Potato Fingers Recipe: పిల్లలకు నచ్చే స్నాక్... పొటాటో ఫింగర్స్, ఇలా చేయండి-potato fingers recipe in telugu know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Potato Fingers Recipe: పిల్లలకు నచ్చే స్నాక్... పొటాటో ఫింగర్స్, ఇలా చేయండి

Potato Fingers Recipe: పిల్లలకు నచ్చే స్నాక్... పొటాటో ఫింగర్స్, ఇలా చేయండి

Haritha Chappa HT Telugu

Potato Fingers Recipe: పిల్లలు ఎక్కువగా ఫింగర్ ఫుడ్స్ ఇష్టపడతారు. ఎక్కువగా ఇలాంటి వాటిని బయటకు కొని పెడుతూ ఉంటాం. ఇంట్లోనే పొటాటో ఫింగర్స్ చేసి పెట్టండి.

పొటాటో ఫింగర్స్ రెసిపీ (HomeCookingShow/youtube)

Potato Fingers Recipe: బంగాళదుంపలతో చేసిన వంటకాలను ఎక్కువ మంది పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడూ వేపుడు, కూరలు, బిర్యానీలు పెడితే బోర్ కొట్టేస్తుంది. ఒకసారి వాటితో మంచి స్నాక్ ఐటమ్ చేయండి. పొటాటో ఫింగర్స్ మంచి ఫింగర్ ఫుడ్ అని చెప్పవచ్చు. పిల్లలకు ఇవి ఖచ్చితంగా నచ్చుతుంది. సాయంత్రం పూట బెస్ట్ స్నాక్ రెసిపీ. దీన్ని సులువుగా ఇంట్లోనే చేయొచ్చు. పొటాటో ఫింగర్స్ రెసిపీ ఎలాగో తెలుసుకుందాం.

పొటాటో ఫింగర్స్ రెసిపీకి కావలసిన పదార్థాలు

బంగాళాదుంపలు - రెండు

చాట్ మసాలా - ఒక స్పూను

కారం పొడి - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

మిరియాల పొడి - అర స్పూను

నిమ్మరసం - ఒక స్పూను

బియ్యప్పిండి - పావు కప్పు

బ్రెడ్ ముక్కలు - రెండు

కోడిగుడ్లు - రెండు

పొటాటో ఫింగర్స్ రెసిపీ

1. బంగాళాదుంపలను నీటిలో వేసి పది నిమిషాలు వదిలేయండి. ఇలా చేయడం వల్ల పైన తొక్క త్వరగా వచ్చేస్తుంది.

2. పైన ఉన్న తొక్కను పీల్ చేసి వాటిని సన్నగా, పొడవుగా ఫింగర్స్ లాగా కట్ చేయండి.

3. వీటిని ఒక గిన్నెలో వేయండి. ఆ గిన్నెలో నీళ్లు వేసి ఒక పావుగంట సేపు ఉంచండి.

4. ఆ తర్వాత రెండు మూడు సార్లు మళ్లీ నీళ్లు వేసి శుభ్రం చేయండి.

5. ఇలా చేయడం వల్ల బంగాళదుంపల్లో ఉన్న పిండి పదార్థం కొంతమేరకు వచ్చేస్తుంది.

6. ఇప్పుడు వాటిని తీసి మరో గిన్నెలో వేయండి.

7. అందులోనే ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, కారం వేసి బాగా కలపండి.

8. బంగాళదుంప ముక్కలకు ఇవన్నీ పట్టేలా చేయండి.

9. తర్వాత ఓ పది నిమిషాలు పక్కన పెట్టేయండి.

10. ఇప్పుడు మరో గిన్నెలో రెండు గుడ్లు పగలగొట్టి బాగా గిల కొట్టండి.

11. ఒక ప్లేట్లో బియ్యప్పిండిని వేసి ప్లేటు అంతా పరచండి.

12. బ్రెడ్ ముక్కలను మిక్సీలో వేసి బరకగా పొడిలా చేసుకోండి.

13. దీన్ని కూడా ఒక గిన్నెలో వేయండి.

14. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయండి.

15. నూనె వేడెక్కాక బంగాళదుంప ముక్కలను గుడ్ల మిశ్రమంలో ముంచి బియ్యప్పిండిలో ఒకసారి రోల్ చేయండి.

16. తర్వాత బ్రెడ్ పొడిలో ఇటు అటు తిప్పండి. ఆ ముక్కలను వేడెక్కిన నూనెలో వేసి వేయించండి.

17. అవి లేత గోధుమ రంగు వచ్చేవరకు వేయించండి. అంతే పొటాటో ఫింగర్స్ రెడీ అయినట్టే.

18. వీటిని సాస్ తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతాయి.