చుండ్రు సమస్యకు కారణమవుతుంది. హెల్మెట్ ను అప్పుడప్పుడు ఎండలో పెడుతుండండి. ఇది సహజంగా బ్యాక్టీరియా తొలగించే ఒక మార్గం అనుకోండి.
  6. హెల్మెట్ తీసేటపుడు లాగకుండా మెల్లగా తీయండి. లేదంటే దానికి అతుకున్న జుట్టు ఊడిపోతుంది. అలాగే వేరే వాళ్ల హెల్మెట్లు వాడకపోవడమే మంచిది. వాడాల్సి వస్తే లోపల తప్పకుండా ఏదైనా క్లాత్ పెట్టుకోండి.
  7. వీటన్నింటితో పాటూ జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. రెండ్రోజులకోసారి నూనెతో తల మర్దనా చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. తలస్నానం చేసే ముందు ఒక 10 నిమిషాలు కలబంద గుజ్జు లేదా అలోవెరా జెల్ తలకు రాసుకోండి. చుండ్రు సమస్య తగ్గుతుంది.
  8. మహిళలు హెల్మెట్ ధరించేటపుడు వదులుగా జడ వేసుకోవడం మేలు. హై పోనీటెయిల్, హై బన్ వేసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది.