Ponaganti kura: కలుపు మొక్క కాదిది.. పోషకాల పొనగంటిని పెసరపప్పు చల్లి వండేయండి..
Ponaganti kura: పొనగంటి కూరలో అనేక పోషకాలుంటాయి. దీన్ని పెసరపప్పు వేసి వండుకుంటే రుచి మరింత బాగుంటుంది. ఈ కూర తయారీ విధానంతో పాటూ, పొనగంటి తింటే లాభాలేంటో కూడా తెల్సుకోండి.
చాలామందికి పొనగంటి ఆకుకూర గురించి తెలీదు. కొందరైతే కళ్ల ముందు ఆ చెట్టున్నా కూడా కలుపుమొక్క అనుకుని పక్కన పడేస్తారు. కానీ ఈ పొనగంటి ఆరోగ్యాన్నిచ్చే ఔషధం. దీంట్లో పోషకాలు మెండుగా ఉంటాయి. ఈ ఆకుకూరలో శనగపప్పు, పెసరపప్పు చల్లుకుని కూర వండుకుంటే అద్భుతంగా ఉంటుంది.
ఔషధ మొక్క:
ఈ ఆకులో అనేక ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యకు ఇది మంచి మందులా పనిచేస్తుంది. అలాగే షుగర్‌తో బాధపడేవాళ్లు కూడా దీన్ని తీసుకుంటే నియంత్రణలో ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. మూత్రంలో మంట ఉంటే ఈ పొనగంటి వేర్లను మజ్జిగలో కలిపి తీసుకుంటే సమస్య తగ్గుతుంది. కాబట్టి కలుపుమొక్క అని పక్కన పడేయకుండా దీన్ని ఎలాగైనా ఆహారంలో భాగం చేసుకోండి. ఇప్పుడు దీంతో సింపుల్‌గా రోజూవారీ కూర ఎలా చేయాలో చూడండి. దీంట్లో ఎలాంటి మసాలాలు వాడక్కర్లేదు. పోపుల డబ్బా దినుసులు చాలు.
పొనగంటి పెసరపప్పు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు:
4 కట్టలు పొనగంటి కూర(చిన్న కట్టలు)
1 కప్పు పెసరపప్పు
5 -6 వెల్లుల్లి రెబ్బలు
2 చెంచాల వంటనూనె
సగం టీస్పూన్ శనగపప్పు
పావు టీస్పూన్ ఆవాలు
పావు టీస్పూన్ జీలకర్ర
పావు టీస్పూన్ మినప్పప్పు
2 ఎండుమిర్చి
1 పెద్ద ఉల్లిపాయ, సన్నటి ముక్కలు
1 కరివేపాకు రెమ్మ
4 పచ్చిమిర్చి
సగం చెంచా పసుపు
1 చెంచా ధనియాల పొడి
1 చెంచా కారం
2 చెంచాల కొబ్బరి పొడి
పొనగంటి పెసరపప్పు కూర తయారీ విధానం:
- ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడుక్కుని నీళ్లతో కనీసం రెండు గంటలపాటూ నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు పొనగంటి కూరను కూడా శుభ్రం చేసుకోవాలి. కాడలు ఉంటే తీసేయాలి.
- కడాయి పెట్టుకుని అందులో నూనె పోసుకుని వేడెక్కాక తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి.
- వెంటనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త రంగు మారాక పొనగంటి కూర కూడా వేసుకోవాలి.
- మూత పెట్టి అయిదు నిమిషాల పాటూ మగ్గనిస్తే కూర ఉడికిపోతుంది. అందులో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి.
- నీళ్లు వేసుకోకుండా పొనగొంటిలో ఉండే నీరుతోనే పెసరపప్పు మెత్తగా అవుతుంది.
- ఈలోపు మిక్సీ జార్‌లో ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి పొడి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని ఉడుకున్న పొనగంటిలో వేసుకోవాలి.
- ఒకసారీ అన్నీ కలిసేలా కలియబెట్టి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనిచ్చి దింపేసుకుంటే పొనగంటి పెసరపప్పు కూర రెడీ.