వేసవి సెలవులు ప్రారంభం కాగానే ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతారు. ముఖ్యంగా పిల్లలతో సరదాగా గడపడం కోసం, వారిని థ్రిల్ చేయడం కోసం జంగిల్ సాఫారీ వంటివి ప్లాన్ చేస్తారు. మీరు కూడా ఈసారి మీ పిల్లలతో అడవి పర్యటను వెళుతున్నట్లయితే ఇది మీ కోసమే.
ఈ ప్రయాణానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాథమిక నియమాలు, చిట్కాలను ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం. ఇవి మిమ్మల్ని మీ పిల్లలను ఊహించని ప్రమాదాల నుండి కాపాడటమే కాకుండా, మీ మొత్తం పర్యటనను మరింత ఆనందదాయకంగా మారుస్తాయి.
అడవి సఫారీకి వెళ్లేటప్పుడు మీ దుస్తుల రంగుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఎల్లప్పుడూ అడవి నేల, చెట్లు, గడ్డితో కలిసిపోయే సహజమైన రంగుల దుస్తులను ఎంచుకోండి. లేత గోధుమరంగు, ఆకుపచ్చ, బూడిద రంగు వంటివి అనువైనవి. తెలుపు, నలుపు, ప్రకాశవంతమైన రంగులు లేదా నియాన్ రంగుల దుస్తులను పూర్తిగా నివారించండి. ఈ రంగులు అడవి జంతువుల దృష్టిని సులభంగా ఆకర్షిస్తాయి, తద్వారా అనవసరమైన సమస్యలు తలెత్తవచ్చు. మీ దుస్తులు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా చూసుకోండి. ఇది కీటకాలు, ఇతర మొక్కల నుండి రక్షణ కలిగిస్తుంది.
సఫారీ సమయంలో ఫోటోలు, వీడియోలు తీయడం సాధారణమే అయినప్పటికీ కెమెరా, మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్‌ను తప్పనిసరిగా ఆఫ్ చేయాలి. ఫ్లాష్ వెలుతురు అడవి జంతువులను భయభ్రాంతులకు గురిచేయవచ్చు లేదా వాటిని రెచ్చగొట్టవచ్చు. ఇది మీ భద్రతకు, జంతువుల ప్రశాంతతకు కూడా మంచిది కాదు. సహజమైన వెలుతురులోనే జంతువుల అందమైన దృశ్యాలను క్లిక్ చేయండి.
అడవి సఫారీ అంటేనే బయట బహిరంగ ప్రదేశాల్లో తిరగడం. ఇలాంటప్పుడు గంటల తరబడి ఎండలో గడపాల్సి వస్తుంది. కాబట్టి మీ చర్మాన్ని హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి రక్షించుకోవడానికి అధిక SPF కలిగిన సన్‌స్క్రీన్‌ను తప్పనిసరిగా ఉపయోగించండి. మీ ముఖానికి, చేతులకు, బయట కనిపించే ప్రదేశాలలకు దుస్తులతో కప్పి ఉంచని శరీర భాగాలన్నింటికీ సన్‌స్క్రీన్‌ను క్రమం తప్పకుండా అప్లై చేస్తూ ఉండండి.
అడవుల్లో దోమలు, ఈగలు, ఇతర కీటకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కరిస్తే చర్మపు చికాకు, అలెర్జీలు లేదా ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, సమర్థవంతమైన కీటకాల నివారిణిని (ఇన్‌సెక్ట్ రిపెల్లెంట్) మీతో పాటు తీసుకెళ్లడం, దాన్ని తప్పనిసరిగా వాడటం చాలా ముఖ్యం. ఒకవేళ ఏదైనా కీటకం మిమ్మల్ని కాటు వేస్తే వెంటనే ఉపశమనం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది.
సఫారీ గైడ్ సూచనలను ఖచ్చితంగా పాటించండి. వారు చెప్పే వరకు సఫారీ వాహనం (జీప్ లేదా వ్యాన్) నుండి దిగడానికి ప్రయత్నించవద్దు. అడవి జంతువులు ఎక్కడ ఉంటాయో, ఎలా ప్రవర్తిస్తాయో వారికే బాగా తెలుసు. కాబట్టి వారి మాట వినండి. అలాగే ఎల్లప్పుడూ మీ బృందంతో, మీ వాహనంతోనే ఉండండి. అడవిలో ఒంటరిగా తిరగడం ప్రమాదాలకు కారణం అవుతుంది. అలాగే తప్పిపోయే అవకాశం కూడా ఉంది.
చిన్న పిల్లలు సహజంగానే ఉత్సాహంగా ఉంటారు, అడవినీ, అడవిలో జంతువులను చూడగానే వారిలో కుతూహలం పెరిగి శబ్దాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి అడవి జంతువులను చూడటానికి వెళ్తున్నప్పుడు వీలైనంత వరకు చిన్న పిల్లలను తీసుకెళ్లకపోవడం మంచిది. ఒకవేళ తీసుకెళ్లాల్సి వస్తే వారికి ముందుగానే నిశ్శబ్దంగా ఉండటం గురించి, అడవి జంతువుల ఆహార నియమాల గురించి స్పష్టంగా తెలియజేయండి. వారి కదలికలను నిరంతరం గమనిస్తూ ఉండండి.
భద్రతా నియమాలలో ఇది కూడా ఉంది. సఫారీకి వెళ్ళేటప్పుడు, ప్రత్యేకమైన వాసన ఉన్న డియో, పెర్ఫ్యూమ్ లేదా ఇతర సుగంధ ద్రవ్యాలను వాడకండి. ఇవి జంతువులు బలమైన వాసనలకు ఆకర్షించచ్చు లేదా వాటికి అసౌకర్యం కలిగి కోపానికి గురై దాడి చేసే అవకాశం ఉంది.
ఒక రోజులో అడవిలోని అన్ని జంతువులను చూడటం సాధ్యం కాకపోవచ్చు. మీ పర్యటన రెండు లేదా మూడు రోజుల పాటు ఉంటే సఫారీ ప్రాంతంలో అందుబాటులో ఉన్న కాటేజ్‌లలో బస చేయడానికి ప్రయత్నించండి. ఇది మీకు ఎక్కువ సమయం అడవిలో గడపడానికి, వివిధ రకాల జంతువులను వాటి సహజ వాతావరణంలో చూడటానికి అవకాశం ఇస్తుంది. అంతేకాదు ఇది మీ ప్రయాణ అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా, మరపురానిదిగా చేస్తుంది.