Potato Drumstick curry: బంగాళదుంప, మునక్కాడల కూర.. పుల్లగా, రుచిగా..
Potato Drumstick curry: బంగాళదుంపలు, మునక్కాడలు కలిపి చేసుకునే పులుసు కూడా పుల్లగా రుచిగా భలేగుంటుంది. ఈ కూర చేసిన రోజు ఒక ముద్ద ఎక్కువే తింటారు. అదెలా చేయాలో చూసేయండి.
మునక్కాడలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వాటిని వీలైనంత ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఎప్పుడూ మునక్కాడలతో సాంబార్ లేదా పులుసు తిని ఒకే రుచిలా అనిపిస్తుంటే.. బంగాళదుంప, మునక్కాడల కూర ప్రయత్నించండి. ఈ కూర చపాతీల్లోకి, అన్నంలోకి ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. పులుపు ఎక్కువగా తినడం ఇష్టపడితే టమాటాలతో పాటూ కొద్దిగా చింతపండు రసం వేసి వండుకుంటే సరిపోతుంది. రుచి మరింత పెరుగుతుంది.
ట్రెండింగ్ వార్తలు
కావాల్సిన పదార్థాలు:
4 మునక్కాడలు
2 బంగాళదుంపలు
2 టమాటాలు
4 పచ్చిమిర్చి
చిన్న అల్లం ముక్క
పావు టీస్పూన్ పసుపు
1 చెంచా ధనియాల పొడి
1 చెంచా కారం
1 చెంచా కసూరీ మేతీ
2 చెంచాల శనగపిండి
పావు చెంచా గరం మసాలా
4 చెంచాల వంటనూనె
సగం చెంచా జీలకర్ర
చిటికెడు ఇంగువ
1 కరివేపాకు రెబ్బ
తయారీ విధానం:
- ముందుగా బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి, తొక్క తీసి పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- మునక్కాడల్ని కూడా కడిగి, చెక్కు దీసి ఒక అంగుళం ముక్కల్లాగా తరిగి పెట్టుకోవాలి.
- ఇప్పుడు టమాటాల్ని ముక్కలు చేసుకుని, ఆ ముక్కల్ని పచ్చిమిర్చి, అల్లం కలిపి మెత్తని ముద్ద పట్టుకోవాలి.
- కుక్కర్లో నూనె పోసుకుని వేడెక్కాక జీలకర్ర, ఇంగువ , కరివేపాకు వేసి వేగాక టమాటా ముద్ద కూడా కలుపుకోవాలి.
- ధనియాల పొడి, కారం, పసుపు, కసూరీ మేతీ, ఉప్పు వేసి కలుపుకుని బాగా కలుపుకోవాలి. నూనె తేలేదాకా కలుపుతూ ఉండాలి.
- ఇప్పుడు కాస్త శనగపిండి కూడా వేసుకుని బాగా కలపుకోవాలి. దీనివల్ల కర్రీ గ్రేవీకి మంచి చిక్కదనం వస్తుంది.
- ఇప్పుడు మునక్కాడలు, బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకుని రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకోవాలి.
- మీడియం మంట మీద రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. నీళ్లు ఎక్కువగా అనిపిస్తే మరో రెండు నిమిషాలు ఉడికించుకుని కొత్తిమీర, గరం మసాలా వేసుకుని దించేసుకుంటే చాలు. రుచికరమైన బంగాళదుంప మునక్కాడ కూర సిద్ధం.