Potato Poha: పిల్లల కోసం టేస్టీ పొటాటో పోహా, వారికి ఈ బ్రేక్ ఫాస్ట్ నచ్చడం ఖాయం-potato poha recipes in telugu know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Potato Poha: పిల్లల కోసం టేస్టీ పొటాటో పోహా, వారికి ఈ బ్రేక్ ఫాస్ట్ నచ్చడం ఖాయం

Potato Poha: పిల్లల కోసం టేస్టీ పొటాటో పోహా, వారికి ఈ బ్రేక్ ఫాస్ట్ నచ్చడం ఖాయం

Haritha Chappa HT Telugu

Potato Poha: పోహాతో బ్రేక్ ఫాస్ట్ ఎంతో మంది తింటారు. ఒకసారి బంగాళదుంపలతో ప్రయత్నించి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పొటాటో పోహా ఎలా చేయాలో తెలుసుకోండి.

ఆలూ పోహా రెసిపీ

Potato Poha: ఆలు పోహా లేదా పొటాటో పోహా... ఎలా పిలుచుకున్నా ఈ బ్రేక్ ఫాస్ట్ రుచిగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. అల్పాహారంలో దీన్ని తినడం వల్ల పిల్లలకు ఎక్కువసేపు శక్తి అందుతుంది. దీన్ని చేయడం చాలా సులువు. కేవలం పావుగంటలో దీన్ని వండేయచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీగా కూడా దీన్ని వినియోగించవచ్చు. పెద్దలు కూడా దీని రుచికి దాసోహం అవుతారు. ఈ బంగాళదుంప పోహా బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో తెలుసుకోండి.

ఆలూ పోహా రెసిపీకి కావలసిన పదార్థాలు

పోహా - రెండు కప్పులు

బంగాళదుంప - ఒకటి

వేరుశనగ పలుకులు - గుప్పెడు

పచ్చిమిర్చి - మూడు

ఉల్లిపాయ - ఒకటి

నూనె - రెండు స్పూన్లు

పసుపు - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

ఆవాలు - పావు స్పూను

శెనగపప్పు - అర స్పూను

మినప్పప్పు - అర స్పూను

కరివేపాకులు - గుప్పెడు

కొత్తిమీర తరుగు - ఒక స్పూను

నిమ్మరసం - అర స్పూను

ఆలూ పోహా రెసిపీ

1. బంగాళదుంపను ముందుగానే ఉడికించి పొట్టు తీసి మీడియం సైజులో ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు ఒక గిన్నెలో అటుకులను వేయాలి. అందులో నీరు, ఉప్పు, పసుపు వేసి నానబెట్టాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. ఆ నూనెలో ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకులు వేసి వేయించాలి.

5. అలాగే వేరుశనగ పలుకులు కూడా వేసి వేయించుకోవాలి.

6. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకులు వేసి వేయించుకోవాలి.

7. ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి.

8. బంగాళాదుంప ముక్కలు రంగు మారే వరకు వేయించాలి.

9. ఇప్పుడు నీటిలో నానబెట్టిన పోహాను చేతితోనే పిండి కళాయిలో వేసి బాగా కలుపుకోవాలి.

10. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి.

11. కొత్తిమీర తరుగు, నిమ్మరసం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.

12. అంతే టేస్టీ ఆలూ పోహా రెడీ అయినట్టే. ఇది తినే కొద్ది తినాలనిపిస్తుంది.

పోహాను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అటుకులు అంటే బియ్యంతో తయారు చేసినవి. కాబట్టి బియ్యంలో ఉండే పోషకాలన్నీ అటుకుల్లోనూ ఉంటాయి. అంతకుమించి కూడా ఇందులో ఎన్నో లభిస్తాయి. అటుకులలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వు చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి బరువు పెరిగే సమస్య రాదు. ముఖ్యంగా ఇందులో గ్లూటెన్ ఉండదు. కాబట్టి మధుమేహ రోగులు తినడానికి అటుకులు ఉత్తమ ఆహారమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మూత్రపిండాలు, గుండె సమస్యలతో బాధపడేవారు పోహాతో చేసిన ఆహారాన్ని తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాస్త తింటే చాలు పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. ముఖ్యంగా గర్భిణులు పోహాను తినడం చాలా అవసరం. ఇది ఐరన్ తో నిండుగా ఉంటుంది. రక్తహీనత వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.