కలయిక తర్వాత మీకూ ఇలాగే అనిపిస్తుందా? ఈ లక్షణాలుంటే నిర్లక్ష్యం వద్దు-post sex symptoms that should not be neglected ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  కలయిక తర్వాత మీకూ ఇలాగే అనిపిస్తుందా? ఈ లక్షణాలుంటే నిర్లక్ష్యం వద్దు

కలయిక తర్వాత మీకూ ఇలాగే అనిపిస్తుందా? ఈ లక్షణాలుంటే నిర్లక్ష్యం వద్దు

Koutik Pranaya Sree HT Telugu
Aug 13, 2024 07:54 AM IST

కలయిక తర్వాత ఈ మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు. శృంగారంలో పాల్గొన్న తర్వాత మహిళల శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. కొన్నింటిని సాధారణంగానే పరిగణించినా.. కొన్నింటికి వైద్య సలహా అవసరం.

కలయిక తర్వాత కనిపించే లక్షణాలు
కలయిక తర్వాత కనిపించే లక్షణాలు (freepik)

కలయిక తర్వాత మంచి అనుభూతి కలగాలి. ఆనందం పెరగాలి. అలాకాకుండా కొన్ని సమస్యల వల్ల ఆనందాన్ని అనుభవించకపోతే నిర్లక్ష్యం చేయకూడదు. దానివల్ల పూర్తి సంతోషం పొందలేకపోతారు. కొన్ని సంకేతాలైతే అనారోగ్యాన్నీ సూచిస్తాయి.

1. స్పాటింగ్:

సెక్స్ తర్వాత స్పాటింగ్, లేదా తేలికపాటి రక్తస్రావం సాధారణం. కానీ ఇది ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. ఇది యోని పొడిగా ఉండటం వల్ల ఈ సమస్య రావచ్చు. దీని కారణంగా సంభోగం సమయంలో యోనిలో ఏమైనా గాయం అయితే ఇలా జరుగుతుంది. సెర్వికల్ పాలిప్స్ కలయిక సమయంలో దెబ్బతినడం వల్ల రక్త స్రావం అవ్వచ్చు. కాబట్టి దీర్ఘాకలికంగా ఈ సమస్య కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు.

2. వాసన:

యోనికి సహజంగానే ఒక రకమైన వాసన ఉంటుంది. ఇది ప్రమాదం కాదు. చెప్పాలంటే నెలసరి చక్రం అంతా ఆ వాసనలో మార్పు వస్తూ ఉంటుంది కూడా. కాకపోతే ఎక్కువ రోజుల పాటూ అక్కడ దుర్వాసన వస్తుంటే మాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. ఇది బ్యాక్టీరియా లేదా శృంగారంలో పాల్గొనడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లకు సంకేతం కావచ్చు.

3. మంట:

ఎప్పుడో ఒకసారి శృంగారం తర్వాత మంట రావడం సాధారణం కావచ్చు కానీ నిర్లక్ష్యం వద్దు. ముఖ్యంగా తట్టుకోలేనంత మంట ఉంటే శ్రద్ధ తీసుకోవాల్సిందే. ప్రతిసారీ ఇలాగే అనిపిస్తే మాత్రం ఏదో అలర్జీకి సూచన. కలయిక సమయంలో ఎక్కువగా రాపిడి అవ్వడం వల్ల మంట రావచ్చు. అదే కారణం అయితే మీకు నప్పే లూబ్రికెంట్ వాడాలి. అయినా సమస్య అలాగే ఉంటే వైద్యుణ్ని సంప్రదించాలి.

4. నొప్పులు:

కలయిక వెంటనే కటి ప్రాంతంలో ఉండే కండరాల్లో నొప్పి రావడం అస్సలు సహజం కాదు. కలయిక సమయంలో ఒత్తిడి వల్ల ఈ నొప్పి వస్తుంది. కానీ చాలా సేపు అలాగే ఉంటే గర్భాశయంలో గడ్డలకు ఇది సంకేతం కావచ్చు. కాబట్టి ఈ సూచనను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.

5. తలనొప్పి:

సెక్స్ హెడేక్స్ అనే పదం ఎక్కువగా వాడతారు. అంటే సెక్స్ తర్వాత కొంతమందిలో తలనొప్పి వస్తుంది. కలయిక సమయంలో విడుదలయ్యే కొన్ని రకాల హార్మోన్లే దానికి కారణం. అయితే భరించలేని తలనొప్పి మాత్రం అలక్ష్యం చేయకండి. వైద్యుల్ని సంప్రదిస్తే సులభంగా తగ్గిపోయే మందులిస్తారు.

6. మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు:

శృంగారం సమయంలో మూత్ర నాళంలోకి బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది. దీంతో మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు (యూటీఐ) రావచ్చు. దీంతో తరచూ మూత్రానికి వెళ్లాలి అనిపించడం, మూత్రంలో మంట, పొత్తి కడుపులో నొప్పి లాంటివి జరగొచ్చు. ఇవన్నీ ఇన్ఫెక్షన్ సంకేతాలే. వీటిని పట్టించుకోకపోతే సమస్య విపరీతంగా మారతుంది. కిడ్నీలను కూడా దెబ్బతీయొచ్చు.

7. దురద:

శృంగారం కోసం వాడే గర్భనిరోధక పద్ధతుల వల్ల కూడా దురద రావచ్చు. ముఖ్యంగా కాండోమ్స్ లేటెక్స్‌తో తయారు చేస్తారు. ఇవి నప్పక కూడా కొంతమందిలో విపరీతమైన దురద ఉంటుంది. లేదా ల్యూబ్రికెంట్లు ఏమైనా వాడుతున్నా అవి నప్పకపోతే దురద రావచ్చు. సమస్య ఏంటో గుర్తుపట్టి పరిష్కారం తెల్సుకోవాలి.