Phool Makhana Laddu: టేస్టీ ఫూల్ మఖానా లడ్డూ రెసిపీ, పిల్లలకు ఇది బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు
Phool Makhana Laddu: పూల్ మఖానాతో చేసే రెసిపీలు ఆరోగ్యకరమైనవి. ఇక్కడ మేము పూల్ మఖానాతో సులువుగా లడ్డూ ఎలా చేయాలో ఇచ్చాము. దీని రెసిపీ చాలా సులువు.
పూల్ మఖానా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో చేసే రెసిపీలు చాలా తక్కువ అనుకుంటారు, నిజానికి ఫూల్ మఖానాతో టేస్టీ రెసిపీలు ఎన్నో చేసుకోవచ్చు. ఇక్కడ మేము పూల్ మఖానా లడ్డు రెసిపీ ఇచ్చాము. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా పిల్లలకు రోజుకొక పూల్ మఖాన లడ్డూ పెట్టారంటే వారికి కావలసిన పోషకాలు అన్నీ అందుతాయి. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా అధికంగా వేసాము. కాబట్టి ఇది ఆరోగ్యానికి మేలే చేస్తుంది. ఇక పూల్ మఖానా లడ్డు రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
పూల్ మఖానా లడ్డు రెసిపీకి కావలసిన పదార్థాలు
పూల్ మఖానా - వంద గ్రాములు
నెయ్యి - ఆరు స్పూన్లు
బాదం పలుకులు - అరకప్పు
జీడిపప్పులు - అరకప్పు
పిస్తాలు - గుప్పెడు
కొబ్బరి తురుము - అరకప్పు
బెల్లం తురుము - ఒక కప్పు
నువ్వులు - నాలుగు స్పూన్లు
పుచ్చకాయ సీడ్స్ - నాలుగు స్పూన్లు
యాలకుల పొడి - అర స్పూను
పూల్ మఖానా లడ్డు రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేయాలి.
2. అందులో పూల్ మఖానాను వేసి వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఆ నెయ్యిలో బాదం, జీడిపప్పులు, పిస్తాలు విడివిడిగా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు అదే కళాయిలో నెయ్యి వేసి కొబ్బరి తురుమును వేసి వేయించుకోవాలి.
5. ఇప్పుడు వేయించిన పూల్ మఖానా, జీడిపప్పు, బాదం, పిస్తాలు, కొబ్బరి తురుము మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి బెల్లం తురుము వేయాలి.
7. అలాగే ఒక గ్లాసు నీళ్లు వేసి పాకంలా చేయాలి.
8. ఆ పాకంలో పొడి చేసుకున్న పూల్ మఖానా మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
9. అందులోనే నువ్వులు, పుచ్చకాయ గింజలు, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
10. ఈ మొత్తం మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టుకోవాలి.
11. ఈ లడ్డూలను గాలి చేరబడిన డబ్బాలో వేసి దాచుకుంటే నెలరోజులైనా తాజాగా ఉంటాయి.
12. ఇవి పిల్లలకు ఎంతో బలాన్ని ఇస్తాయి. ఇందులో మనం ఆరోగ్యానికి అవసరమైన పదార్థాలనే వేసాము.
13. ఇవన్నీ కూడా పోషకాలు నిండినవి ఈ లడ్డూలను తినడం వల్ల పిల్లలకు ఎంతో బలం వస్తుంది.
పూల్ మఖానా లడ్డూలో వాడిన నెయ్యి, మఖానా గింజలు, బాదం పప్పులు, పిస్తాలు, జీడిపప్పులు, కొబ్బరి, బెల్లం, నువ్వులు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. కాబట్టి ప్రతిరోజు పిల్లలకు ఒక లడ్డు పెడితే ఎంతో ఆరోగ్య కరం. దీన్ని చేయడం కూడా చాలా సులువు.
టాపిక్