Potato Bonda: ఆలూ బోండా ఇలా చేశారంటే టేస్టీగా, యమ్మీగా వస్తుంది, రెసిపీ తెలుసుకోండి
Potato Bonda: ఆలూ లేదా బంగాళాదుంపతో చేసే స్నాక్స్ ఎంతో రుచిగా ఉంటాయి. వీటితో చేసే ఆలూ బోండా ఎంతో రుచిగా ఉంటుంది. దీని రెసిపీ ఎంతో సులువు. పిల్లలకు ఇది చాలా నచ్చుతుంది.

సాయంత్రం వేళల్లో టేస్టీ స్నాక్స్ తింటూ ఉంటారు. ముఖ్యంగా పకోడీలు, ఆలూ బోండాలు వంటివి ఇష్టంగా తింటారు. బోండాలు, వడలు ఇష్టపడేవారి సంఖ్య కూడా ఎక్కువే. బంగాళాదుంపలతో చేసే ఈ టేస్టీ స్నాక్స్ చేయడం కూడా చాలా సులువు. బయట దొరికే ఆలూ బోండాలు ఆరోగ్యానికి కీడు చేస్తాయి. వీటిని బయట ఒకే నూనెను పదే పదే వాడుతూ ఉంటారు. అలాంటి నూనెను వాడడం వల్ల అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లోనే వీటిని ఆరోగ్యకరంగా వండుకోవచ్చు. ఆలూ బోండా రెసిపీ ఇక్కడ ఇచ్చాము.
ఆలూ బోండా రెసిపీకి కావాల్సిన పదార్థాలు
ఆలూ బోండా రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బంగాళాదుంపలు - రెండు
ఆవాలు - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను
పచ్చిమిర్చి - రెండు
ఉల్లిపాయ - ఒకటి
ఉప్పు - రుచికి సరిపడా
ధనియాల పొడి - అర స్పూను
గరం మసాలా - అర స్పూను
పసుపు - పావు స్పూను
నిమ్మరసం - ఒక రసం
కారం - అర స్పూను
శెనగపిండి - ముప్పావు కప్పు
బియ్యంపిండి - పావు కప్పు
నీరు - తగినన్ని
నూనె - డీప్ ఫ్రై చేయడానికి
ఆలూ బోండా రెసిపీ
1. ఆలూ బోండా చేయడానికి ముందుగా బంగాళాదుంపలను కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించాలి.
2. పైన పొట్టు తీసి చేత్తోనే మెదుపుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేయాలి.
4. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలపాలి.
5. ఇందులో ఉల్లిపాయల తరుగు వేసి బాగా వేయించాలి.
6. అవి వేగాక రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
7. అందులో మెదిపిన బంగాళాదుంపలు వేసి బాగా కలుపుకోవాలి.
8. పసుపును, నిమ్మరసాన్ని వేసి కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
9. ఒక గిన్నెలో శెనగపిండి, బియ్యంపిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
10. అందులో పసుపు, కారం వేసి కలపాలి. అందులో నీళ్లు బాగా కలిపి పిండిలా కలుపుకోవాలి.
11. ఇప్పుడు బంగాళాదుంప మిశ్రయాన్ని చిన్న ఉండల్లా చుట్టి పెట్టుకోవాలి.
12. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి.
13. ఆ నూనె వేడెక్కాక బంగాళాదుంప లడ్డూని శెనగపిండి మిశ్రమంలో ఉంచి నూనెలో వేయాలి.
14. దీన్ని అన్నివైపులా వేగించుకున్నాక తీసి టిష్యూ పేపర్ మీద వేసుకోండి. అంతే టేస్టీ ఆలూ బోండా రెడీ అయినట్టే.
ఆలూ బోండా రెసిపీ చాలా సులువు. బంగాళాదుంపలతో చేసే ఈ వంటకం పిల్లలకు బాగా నచ్చుతుంది. ఇవి తింటే పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. ఒక్కసారి వండి చూడండి... మీకు ఇవి బాగా నచ్చుతుంది.