Prawns Vankaya Curry: పచ్చి రొయ్యలు వంకాయ ఇగురు కూర ఇలా వండారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, రెసిపీని ప్రయత్నించండి
Prawns Vankaya Curry: నాన్ వెజ్ ప్రియులకు పచ్చి రొయ్యలు వంకాయ కూర పేరు చెబితేనే నోరూరు పోతుంది. వేడి వేడి అన్నంలో ఈ కూరను కలుపుకుని చూడండి. మీకు నచ్చడం ఖాయం. రెసిపీ కూడా చాలా సులువు.
వంకాయ కూరను, రొయ్యల కూరను విడివిడిగా తిని ఉంటారు. ఈ రెండింటిని కలిపి తిని చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది. వంకాయల్లో, ఎండు రొయ్యలు వేసి వండే వారి సంఖ్య ఎక్కువ. నిజానికి ఎండు రొయ్యలు కన్నా వంకాయల్లో పచ్చి రొయ్యలు వేసి వండితే ఇగురు అదిరిపోతుంది. వేడివేడిగా తింటే రుచి మాములుగా ఉండదు. ఒకసారి ఈ కూరను అన్నంలో కలుపుకుని తిని చూడండి. మీరు అభిమానులు అయిపోతారు. దీన్ని వండడానికి కేవలం అరగంట సమయం చాలు. పచ్చి రొయ్యలు వంకాయ ఇగురు రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
పచ్చిరొయ్యలు వంకాయ ఇగురు రెసిపీకి కావలసిన పదార్థాలు
పచ్చి రొయ్యలు - అర కిలో
వంకాయలు - పావు కిలో
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
గరం మసాలా - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
పసుపు - పావు స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కారం - ఒక స్పూన్
నూనె - రెండు స్పూన్లు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - నాలుగు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
పచ్చిరొయ్యలు వంకాయ ఇగురు కూర రెసిపీ
1. పచ్చి రొయ్యలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. ఆ గిన్నెలోనే పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేయాలి.
2. ఇప్పుడు వంకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి నీటిలో వేసుకోవాలి.
3. ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టాలి.
5. కళాయిలో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని వేసి బాగా కలుపుకోవాలి.
6. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి బాగా వేయించాలి.
7. ఇవి రంగు మారేవరకు వేయించుకోవాలి.
8. ఆ తర్వాత వంకాయ ముక్కలను వేసి ఉప్పు చల్లాలి.
9. మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. వంకాయలు మెత్తగా అవుతాయి.
10. ఆ తర్వాత పచ్చి రొయ్యలను వేసి కలుపుకొని మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి.
11. తర్వాత మూత తీసి పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి.
12. గరం మసాలా కూడా వేసి కలపాలి.రొయ్యలు ఉడకడానికి సరిపడా నీళ్లను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
13. పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత ఇగురు లాగా అవుతుంది.
14. అప్పుడు పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ పచ్చి రొయ్యలు వంకాయ ఇగురు రెడీ అయినట్టే.
15. దీన్ని వండినప్పుడే తినేయాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది.
రొయ్యల ప్రయోజనాలు
మాంసాహార ప్రియులకు రొయ్యలు అంటే ప్రాణం. ముఖ్యంగా పచ్చి రొయ్యలు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇవి మన మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. రొయ్యల్లో ఉండే సెలీనియం గుండె ఆరోగ్యాన్ని, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రొయ్యల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి అత్యవసరమైనవి. ప్రోటీన్లు, విటమిన్ డి, విటమిన్ బి3 వంటి ఎన్నో పోషకాలు రొయ్యల్లో ఉంటాయి. ఇక వంకాయల్లో కూడా ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి3, విటమిన్ b6, యాంటీ ఆక్సిడెంట్లు బీటా కెరాటిన్ ఉంటాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్ రాకుండా అడ్డుకుంటాయి. కాబట్టి వంకాయ పచ్చి రొయ్యలు వేసి ఉండే ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది.