Pest Repellent Plants: గార్డెన్‌లో మొక్కల మధ్య ఈ మొక్కలు నాటండి, చీడపీడలు అస్సలు రావు
Pest Repellent Plants: ఇంటితోటలో అనేక మొక్కలు ఇష్టంగా పెంచుకుంటారు. అయితే చీడపీడల వల్ల మొక్కలు పెరగవు. కాసిన పండ్లు పాడైపోతాయి. ఆ సమస్య రాకుండా కొన్ని మొక్కలు నాటారంటే సహజంగానే క్రిమీసంహారిణిగా పని చేస్తాయి.
ఈ మధ్య ఇంట్లో చిన్న ఖాళీ స్థలం ఉన్నా చక్కగా మొక్కలు పెంచుకుంటున్నారు. సొంతంగా కూరగాయల్ని పండించుకుని తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొత్తగా గార్డెనింగ్ మొదలెట్టిన వారిని బాగా కలవర పెట్టే సమస్య చీడ పీడలు. ఎంతో ఇష్టంగా పెంచుకున్న మొక్కలకు పురుగులు, చీడలు పట్టేస్తుంటే ఏం చేయాలో తెలియక పరిష్కార మార్గాల కోసం వెతుకుతుంటారు. అయితే ఇంటి తోటలో మొక్కల మధ్యలో కొన్ని రకాల మొక్కల్ని ప్రత్యేకంగా పెంచడం వల్ల అవి పెస్ట్ రిపల్లెంట్లుగా లేదా క్రిమీ సంహారకాలుగా పని చేస్తాయి. ఆ మొక్కలేంటో చూడండి.
బంతి మొక్క :
బంతి మొక్కను క్రిమీ సంహారిణిగా వాడే అలవాటు రైతులకు ఎప్పటి నుంచో ఉంది. పొలం మధ్యలో ఒక్కో వరుస వీటిని పెంచేస్తుంటారు. అందువల్ల చీడలు తగ్గడంతోపాటు పూలతో అదనంగా ఆదాయం కూడా దొరుకుతుంది. పెద్ద పెద్ద పొలాల్లోనే కాదండీ.. చిన్న చిన్న ఇంటి తోటల్లో కూడా వీటిని మధ్య మధ్యలో పెంచితే ఉపయోగకరంగా ఉంటుంది.
వెల్లుల్లి :
వెల్లుల్లి మొక్కకు ఒక రకమైన ఘాటు వాసన ఉంటుంది. అందువల్ల పురుగులు, అఫిడ్స్, కొన్ని రకాల ఈగల్లాంటివి దగ్గరకు రావాలంటే పెద్దగా ఇష్ట పడవు. ఆ కారణంగా మీ తోటలో చీడ పీడలు తగ్గుతాయన్నమాట.
తులసి :
మొక్కల మధ్య మధ్యలో కొన్ని తులసి మొక్కల్ని పెంచుకోవడం వల్ల ఈగలు, దోమల్లాంటివి దరి చేరవు. సరిహద్దుల్లో కొంత మంది మొక్కల్ని గోడ చుట్టూ అదే ఆకారంలో పెంచుతూ ఉంటారు. అలాంటి చోట్ల తులసి మొక్కల్ని విరివిగా పెంచుకోవడం వల్ల దోమ పట్టడం లాంటి చీడలు బెడద ఉండదు.
నిమ్మ గడ్డి :
పొడవుగా, ఏపుగా పెరిగే నిమ్మగడ్డి మొక్కను మంచి పెస్ట్ రెపల్లెంట్గా చెప్పవచ్చు. దీన్ని హెర్బల్ టీల్లో ఎక్కువగా వాడుతుంటారు. అలాగే దీని నుంచి నూనెను తీసి అమ్ముతారు. ఇది రాసుకుని నిద్రపోవడం వల్ల దోమలు ఎక్కువగా కుట్టకుండా ఉంటాయి. అలాగే మన తోటలో ఈ గడ్డిని అక్కడక్కడా పెంచడం వల్ల కొన్ని రకాల చీడలు దరి చేరవు.
బిరియానీ ఆకుల చెట్టు :
బిరియానీ ఆకుల చెట్లను తోటలో అక్కడక్కడా పెంచుకోవచ్చు. ఇవి చీమలు, బొద్దింకలు, ఈగలు లాంటి వాటిని దగ్గరకు రానీయవు. అందువల్ల చుట్టూ ఉన్న మిగిలిన మొక్కలు కూడా వీటి ద్వారా రక్షణ పొందుతాయి.
పుదీనా :
పుదీనా జాతికి చెందిన మొక్కలన్నీ ఒక రకమైన ఘాటు వాసనను కలిగి ఉంటాయి. అవంటే కొన్ని రకాల పురుగులకు, కీటకాలకు చాలా భయం. అందుకనే ఇవున్న చోటికి అవి రావు. కాబట్ట మిద్దె తోటలో అయినా, పెరటి తోటలో అయినా అక్కడక్కడా పుదీనా వేసుకుంటే కొన్ని చీడలు దరి చేరకుండా ఉంటాయి.
టాపిక్