భారతదేశంలోని సాంప్రదాయ దుస్తులలో చీర చాలా ముఖ్యమైనది. దేశవ్యాప్తంగా అన్ని వయసుల స్త్రీలు వారి వారి సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా చీరను రకరకాలుగా ధరించేందుకు ఇష్టపడతారు. చీరకట్టు కేవలం సంస్కృతిని ప్రతిబింబించడం మాత్రమే కాదు.. ఆడవారి అందాన్ని రెట్టింపు చేస్తుంది. చీర(Saree) గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. అవన్నీ పక్కక్కు పెడితే తాజా అధ్యయనాలు చీర గురించి కొన్ని షాకింగ్ నిజాలను వెల్లడించాయి. ప్రతి రోజూ చీర కట్టుకునే మహిళలు కొత్త రకం క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని అవి చెబుతున్నాయి. ఎక్కువ సేపు చీర ధరించే స్త్రీలలో పెట్టికోట్ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయట. పెట్టికోట్ క్యాన్సర్(Petticoat Cancer) కారణాలు, లక్షణాలు, నివారణ వంటి విషయాల గురించి తెలుసుకుందాం రండి.
బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం.. ఎక్కువ సేపు చీర కట్టుకునే మహిళ్లల్లో “పెట్టికోట్ క్యాన్సర్” (Petticoat Cancer) అనే అరుదైన సమస్య తలెత్తుతుంది. ఈ ప్రత్యేకమైన పరిస్థితి సాధారణంగా మహిళల నడుము మధ్య భాగంలో లేదా పొట్ట దగ్గర సంభవిస్తుంది. ఇందుకు కారణం చీరను ఎక్కువ సేపు జాగ్రత్తగా ఉంచుకోవడానికి వారు పెట్టికోట్(లంగా)ను బిగుతుగా కట్టుకోవడమే. లంగా దారం (లేదా లంగా నాడ) వల్ల కలిగే దీర్ఘకాలిక చికాకుచికాకు, రాపిడి, పీడనం కారణంగా వచ్చేదే పెట్టికోట్ క్యాన్సర్. ఇది ఒక అరుదైన చర్మ క్యాన్సర్.. ఇది ముందుగా మహిళలకు నడుము లేదా పొట్ట భాగంలో ఉండే పాత గాయాలు, మచ్చలలో మొదలవుతుంది. దీర్ఘకాలికంగా ప్రమాదకారిగా మారుతుంది.
చీరకట్టు జారిపోకుండా ఉండేందుకు లంగా దారాన్ని చాలా గట్టిగా కట్టుకునే మహిళల్లో పెట్టికోట్ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయి.ఈ దారం నడుము, పొట్ట భాగాల్లో ఒకేచోట నిరంతం కడుతున్నప్పుడు అక్కడ చర్మం రాపిడికి గురవుతుంది, గాలి ఆడదు, చర్మం రంగు మారుతుంది. చికాకు, మంట లాంటి సమస్యలు వచ్చి, తర్వాత అవి పుండ్లుగా మారుతున్నాయి. వీటిని మార్జోలిన్ పుండు అని కూడా పిలుస్తారు. చాలా అరుదైన సందర్భాల్లో ఇది ప్రాణాంతక కణితిగా కూడా మారుతుంది.
భారతదేశంలో వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే మహిళల్లో, అలాగే తేమతో కూడిన వాతావరణంలో జీవించే వారిలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని వారిలో ఈ పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
లంగా గట్టిగా కట్టుకున్నప్పుడు నడుము ప్రాంతంలో తరచు చెమట, దుమ్ము పేరుకుపోతుంది. ఫలితంగా అక్కడ దురద, మంట లాంటి సమస్యలు ఏర్పడతాయి.గోకడం వల్ల చర్మం రంగు మారి, పొలుసులుగా లేవడం ప్రారంభమువుతంది.
ప్రతి రోజూ చీర కట్టుకునే వారిలో మాత్రమే కాదు. చుడీదార్లు, ధోతీల నాడలు కూడా బిగుతుగా కట్టుకుని ఎక్కువ సేపు ఉండే వారిలో కూడా పెట్టికోట్ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది అరుదైన పరిస్థితి అయినప్పటికీ దీని గురించి ముందే అవగాహన కలిగి ఉంటే సమస్య ప్రాణాంతం కాకుండా ఉంటుంది.
◉ బిగుతుగా ఉండే లంగాలను నివారించండి: లంగా(Petticoat)ను గట్టిగా, బిగుతుగా కట్టడం మానుకోండి, ముఖ్యంగా మీరు చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు నడుము ప్రాంతంలో దురద, చికాకు వంటివి ఎదురైనప్పుడు లంగాను వదులుగా కట్టుకోండి.
◉ వెడల్పాటి నడుము బ్యాండ్‌ను ఎంచుకోండి: లంగాలో వెడల్పాటి నడుము బ్యాండ్ వెడల్పుగా ఉండే నాడాను ఎంచుకోవడం వల్ల ఒత్తిడి, రాపిడి వంటివి జరగకుండా ఉంటాయి.
◉ గాలి ప్రసరణ: మీరు లంగాను కట్టే నడుము స్థాయిని మారుస్తూ ఉండండి. ఇంట్లో ఉన్నప్పుడు, గాలి ప్రసరణకు సహాయపడటానికి ఎలాస్టిక్ నడుము బ్యాండ్ ఉన్న వదులైన పెట్టుకోట్ లేదా ప్యాంట్‌ను ఎంచుకోండి.
◉ పరిశుభ్రతను కాపాడుకోండి: నడుము ప్రాంతాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం కూడా అవసరం, ముఖ్యంగా బయట పనిచేసే వారికి, ఎందుకంటే వారు దుమ్ము, చెమటను పేరుకుపోయే అవకాశం ఉంది.ఇవి చర్మ సమస్యలకు కారణమవుతాయి.
◉ క్లాత్ విషయంలో జాగ్రత్తలు తీసుకొండి: కొన్ని రకాల వస్త్రాలు చర్మాన్ని అసౌకర్యానికి గురి చేస్తాయి. దురద, రాపిడి వంటి వాటిని పెంచుతాయి.కనుక చర్మాన్ని సౌకర్యంగా ఉండేలా కాటన్ వంటి వస్త్రాలను ఎంచుకోండి.